Covid Vaccine: నెలాఖరు వరకు రెండో డోసే
close

ప్రధానాంశాలు

Covid Vaccine: నెలాఖరు వరకు రెండో డోసే

సడలింపు సమయంలోనూ నిబంధనలు పాటించాలి
వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల వెల్లడి

‘‘రాష్ట్రంలో వారంరోజులుగా 25 వేల వైద్య బృందాల ద్వారా దాదాపు 70 లక్షల కుటుంబాలకు సర్వే నిర్వహించాం. జ్వర లక్షణాలున్న వారికి 2.6 లక్షల మందుల కిట్‌లు పంపిణీ చేశాం. లక్షణాలున్నట్లు గుర్తించిన వారికి మళ్లీ కరోనా పరీక్షలు చేయాల్సిన అవసరం లేదు. పరీక్షలు నిర్వహించి ఫలితాల కోసం రెండు, మూడు రోజులు ఎదురుచూసే బదులు ముందుగానే చికిత్స ప్రారంభించాం. తద్వారా ఆస్పత్రుల్లో చేరికలు తగ్గాయి’’

ఈనాడు, హైదరాబాద్‌: ఈ నెలాఖరు వరకు రాష్ట్రంలో 15 లక్షలమందికి రెండో డోసు వ్యాక్సిన్‌ ఇవ్వాల్సి ఉందని అందుకే మే 31 వరకు రెండోడోసు వారికే ప్రాధాన్యమిస్తామని వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు, వైద్య విద్య సంచాలకులు రమేష్‌రెడ్డి తెలిపారు. అందుబాటులో ఉన్న మేరకు వారందరికీ రెండో డోసు అందిస్తామని చెప్పారు. కొవిషీల్డ్‌ టీకా గడువును కేంద్రం 12-16 వారాలకు పెంచిందని, కొవాగ్జిన్‌ ను 4-6 వారాల మధ్యలో ఎప్పుడైనా తీసుకోవచ్చని తెలిపారు. రెండోడోసు కోసం ఎవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌, రాత్రి కర్ఫ్యూలాంటి నియంత్రణ చర్యలతో కేసులు, మరణాలు, ఆసుపత్రుల్లో చేరికలు తగ్గాయని పేర్కొన్నారు. ప్రతిరోజూ 20 గంటల పాటు కట్టడిలో ఉన్నా 4 గంటల లాక్‌డౌన్‌ సడలింపు సమయంలో నిబంధనలు పాటించకుంటే ఫలితం ఉండదని అన్నారు. గురువారమిక్కడ వారు విలేకరులతో మాట్లాడారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో పాజిటివిటీ రేటు తక్కువగా ఉందని వివరించారు.

అవసరమైన వారికే వినియోగించాలి...
‘‘ఆక్సిజన్‌ ఎవరికి అవసరమో వారికే ఉపయోగించాలి. ప్రైవేటు ఆసుపత్రుల్లో దీనిని ఇష్టానుసారం వాడకుండా పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేశాం. అవసరమున్నచోట వెంటనే సరఫరా విషయమై నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లకు కొరత లేదు. జిల్లాల్లో మంత్రులు, కలెక్టర్లు వీటిని పర్యవేక్షిస్తున్నారు. ప్రైవేటులోనూ అందుబాటులో ఉండేలా చూస్తున్నాం. కొన్ని ఆసుపత్రుల్లో పాజిటివ్‌ వచ్చిన వారందరికీ ఈ ఇంజక్షన్‌ ఇస్తున్నారు. అది సరికాదు. దీనికి ప్రత్యామ్నాయంగా అందుబాటులో ఉన్న మందుల్ని కూడా వినియోగించాలి.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా ఓపీ..
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా ఓపీ సేవలు ప్రారంభించాం. పంచాయతీ, మున్సిపల్‌ సిబ్బందితో కలిసి జ్వర సర్వే చేసి ముందు జాగ్రత్తలు చేపడుతున్నాం. దీనివల్ల తీవ్రమైన కేసులు తగ్గుతున్నాయి. 70 లక్షల కుటుంబాలను సర్వే చేశాం. 5,05,204 మందికి పరీక్షలు నిర్వహించాం. వారం రోజుల్లోనే 2.60 లక్షల కిట్‌లు పంపిణీ చేశాం. కొందరు ముందుజాగ్రత్తగా ఇవి తీసుకుని పెట్టుకున్నారు. కొవిడ్‌ నిర్ధారణ కాకున్నా లక్షణాలు ఉన్నవారు ఈ మందులు వాడటం వల్ల సీరియస్‌ కాకుండా కాపాడుకోవచ్చు. లాక్‌డౌన్‌ ముగిసే వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు. ఆక్సిజన్‌ లేక రోగులు చనిపోయారన్న విషయంలో వాస్తవం లేదు.

40 శాతం పొరుగు బాధితులు..
రాష్ట్రంలో చికిత్స పొందుతున్న బాధితుల్లో 40 శాతం మంది పొరుగు రాష్ట్రాలకు చెందినవారే. హైదరాబాద్‌ మెడికల్‌ హబ్‌ కాబట్టి వారికి చికిత్స అందిస్తున్నాం. రాష్ట్రంలో పడకల పరిస్థితి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. ప్రస్తుతం 5,787 ఆక్సిజన్‌ పడకలు, 2,867 ఐసీయూ పడకలు ఖాళీగా ఉన్నాయి.

ప్రైవేటు ఆస్పత్రుల ధోరణి మారాలి..
ఆక్సిజన్‌ ఛాంబర్‌ ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తుంటే బ్లాక్‌ ఫంగస్‌ వచ్చే అవకాశం తక్కువ. కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు తమ దగ్గర ఈ కేసులు ఉన్నాయని, గాంధీకి పంపిస్తామని అంటున్నాయి. ఈ పద్ధతి సరికాదు. రోగులు మంచిగా ఉంటే పెట్టుకుంటాం. సమస్యలు వస్తే ప్రభుత్వ ఆసుపత్రులకు పంపిస్తామనడం సరికాదు. ప్రభుత్వ ఆసుపత్రులకు ఐసీయూ పడకలు సరఫరా చేసిన సంస్థలు వాటికి రిపేరు వస్తే చేయడం లేదు. దీంతో వీటిని మరమ్మతుకు టెండర్లు పిలిచాం’’ అని శ్రీనివాసరావు, రమేష్‌రెడ్డి వివరించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని