Lockdown: మందు బాబుల ఉరుకులు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Lockdown: మందు బాబుల ఉరుకులు

సాయంత్రానికే కొన్ని దుకాణాల్లో సరకు ఖాళీ
చివరకు ‘సడలింపు’ జాబితాలోకి చేర్చిన అధికారులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో లాక్‌డౌన్‌కు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలియగానే రాష్ట్రంలోని మద్యం దుకాణాలన్నీ కిటకిటలాడాయి. కొన్ని ప్రాంతాల్లో కిలోమీటర్ల కొద్దీ క్యూలు కట్టారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. సరకు అయిపోవడంతో కొన్ని దుకాణాలను సాయంత్రానికే మూసేయాల్సి వచ్చింది. గత ఏడాది లాక్‌డౌన్‌ సమయంలో అత్యవసరాలు మినహా మిగతా అన్నింటిని ప్రభుత్వం మూసివేసింది. మూడు నాలుగు నెలలపాటు ఎక్కడా మద్యం దొరకలేదు. ఆ ఆందోళనతో మద్యంప్రియులు మధ్యాహ్నం నుంచే దుకాణాల వద్ద ఎగబడడంతో కొనుగోళ్లు అనూహ్యంగా పెరిగాయి. ఒక్కొక్కరూ కనీసం నాలుగైదు బాటిల్స్‌కు తక్కువ కాకుండా కొనగా మరికొందరైతే కేసులకు కేసులు పట్టుకుపోయారు. ఒక్కసారిగా రద్దీ పెరగడంతో నియంత్రించటం సమస్యగా మారిందని ఓ దుకాణదారు చెప్పారు. అప్పటికప్పుడు అదనపు సిబ్బందిని పిలిపించి అమ్మకాలు కొనసాగించామని వివరించారు. ఈ హడావుడిలో అటు నిర్వాహకులు, ఇటు కొనుగోలుదారులు కూడా కరోనా నిబంధనలను గాలికి వదిలేశారు. కొందరు మాస్కుల ధ్యాసను కూడా మరిచిపోయారు.

బంకుల వద్దా బారులే
అత్యవసర సేవల కింద పెట్రోలు బంకులు, వంట గ్యాస్‌ సరఫరా కొనసాగుతాయి. అయినప్పటికీ లాక్‌డౌన్‌ ప్రచారం మొదలవగానే పెట్రోలు బంకుల వద్ద కూడా పెద్ద సంఖ్యలో వాహనదారులు బారులు తీరడం విశేషం.

మౌఖిక ఆదేశాలు
అత్యవసరాలైన పాలు, మందులు, పెట్రోలు, కిరాణా దుకాణాలకు లాక్‌డౌన్‌లో సడలింపులు ఉంటాయి. ఈ దఫా మద్యం దుకాణాలకు కూడా సడలింపు ఇస్తున్నట్లు మంగళవారం సాయంత్రం అధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. వాటి ప్రకారం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ‘లాక్‌డౌన్‌ వెసులుబాటు’ సమయంలో మద్యం దుకాణాలు కూడా తెరిచే ఉంటాయి. నిబంధనల ప్రకారం మద్యం దుకాణాలను ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకే తెరవాలి. ఇప్పుడు ఉదయం 6 గంటలకే తెరవాలంటే ప్రభుత్వం ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది.
Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు