Corona: కోలుకున్న వారిలోనూ.. కొత్త ముప్పు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: కోలుకున్న వారిలోనూ.. కొత్త ముప్పు

చెంప కింద పాకుతున్న బ్లాక్‌ ఫంగస్‌
స్టిరాయిడ్స్‌ వాడకం, మధుమేహం కారణాలు
సత్వర చికిత్సతోనే ప్రాణాలకు రక్ష: వైద్యులు

కరోనా మొదటి దశలో చూడని ఉత్పాతాలెన్నో రెండో దశలో వెలుగుచూస్తున్నాయి. గతంలో కంటే వ్యాధి వ్యాప్తి వేగం, తీవ్రత పెరిగాయి. చికిత్స విధానాల్లోనూ మార్పులు అనివార్యమయ్యాయి. కొవిడ్‌ చికిత్సలో భాగంగా రోగనిరోధక శక్తిని తాత్కాలికంగా అణిచిపెట్టేందుకు ఇచ్చే స్టిరాయిడ్లు మోతాదు మించినా, దీర్ఘకాలంగా మధుమేహంతో బాధ పడుతున్నా.. మరో ముప్పు పొంచి ఉంది. అదే మ్యుకర్‌మైకోసిస్‌! రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొందరు పోస్ట్‌ కొవిడ్‌ రోగుల్లో బయట పడుతున్న ఈ వ్యాధి ఆందోళన రేపుతోంది. ఫంగస్‌ శరీరంలోకి వ్యాపించిన రెండు మూడు రోజుల్లోనే ముఖభాగంలోనిఅవయవాలను కబళించేస్తుంది. తొలుత ముక్కులోపలి భాగంలో చేరి క్రమంగా కళ్లు, చెవులు, దవడలకు, తర్వాతి దశలో మెదడులోకి విస్తరిస్తుంది. నిల్వ ఉన్న బ్రెడ్డును ఫంగస్‌ తినేసినట్టే దాడిచేసిన చోటల్లా కణజాలాన్నీ ఈ ఫంగస్‌ తినేస్తుంది. అక్కడ గుల్ల చేస్తుంది. తర్వాతనల్లగా మారుస్తుంది. వ్యాధిని గుర్తించడం, చికిత్స అందించడంలో ఏమాత్రం తాత్సారం చేసిన ప్రాణాలకే ముప్పుగా పరిణమిస్తోంది.

ఈనాడు, అమరావతి: కరోనా రెండో దశ ఉద్ధృతితో వణికిపోతున్న ప్రజలను మరో వ్యాధి బెంబేలెత్తిస్తోంది! మ్యుకర్‌మైకోసిస్‌ లేదా బ్లాక్‌ ఫంగస్‌గా పిలుస్తున్న ఈ జబ్బు కొవిడ్‌ రోగులకు కొత్త ముప్పుగా పరిణమించింది. ఇది అంటువ్యాధి కాదు. కానీ వెంటనే గుర్తించి, చికిత్స అందించకపోతే పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది. కరోనా సోకిన మధుమేహ రోగులు, చికిత్సలో భాగంగా ఎక్కువ మోతాదులో స్టిరాయిడ్స్‌ వాడిన కొందరు బ్లాక్‌ఫంగస్‌ బారిన పడుతున్నారు. మొదట్లో మహారాష్ట్రలో గుర్తించిన ఈ వ్యాధి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ కనిపిస్తోంది. మ్యుకర్‌మైకోసిస్‌ లక్షణాలతో రోగులు ఆస్పత్రులకు వస్తున్నట్లు ఈఎన్‌టీ వైద్యులు చెబుతున్నారు. తొలి దశలోనే లక్షణాల్ని గుర్తించి చికిత్స అందిస్తే నయమవుతుందని, ఆలస్యం చేసినా, ఫంగస్‌ మెదడుకు పాకినా ప్రాణాలకు ముప్పేనని హెచ్చరిస్తున్నారు.

ఇప్పుడే ఎందుకింత ఉద్ధృతి?
మ్యుకోరేల్స్‌ కుటుంబానికి చెందిన ఫంగస్‌ వల్ల సంక్రమించే ఈ వ్యాధి కొత్తదేమీ కాదు. రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో లేనివారు, కిడ్నీ మార్పిడి వంటి శస్త్రచికిత్సల్లో భాగంగా రోగనిరోధక శక్తిని అణిచిపెట్టే (ఇమ్యునోసప్రెసివ్‌) మందులు వాడిన వారిలో ఈ వ్యాధి కనిపించేది. ఇటీవల అవయవ మార్పిడి చేసినవారికి అత్యాధునిక ఇమ్యునోసప్రెసివ్‌ ఔషధాలు ఇవ్వడంతో బ్లాక్‌ఫంగస్‌ ప్రభావం తగ్గింది. ఇప్పుడు కరోనా చికిత్సలో భాగంగా స్టిరాయిడ్స్‌ ఎక్కువగా వాడుతున్న కొందరిలో ఈ వ్యాధి బయటపడుతోంది. కరోనా మొదటి దశ చికిత్సలో స్టిరాయిడ్స్‌ వాడకం పెద్దగా లేనందున బ్లాక్‌ఫంగస్‌ కనిపించలేదు.

లక్షణాలివీ!

* తల భాగంలో మరీ ముఖ్యంగా చెంపల కిందుగా ముక్కు, చెవులు, కళ్లు, పళ్లు, దవడల్లోకి ఫంగస్‌ విస్తరిస్తుంది. అరుదుగా ఊపిరితిత్తుల్లోకీ చేరుతుంది. అప్పుడు ఛాతీ నొప్పి, దగ్గు వస్తాయి.
* ముక్కు దిబ్బడ, ఎండిపోయినట్టుగా ఉండటం, ముక్కులో అసౌకర్యం, దురద, ముక్కు నుంచి రక్తం, బూడిదరంగు, నల్లటి స్రావాలు రావడం.
* ముఖంపై నొప్పి, తిమ్మిరి, వాపు, మొద్దుబారడం, తలనొప్పి.
* కనుగుడ్డు చుట్టూ నొప్పి, కళ్లవాపు, కళ్లు లాగడం, నీరు కారడం, కనుగుడ్డు ముందుకు పొడుచుకురావడం, కళ్లు మసకబారడం, ఒకే వస్తువు రెండుగా కనిపించడం.
* జ్వరం. దవడలు, పైవరుస పళ్లనొప్పి.

ఎవరికి ముప్పు?

ఆస్పత్రుల్లో కరోనాతో చికిత్స పొందుతున్నప్పుడు, వ్యాధి నయమై ఇంటికి చేరుకున్నాక (పోస్ట్‌ కొవిడ్‌) ఈ ఫంగస్‌ సోకుతోంది. కరోనా రోగులకు ప్రపంచవ్యాప్తంగా వైద్యులు స్టిరాయిడ్స్‌ ఇస్తున్నారు. ఇవి అవసరానికి మించి వాడితే ప్రమాదకరం. స్టిరాయిడ్స్‌ను ఏ దశలో, ఎంత మోతాదులో వాడాలన్న అవగాహన లేనివారు ఎక్కువ డోస్‌ తీసుకుంటున్నారు. స్వల్ప లక్షణాలతో ఇంట్లో చికిత్స పొందుతున్నవారు సొంత వైద్యంగా, ఎవరో ఇచ్చిన సలహా మేరకు విచక్షణ లేకుండా స్టిరాయిడ్స్‌ తీసుకుంటున్నారు. ఇప్పుడిదే ముప్పుగా పరిణమించింది.

ఎంత త్వరగా గుర్తిస్తే... అంత మంచిది!

బ్లాక్‌ ఫంగస్‌ మొదట ముక్కు లోపలికి చేరి, క్రమంగా సైనస్‌ గదుల్లోకి చొచ్చుకుపోతుంది. మ్యుకర్‌మైకోసిస్‌ను తొలిదశలోనే గుర్తిస్తే యాంఫోటెరిసిన్‌-బి ఇంజక్షన్లు ఇవ్వడం ద్వారా నియంత్రిస్తారు. ఈ చికిత్సకు నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో 2-3 వారాలు పడుతుంది. వ్యాధి బాగా ముదిరితే ఫంగస్‌ వ్యాపించిన కణజాలాన్ని తొలగిస్తారు. కంటికి సోకితే కనుగుడ్డు తీసేయాల్సి వస్తుంది. పై వరుస పళ్లు తొలగించాల్సి రావొచ్చు. ఫంగస్‌ మెదడుకు చేరితే.. తీవ్ర దుష్పరిణామాలు తలెత్తుతాయి. ప్రాణాపాయమూ సంభవిస్తుంది. ప్రాథమిక దశలోనే చికిత్స అందిస్తే వ్యాధి 90 శాతం వరకు నయమవుతుంది.

వందలో ఒకరిద్దరు ఉంటున్నారు

ఈఎన్‌టీ సమస్యలతో రోజుకు వంద మంది ఓపీకి వస్తుంటే వారిలో ఒకరో ఇద్దరో మ్యుకర్‌మైకోసిస్‌ రోగులు ఉంటున్నారు. కొవిడ్‌ నుంచి బయటపడ్డ వారు, కరోనా చికిత్సలో స్టిరాయిడ్స్‌ ఎక్కువగా వాడినవారు, దీర్ఘకాల మధుమేహ బాధితుల్లో లక్షణాలు కనిపిస్తున్నాయి. స్టిరాయిడ్స్‌ వాడి, బ్లాక్‌ఫంగస్‌ లక్షణాలుంటే వెంటనే ఈఎన్‌టీ వైద్యుల్ని సంప్రదించాలి. సైనస్‌లోకి ఫంగస్‌ చేరకముందే చికిత్స ప్రారంభిస్తే త్వరగా నయం చేయవచ్చు. వెంటిలేటర్‌, ఆక్సిజన్‌ బెడ్‌పై ఉన్నవారికి ఆక్సిజన్‌ సరఫరా చేసే ఫ్లోమీటర్‌లో శుద్ధ జలాన్ని, డిస్టిల్డ్‌ వాటర్‌ వినియోగిస్తారు. ఫ్లోమీటర్‌లో కలుషితమైన నీరు చేరితే మ్యుకర్‌మైకోసిస్‌ వస్తోందన్న వాదన మొదట్లో వినిపించినా, శాస్త్రీయంగా నిరూపణ కాలేదు. ఆసుపత్రిలో, ఇంట్లో ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌ పెట్టుకున్న వారు ఫ్లోమీటర్‌లో శుద్ధ జలాన్ని వాడాలి.

-శింగరి ప్రభాకర్‌, ఈన్‌ఎటీ వైద్య నిపుణులు, విజయవాడ

‘నాసల్‌ డూషింగ్‌’ విధానంలో శుభ్రం చేసుకోవాలి

కొవిడ్‌ చికిత్సలో భాగంగా స్టిరాయిడ్స్‌ ఎక్కువగా తీసుకున్నవారు, మధుమేహులు వ్యక్తిగత శుభ్రత పాటించాలి. ‘నాసల్‌ డూషింగ్‌’ విధానంలో ముక్కు శుభ్రం చేసుకోవాలి. సాచెట్‌లో దొరికే ఒక రకమైన సాల్ట్‌ను నీళ్లలో వేసి దానికి ఒకటి రెండు చుక్కల బెటడిన్‌ కలిపి ముక్కులోకి వేగంగా పంపిస్తే.. అక్కడ చేరిన ఫంగస్‌ స్పోర్‌ బయటకు వచ్చేస్తుంది. కొవిడ్‌ రోగుల రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడటం (థ్రాంబోజెనిక్‌ యాక్టివిటీ), స్టిరాయిడ్స్‌ వాడటం, ఫెరిటిన్‌ పెరగడం వల్ల మ్యుకర్‌మైకోసిస్‌ వస్తోంది. ఈ వారంలోనే తొమ్మిది మందికి మా ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేశాం. ముక్కులో దూలం వంకర ఉన్నా, అడ్డంకిగా ఉన్నా అక్కడ ఫంగస్‌ చేరి పెరిగిపోతుంది. జాగ్రత్త పడకపోతే ముక్కు, కన్ను, దవడ రక్తనాళాలను ఆక్రమిస్తుంది. రక్తసరఫరా లేక ఆ భాగాలు కుళ్లిపోయి, నల్లబడతాయి. ఫంగస్‌ మెదడుకు చేరితే.. ప్రతి 10 మందిలో 8 మంది చనిపోతారు. మిగతా వారిలో పక్షవాతం తలెత్తవచ్చు. చాలామందిలో ఇది 2-4 రోజుల్లోనే ముక్కు నుంచి మెదడుకు వ్యాపిస్తుంది. వ్యాధి నిరోధక శక్తి బాగుంటే.. 8-9 రోజులు పడుతుంది.

-ఆర్‌.విద్యాసాగర్‌, ఈఎన్‌టీ సర్జన్‌, సాగర్‌ ఈఎన్‌టీ హెడ్‌ అండ్‌ నెక్‌ సెంటర్‌, విజయవాడ

కరోనా లక్షణాలు బయటపడ్డ వెంటనే స్టిరాయిడ్స్‌ వాడకూడదు. వ్యాధి నిర్ధారణయ్యాక అయిదు రోజులైనా జ్వరం తగ్గకపోతే, రక్తంలో ఆక్సిజన్‌ స్థాయి 95 కంటే తగ్గితే వాడొచ్చు. స్టిరాయిడ్స్‌ వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. కరోనా రోగుల్లో తెల్లరక్తకణాల్లోని నూట్రోఫిల్స్‌ సంఖ్య పెరిగినా, అవి ప్రభావవంతంగా ఉండటం లేదు. రోగనిరోధక వ్యవస్థలో కీలకమైన వాటి పనితీరు దెబ్బతింటుంది. అదే సమయంలో స్టిరాయిడ్స్‌ వల్ల శరీరంలో చక్కెర స్థాయులు పెరుగుతాయి. మధుమేహుల్లో మరింత ఎక్కువవుతాయి. కొందరు కొవిడ్‌ రోగుల్లో సీరం ఫెరెటిన్‌ (ఐరన్‌) శాతం కూడా పెరుగుతోంది. ఇవన్నీ ఫంగస్‌కు ఎరువులా పనిచేసి, వృద్ధికి కారణమవుతున్నాయి’.

తెలంగాణలో బ్లాక్‌ ఫంగస్‌తో ఒకరి మృతి
గాంధీలోనూ ముగ్గురిలో లక్షణాలు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో మ్యుకర్‌ మైకోసిస్‌ (బ్లాక్‌ ఫంగస్‌)తో ఒక వ్యక్తి మృతిచెందారు. గాంధీ ఆసుపత్రిలో మరో ముగ్గురు కరోనా రోగుల్లోనూ దీనిని గుర్తించారు. మరికొందరు ఈ తరహా లక్షణాలతో చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. నగరంలోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో బ్లాక్‌ ఫంగస్‌తో చికిత్స పొందుతున్న నిర్మల్‌ జిల్లా బైంసా డివిజన్‌కు చెందిన ఓ వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం. సంబంధిత వైద్య వర్గాలు మాత్రం నిర్ధారించట్లేదు. ఇటీవల ప్రైవేటు ఆసుపత్రిలో సుదీర్ఘకాలం చికిత్స తీసుకున్న ముగ్గురు గాంధీలో చేరారు. వైద్యులు వారిలో బ్లాక్‌ ఫంగస్‌ను గుర్తించారు. వారిలో ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉండగా, ఒకరి పరిస్థితి కొంత విషమంగా ఉంది.

 

అందరికీ రాదు.. ఆందోళన వద్దు

బ్లాక్‌ఫంగస్‌ కొత్తది కాదు. తొలి దశలో కూడా గాంధీలో చికిత్స పొందిన 10 మంది కరోనా రోగుల్లో దీనిని గుర్తించాం. ఒకరిద్దరు తప్ప.. అందరూ చికిత్సతో కోలుకున్నారు. కరోనా రోగులందరికీ ఇది రాదు. గాంధీలో ప్రస్తుతం ముగ్గురిలో ఈ లక్షణాలు కనిపించాయి. వారు కరోనాతోపాటు మధుమేహంతో చాలా రోజులుగా ఇతర ఆసుపత్రుల్లో చికిత్స పొంది ఇక్కడకు వచ్చారు. కరోనా తగ్గడానికి స్టిరాయిడ్లు తీసుకున్న వారందరూ బ్లాక్‌ఫంగస్‌ బారిన పడతారనేది వాస్తవంకాదు. కరోనా నుంచి కోలుకున్నాక వ్యాధి నిరోధ శక్తి పెంచుకోవటానికి మంచి ఆహారం తీసుకోవాలి. ఆకుకూరలు, కూరగాయలు, గుడ్లు, మాంసం, చేపలు, సి విటమిన్‌ ఉండే పండ్లు తినాలి. ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలి. 8 గంటలపాటు నిద్ర పోవాలి. ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఉంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.

- డాక్టర్‌ రాజారావు, సూపరింటెండెంట్‌, గాంధీ ఆసుపత్రి


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు