కొవిషీల్డ్‌ రెండో డోసుకు 12-16 వారాల గడువు
close

ప్రధానాంశాలు

కొవిషీల్డ్‌ రెండో డోసుకు 12-16 వారాల గడువు

శాస్త్రీయ ఆధారాలతోనే నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం స్పష్టీకరణ

ఈనాడు, దిల్లీ: కొవిషీల్డ్‌ టీకా పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యాక్సిన్‌ మొదటి, రెండో డోసుల మధ్య వ్యవధిని 12-16 వారాలకు పొడిగించింది. శాస్త్రీయ ఆధారాలతో ఈ నిర్ణయం తీసుకున్నామని, దీనివల్ల ప్రజలకు ఎలాంటి అదనపు ముప్పు ఉండబోదని పేర్కొంది. కొవాగ్జిన్‌ డోసుల మధ్య వ్యవధిని మాత్రం మార్చలేదని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం.. కొవిషీల్డ్‌ మొదటి డోసు తీసుకున్నవారు 12-16 వారాలు ఆగి రెండో డోసు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఈ డోసుల మధ్య వ్యవధి 6-8 వారాలుగా ఉన్న సంగతి గమనార్హం. టీకాల కొరతతో పలు రాష్ట్రాలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కేంద్రం తాజా నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది.

ప్రధానంగా బ్రిటన్‌లో లభ్యమైన వాస్తవ జీవన సాక్ష్యాధారాలను పరిగణనలోకి తీసుకొని.. కొవిషీల్డ్‌ డోసుల మధ్య వ్యవధిని 12-16 వారాలకు పెంచాలని ‘నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యునైజేషన్‌ (ఎన్‌టీఏజీఐ)’ సిఫార్సు చేసిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆ సిఫార్సుకు నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ నేతృత్వంలోని ‘నేషనల్‌ ఎక్స్‌పర్ట్‌ గ్రూప్‌ ఆన్‌ వ్యాక్సిన్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఫర్‌ కొవిడ్‌ -19 (నెగ్‌వ్యాక్‌)’ బుధవారం ఆమోద ముద్ర వేసినట్లు వెల్లడించింది. ఈ అంశంపై వీకే పాల్‌ మాట్లాడుతూ.. కొవిషీల్డ్‌ డోసుల మధ్య వ్యవధి పెంపుతో ప్రయోజనం ఉంటుందని తేలిందన్నారు. బ్రిటన్‌లో ఈ వ్యధిని ఇప్పటికే 12 వారాలకు పెంచారని, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కూడా ఆ నిర్ణయానికి ఆమోదం తెలిపిందని చెప్పారు. కొవిషీల్డ్‌ డోసుల మధ్య వ్యవధి పెంపు ఇదేమీ తొలిసారి కాదు. మొదట ఈ వ్యవధిని 28 రోజులుగా నిర్ణయించగా.. ఈ ఏడాది మార్చిలో దాన్ని 6-8 వారాలకు పెంచారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని