దేశంలో ఉచిత Vaccination చేపట్టండి

ప్రధానాంశాలు

దేశంలో ఉచిత Vaccination చేపట్టండి

సెంట్రల్‌ విస్టా ఆపండి
9 డిమాండ్లతో ప్రధానికి 12 ప్రతిపక్ష పార్టీల నేతల లేఖ

ఈనాడు, దిల్లీ: దేశవ్యాప్తంగా ఉచితంగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ చేపట్టాలని కోరుతూ 12 ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఇందులో ప్రధానంగా 9 డిమాండ్లు ప్రధాని ముందుంచారు. ఈ లేఖపై కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని (జేడీఎస్‌ నేత) హెచ్‌డీ దేవెగౌడ, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రులు ఉద్ధవ్‌ ఠాక్రే (శివసేన), మమతా బెనర్జీ (టీఎంసీ), ఎంకే స్టాలిన్‌ (డీఎంకే), హేమంత్‌ సోరెన్‌ (జేఎంఎం), నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూఖ్‌ అబ్దుల్లా, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌, ఆర్‌జేడీ నేత తేజస్వి యాదవ్‌, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంతకాలు చేశారు. తాము ముందు నుంచీ విడివిడిగాను, కలిసికట్టుగాను సూచనలు, సలహాలు ఇస్తున్నా మోదీ ప్రభుత్వం పెడచెవిన పెడుతూ వస్తోందని విమర్శించారు. ఫలితంగా ఇప్పుడు దారుణమైన మానవ విషాదం నెలకొందని, ఇప్పటికైనా మేల్కొని తమ సూచనలను తక్షణం అమలు చేసి, ప్రజలను ఆదుకోవాలని లేఖలో పేర్కొన్నారు.  
1. దేశవిదేశాల నుంచి కేంద్ర ప్రభుత్వమే కొవిడ్‌ టీకాలు సేకరించాలి. 2. దేశవ్యాప్తంగా అందరికీ ఉచిత వ్యాక్సిన్‌ అందించే కార్యక్రమాన్ని తక్షణం ప్రారంభించాలి. 3. కంపల్సరీ లైసెన్సింగ్‌ నిబంధనను అమలు చేసి దేశీయంగా వ్యాక్సిన్‌ ఉత్పత్తి పెంచాలి. 4. బడ్జెట్‌లో కేటాయించిన రూ. 35 వేల కోట్లు ఖర్చు చేయాలి. 5. సెంట్రల్‌ విస్టా నిర్మాణం తక్షణం నిలిపేయాలి. ఆ మొత్తాన్ని ఆక్సిజన్‌ సేకరణ, ఇతర కొవిడ్‌ నియంత్రణ చర్యలకు ఉపయోగించాలి. 6. లెక్కాపత్రం లేని ‘పీఎం కేర్స్‌’ నిధిలో ఉన్న డబ్బునంతా టీకాలు, ఆక్సిజన్‌, వైద్య పరికరాల కొనుగోలుకు విడుదల చేయాలి. 7. ఉద్యోగం లేని వారికి నెలకు రూ. 6 వేలు ఇవ్వాలి. 8. ప్రస్తుతం గోదాముల్లో కోటి టన్నుల తిండి గింజలు మగ్గిపోతున్నందున వాటిని వెంటనే పేదలకు ఉచితంగా పంచిపెట్టాలి. 9. కొత్త సాగు చట్టాలను రద్దుచేసి ప్రస్తుత మహమ్మారి సమయంలో ఆందోళన చేస్తున్న అన్నదాతల ప్రాణాలను కాపాడాలి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని