Corona లక్షణాలున్నవారు లక్షన్నర మంది
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona లక్షణాలున్నవారు లక్షన్నర మంది

వారం రోజుల్లో కొవిడ్‌ నిర్ధారణయిన వారికి..వీరు అదనం
ఇంటింటి సర్వేలో వెలుగులోకి వచ్చిన బాధితులు
అనుమానితులకు ఔషధ కిట్లు అందజేస్తున్న ప్రభుత్వం
విస్తృతంగా కొనసాగుతున్న సర్వే

ఈనాడు - హైదరాబాద్‌

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఈ నెల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకూ అధికారికంగా ప్రకటించిన కరోనా కేసులు 3,506. పాజిటివ్‌లుగా నిర్ధారణ కానప్పటికీ ఇవే తేదీల్లో ప్రభుత్వం నిర్వహించిన ఇంటింటి సర్వేలో జ్వరం లేదా ఇతర కొవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్నట్లుగా గుర్తించిన వారు 14,250 మంది. అంటే దాదాపు నాలుగింతలు అధికం.


నల్గొండ జిల్లాలో గత వారం రోజుల్లో కొవిడ్‌ కేసులు 1,875. ఈ సమయంలో ఇదే జిల్లాలో ఇంటింటి సర్వేలో కరోనా లక్షణాలున్నట్టు గుర్తించిన వారు 9,433 మంది. అధికారికంగా ప్రకటించిన కేసుల కంటే లక్షణాలున్న వారు దాదాపు అయిదింతలు ఎక్కువన్నమాట. రాష్ట్రంలో కొవిడ్‌ లక్షణాలతో ప్రజలు పెద్దఎత్తున బాధపడుతున్నారని చెప్పడానికి ఇది నిదర్శనం. దాదాపు అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉంది.
 

రాష్ట్ర వ్యాప్తంగా జ్వర బాధితులను గుర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇంటింటి సర్వేకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వైద్య బృందాలు ఇల్లిల్లూ తిరుగుతూ జ్వరం సహా ఇతర వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తిస్తున్నాయి. ఈ గణాంకాల ఆధారంగా గత వారం రోజుల్లో కొవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్న వారు దాదాపు లక్షన్నరకు పైగానే ఉన్నట్లు తేలింది. ప్రభుత్వం నిర్వహిస్తోన్న కేంద్రాలు సహా ప్రైవేటులో నమోదవుతున్న నిర్ధారణ పరీక్షల సమాచారాన్ని వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక బులెటిన్‌ రూపంలో రోజూ వెల్లడిస్తోంది. అందులో వెల్లడైన పాజిటివ్‌ కేసుల సమాచారానికి అదనంగా ఈ లక్షన్నర మంది బాధితులు నమోదవడం ఆందోళన కలిగించే అంశమేనని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ వైద్యంలో రాష్ట్రవ్యాప్తంగా 1,064 కేంద్రాల్లో ఉచితంగా కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు.  

గత నెలలో రోజుకు సరాసరిన సుమారు లక్షన్నర పరీక్షలు జరిపారు. గత కొద్దిరోజులుగా మాత్రం ఈ సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇప్పుడు రోజూ సగటున సుమారు 60-70 వేలు మాత్రమే చేస్తున్నారు. దీంతో కేంద్రాల వద్ద పెద్దసంఖ్యలో అనుమానితులు బారులుదీరుతున్నారు. ఈ క్రమంలో లక్షణాలు ఉండి కొవిడ్‌ నిర్ధారణ కానివారు, లక్షణాలు లేకుండా కరోనాతో బాధపడుతున్నవారు ఒకేచోట గంటల తరబడి కలిసి ఉండాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఓపిక నశించి వెనుదిరుగుతున్న వారూ లేకపోలేదు. ఈ పరిణామాలతో తమకు తెలియకుండానే ఎదుటి వారికి వైరస్‌ వ్యాప్తి చెందడానికి వీరు కారణమవుతున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ‘‘లక్షణాలున్నప్పటికీ పరీక్షలకు నోచుకోని వారు ఇంటి వద్దనే ఉంటున్నారు. కొవిడ్‌ నిర్ధారణ కాలేదనే ధైర్యంతో సొంత పనులు చేసుకోవడం, ఇతరులతో కలిసిమెలిసి తిరగడం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు, తమతో సన్నిహితంగా మెలిగిన వారికి వైరస్‌ వ్యాపించేందుకు పరోక్షంగా కారణమవుతున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు ఊహించని వేగంతో పెరగడానికి ఇది కూడా కారణమని’’ వైద్యవర్గాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలో లక్షణాలున్న వారు కొవిడ్‌ నిర్ధారణయ్యేలోపే తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. నిర్ధారణ కాకుండానే, ఇళ్లలోనే మృత్యువాతపడుతున్నవారు వందల్లోనే ఉంటారని అంచనా. ముఖ్యంగా గ్రామీణులు అవగాహన లోపంతో బాధితులుగా మారి, ఆఖరి నిమిషంలో ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. అప్పటికే పరిస్థితి చేయిదాటిపోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షణాలు లేకుండా పాజిటివ్‌లుగా నిర్ధారణవుతున్న వారు కూడా దాదాపు 70 శాతానికి పైగానే ఉంటున్నారని అంచనా. వీరిని గుర్తించడం, ఔషధాలు అందించడం జరగడం లేదు. అలాంటి వారి వల్ల కూడా వైరస్‌ వ్యాప్తి జరిగే అవకాశాలున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలే కీలకం
వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇంటింటి సర్వేను తెరపైకి తెచ్చింది. సర్వేలో ఆశా కార్యకర్తలు కీలక పాత్ర పోషిస్తున్నారు. గ్రామీణ, పట్టణాల్లో ఇంటింటికీ తిరుగుతూ జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి తదితర సమస్యలున్నవారిని గుర్తిస్తున్నారు. కేవలం వారం రోజుల్లోనే నల్గొండ జిల్లాలో అత్యధికంగా 9,433 మందిని కొవిడ్‌ లక్షణాలున్నవారిని గుర్తించారు. ఆరోగ్య ఉపకేంద్రం స్థాయిలో ఏఎన్‌ఎంలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఓపీలో జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలున్నట్లుగా గుర్తిస్తే వెంటనే ఔషధ కిట్‌ను అందజేస్తున్నారు. నల్గొండ జిల్లాలో ఓపీ సేవల్లో 4507 కేసులను గుర్తిస్తే, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 3906 మందిని గుర్తించి కిట్లు అందజేశారు. గడిచిన ఏడు రోజుల్లోనే ఓపీ సేవల్లో దాదాపు 14 లక్షలకు పైగా ఐసొలేషన్‌ కిట్లను అందజేసినట్లుగా వైద్యవర్గాలు తెలిపాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు