Lockdown: హడావుడిగా సొంతూళ్లకు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Lockdown: హడావుడిగా సొంతూళ్లకు

లాక్‌డౌన్‌ ప్రకటనతో అప్పటికప్పుడు ప్రయాణాలు
సాయంత్రం 4 నుంచి 6.30 గంటల వరకు బస్టాండ్లలో రద్దీ
హైదరాబాద్‌ నుంచి అదనపు  సర్వీసులు నడిపిన అధికారులు

ఏపీ, ఇతర రాష్ట్రాలకు రైళ్లలో బయలుదేరిన జనంఈనాడు, హైదరాబాద్‌: మధ్యాహ్నం వరకు బోసిపోయిన బస్టాండ్లకు జనం ఒక్కసారిగా పోటెత్తారు. అప్పటివరకు ప్రయాణికుల కోసం డ్రైవర్లు, కండక్టర్లు ఎదురుచూడగా.. పరిస్థితి మారిపోయింది. బస్సుల కోసం ప్రయాణికులే ఎదురుచూడాల్సి వచ్చింది. పెరిగిన తాకిడితో తొలుత ఎటూ పాలుపోని అధికారులు ఆ తర్వాత రద్దీకి తగ్గట్లు అదనపు బస్సులు నడిపారు. బుధవారం నుంచి లాక్‌డౌన్‌ అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో హైదరాబాద్‌ నుంచి ప్రజలు సొంతూరి బాట పట్టారు. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక తదితర రాష్ట్రాలకు బస్సులు లేకపోవడంతో రైళ్లలో బయలుదేరారు. రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల సంఖ్య పెరిగింది. హైదరాబాద్‌ నుంచి తెలంగాణ జిల్లాలకు వెళ్లేవారి రద్దీ సాయంత్రం 7 గంటల వరకు కొనసాగింది.

కిటకిటలాడిన బస్టాండ్లు
రాష్ట్రంలో లాక్‌డౌన్‌పై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే అనేక మంది బ్యాగులు సర్దుకుని బస్టాండ్ల బాటపట్టారు. సాయంత్రం 4 గంటల నుంచి రద్దీ మొదలైంది. సికింద్రాబాద్‌లోని జేబీఎస్‌ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. ఆదిలాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాలకు పెద్దసంఖ్యలో తరలివెళ్లారు. ఒక్క పికెట్‌ డిపో నుంచే రెగ్యులర్‌ సర్వీసులకు అదనంగా 10 ప్రత్యేక బస్సులు వేసినా సరిపోలేదు. యాదాద్రి, వరంగల్‌ అర్బన్‌, రూరల్‌, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలకు వెళ్లే బస్సులు, ప్రయాణికులతో ఉప్పల్‌లో రద్దీ పెరిగింది. దిల్‌సుఖ్‌నగర్‌ బస్టాండ్‌, ఎల్‌బీనగర్‌ నుంచి నల్గొండ, సూర్యాపేట జిల్లాల వైపు పెద్దఎత్తున వెళ్లారు. లాక్‌డౌన్‌ కారణంగా   బుధవారం నుంచి ప్రయాణాలు చేయలేమని.. ఆ తర్వాతా పొడిగింపు ఉండొచ్చన్న భావనతో మంగళవారం సాయంత్రమే హడావుడిగా ప్రయాణాలు పెట్టుకున్నారు. మరోవైపు ఇప్పటికే పిల్లలు సహా గ్రామాలకు వెళ్లిపోయి కొద్ది రోజుల తర్వాత హైదరాబాద్‌కు తిరిగి రావాలనుకున్నవారు బస్సులు, సొంత వాహనాల్లో బయల్దేరి వచ్చారు.

రైళ్లకు డిమాండ్‌
తెలుగు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర సర్వీసులు నిలిచిపోవడంతో రైళ్లే ఆధారమయ్యాయి. హైదరాబాద్‌ నుంచి ఏపీలో సొంతూళ్లకు వెళ్లాల్సినవారు రైళ్లను ఆశ్రయించారు. లాక్‌డౌన్‌ ప్రకటనతో పలువురు బస్సుల కోసం ఆరా తీశారు. ఏపీకి బస్సు సౌకర్యం లేదన్న సమాచారంతో అనంతపురం, కాకినాడ, విశాఖపట్నం వైపు వెళ్లాల్సిన వారు అప్పటికప్పుడు రైలు టికెట్లు బుక్‌ చేసుకుని మంగళవారం రాత్రి రైళ్లలో వెళ్లిపోయారు. మూడింతలకుపైగా ఖాళీలు ఉండటంతో రైలు టికెట్లు సులభంగా దొరికాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు