Oxygen: ఆయువు పెంచేందుకు వాయువేగంతో..!
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Oxygen: ఆయువు పెంచేందుకు వాయువేగంతో..!

ఆక్సిజన్‌ ఉత్పత్తి పెంపుదలకు రాష్ట్రప్రభుత్వం భారీ కసరత్తు
మూతపడిన రెండు ప్లాంట్లను తెరిచేందుకు ఏర్పాట్లు
పీఎం కేర్‌ కింద డీఆర్‌డీవో సహకారంతో 50 ప్లాంట్లు

ఈనాడు, హైదరాబాద్‌: ఆక్సిజన్‌ ఉత్పత్తిని మరింత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. తెలంగాణలో ప్రస్తుతం రోజుకు వంద మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి అవుతోంది. ఆ మొత్తాన్ని 180 మెట్రిక్‌ టన్నులకు పెంచేందుకు యుద్ధప్రాతిపదికన ప్రభుత్వం సమాయత్తమవుతోంది. రానున్న పది, పదిహేను రోజుల వ్యవధిలో ఈ అదనపు ఉత్పత్తిని అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. కరోనా కల్లోలం కారణంగా ప్రస్తుతం ఆక్సిజన్‌ డిమాండ్‌ గణనీయంగా పెరుగుతోంది. కేసుల సంఖ్య ఇదే రీతిలో ఉంటే డిమాండ్‌ మరింత పెరుగుతుందని ఆరోగ్యశాఖ అంచనాల నేపథ్యంలో ,ప్రభుత్వం ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తోంది. రోజుకు సుమారు 350 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను రాష్ట్రం సమకూర్చుకుంటోంది. ఆ మొత్తాన్ని 500 మెట్రిక్‌ టన్నులకు పెంచాలని నిర్ణయించింది. కర్ణాటకలోని బళ్లారి, ఒడిశాలోని అనుగుల్‌ నుంచి తెలంగాణకు ఆక్సిజన్‌ రైలు, రోడ్డు, వాయు మార్గాల ద్వారా వస్తోంది. వీటితో పాటు  పీఎం కేర్‌ నుంచి రాష్ట్రానికి మంజూరైన 50 ఆక్సిజన్‌ ప్లాంట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. వీటన్నిటికీ డీఆర్‌డీవో సాంకేతిక సహకారాన్ని అందిస్తోంది. తొలి ప్లాంటును తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్‌)లో శనివారం ప్లాంటును ప్రారంభించింది.

ఆ రెండింటి నుంచి 80 మెట్రిక్‌ టన్నులు
హైదరాబాద్‌, భద్రాచలంలో మూతపడిన ఆక్సిజన్‌ ప్లాంట్ల పునరుద్ధరణకు రంగం సిద్ధం అవుతోంది. ఈ రెండు ప్లాంట్లు ప్రారంభమైతే రోజుకు 80 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అందుబాటులోకి వస్తుందని పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌ ‘ఈనాడు’తో చెప్పారు. హైదరాబాద్‌లోని పాశ మైలారంలో మూతపడిన ఎయిర్‌ వాటర్‌ ఆక్సిజన్‌ ప్లాంటును పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఆ ప్లాంటుకు సంబధించిన యాజమాన్యంతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు నిర్వహించింది. వచ్చే వారంలోగా ఆ ప్లాంటును తెరిచేందుకు యాజమాన్యం సంసిద్ధత వ్యక్తం చేసింది. అది అందుబాటులోకి వస్తే రోజుకు 60 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి అవుతుంది. భద్రాచలంలోని ఐటీసీకి చెందిన ఆక్సిజన్‌ ప్లాంటును కూడా పునరుద్ధరించేందుకు యాజమాన్యం ముందుకు వచ్చింది. ఆ ప్లాంటు ద్వారా రోజుకు 20 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ ఉత్పత్తయ్యే క్రయోజనిక్‌ ఆక్సిజన్‌ నిల్వ చేసేందుకు వీలుగా మెగా ఇంజినీరింగ్‌ సంస్థ స్పెయిన్‌ నుంచి ట్యాంకర్లను దిగుమతి చేసుకోనుంది. రాష్ట్రంలోని ప్లాంట్ల నుంచి గతంలో రోజుకు 80 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తయ్యేది. కరోనాతో ఆక్సిజన్‌ అవసరాలు పెరగడంతో పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కోరటంతోపాటు ఆయా సంస్థలు ఉత్పత్తిని పెంచాయి. పూర్తిస్థాయి సామర్ధ్యం మేరకు రోజుకు వంద మెట్రిక్‌ టన్నులను ఉత్పత్తి చేస్తున్నాయి.

రెండు వేల పడకలకు...
పీఎం కేర్‌ పథకం కింద రాష్ట్రానికి మంజూరు చేసిన 50 ప్లాంట్ల ద్వారా 1,500 నుంచి రెండు వేల పడకలకు ఆక్సిజన్‌ అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటిని రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్‌లోని నిమ్స్‌, ఫీవర్‌ ఆసుపత్రుల్లో కూడా ఈ ప్లాంట్లు ఏర్పాటు అవుతున్నాయి. రానున్న పదిహేను రోజుల్లో అన్ని ప్లాంట్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. గాలి నుంచి ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసే ప్లాంట్లు హైదరాబాద్‌లోని గాంధీ, ఖమ్మం, కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రులకు కేంద్రం మంజూరు చేసింది. ఆ ప్లాంట్ల నుంచి ఆయా ఆసుపత్రులు ఆక్సిజన్‌ వినియోగిస్తున్నాయి.

ఆక్సిజన్‌ డిమాండుకు తగినట్లుగా

ఆక్సిజన్‌ డిమాండు పెరుగుతుండటంతో కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. మరో పది నుంచి పదిహేను రోజుల్లో రాష్ట్రంలో మరింత ఉత్పత్తి అందుబాటులోకి వస్తుంది. 50 ఆస్పత్రుల్లో కూడా ప్లాంట్లు త్వరితగతిన పూర్తి చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. ప్రస్తుతం ఉన్న ప్లాంట్ల నుంచి పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు ఆక్సిజన్‌ ఉత్పత్తి అవుతోంది. ఆక్సిజన్‌ నిల్వ చేసే ట్యాంకులను కూడా పెద్ద సంఖ్యలో నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నాం.

- జయేష్‌ రంజన్‌ పరిశ్రమలు, ఐటీ ముఖ్య కార్యదర్శి

Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని