61 రోజుల తర్వాత..ఆశావహ పరిస్థితి!
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

61 రోజుల తర్వాత..ఆశావహ పరిస్థితి!

కొత్త కేసుల కంటే కోలుకున్నవారే అధికం

ఈనాడు, దిల్లీ: కొవిడ్‌ రెండో ‘అల’కల్లోలంతో దేశంలో రోజురోజుకీ కేసులు ఉద్ధృతమైపోతున్న తరుణంలో మంగళవారం ఒకింత ఊరట కలిగింది. 61 రోజుల తర్వాత తొలిసారిగా.. రోజువారీ కేసుల సంఖ్య కంటే కోలుకున్న వారి(రికవరీలు) సంఖ్య ఎక్కువ నమోదైంది. తాజాగా 3,29,242 కొత్త కేసులు బయట పడగా.. 3,56,082 మంది కోలుకున్నారు. ఏప్రిల్‌ 27 తర్వాత నమోదైన అతి తక్కువ రోజువారీ కేసుల సంఖ్య ఇదే.  ఇంతవరకు 1,90,27,304 మంది కొవిడ్‌ను జయించారు. 24 గంటల్లో 3,876 మంది కొవిడ్‌ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. సాధారణంగా ప్రతి ఆదివారం పరీక్షల సంఖ్య తగ్గుతుండటంతో ఆ ప్రభావం మంగళవారం విడుదల చేసే గణాంకాల్లో కనిపిస్తుంటుంది. గత 5 మంగళవారాల్లో ఎప్పుడూ కొత్త కేసుల కంటే ఎక్కువమంది కోలుకున్న దాఖలాలు లేవు. ఈసారి మాత్రం కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండటం విశేషం.గతేడాది సెప్టెంబరులోనూ గరిష్ఠ స్థాయిలో కేసులు వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితే కనిపించింది. ఆనెల 19న తొలిసారి ఇలా కొత్త కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య అధికంగా నమోదైంది. ఆ తర్వాత కొన్ని రోజులు లెక్కల్లో కొంత హెచ్చుతగ్గులు నమోదైనా అంతిమంగా రోజువారీ కేసుల క్షీణత మొదలైంది. తాజాగా మంగళవారం నాటి లెక్కలు కూడా మళ్లీ అలాంటి పరిస్థితిని సూచిస్తున్నాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.దేశంలో ఇంతవరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2.3 కోట్లకు చేరువైంది. కొవిడ్‌ బారిన పడినవారిలో ఇంతవరకు 2,49,992  మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్రపంచ సాయం..
ప్రపంచవ్యాప్త సాయంలో భాగంగా అందిన 8,900 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు, 5,043 ఆక్సిజన్‌ సిలిండర్లు, 18 ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లు, 5,698 వెంటిలేటర్లు/బైపాప్‌ యంత్రాలు, 3.4 లక్షలకు పైగా రెమ్‌డెసివర్‌ వయల్స్‌ను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అందజేసినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.

తగ్గుముఖం సూచనలు..
కరోనా రెండో ఉద్ధృతిలో రోజువారీ కేసులు, మరణాలు తగ్గుముఖం పడుతున్న సూచనలు కొంత కనిపిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. కొంతకాలంగా కేసులు విజృంభించిన మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌, దిల్లీ, ఛత్తీస్‌గఢ్‌ తదితర 18 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో రోజువారీ కేసుల్లో కొంత తగ్గుదల కనిపించినట్లు తెలిపింది. అయితే కర్ణాటక, కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, పంజాబ్‌ వంటి 16 రాష్ట్రాల్లో మాత్రం కేసులు పెరుగుతున్నట్లు పేర్కొంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు