పొలిమేరల్లో ప్రాణాలు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పొలిమేరల్లో ప్రాణాలు

ఏపీ నుంచి వస్తున్న అంబులెన్సుల్ని వెనక్కి పంపిన తెలంగాణ పోలీసులు
ఆందోళనకు గురైన కొవిడ్‌ రోగులు, వారి బంధువులు
శుక్రవారం రాత్రి నుంచి అనుమతి

ఈనాడు- అమరావతి, హైదరాబాద్‌, న్యూస్‌టుడే బృందం: వారంతా కొవిడ్‌ రోగులు.. ఆరోగ్య పరిస్థితి విషమిస్తుండటంతో అత్యవసర వైద్యం కోసం ఆంధ్రప్రదేశ్‌ నుంచి హైదరాబాద్‌కు అంబులెన్సుల్లో బయలుదేరారు. తెలంగాణలోకి ప్రవేశించిన వెంటనే పోలీసులు అడ్డుకున్నారు. అసుపత్రి ధ్రువీకరణ పత్రం, తెలంగాణ ప్రభుత్వ ఈ-పాస్‌ ఉంటేనే రానిస్తామని చెప్పి వెనక్కి పంపారు. పుల్లూరు టోల్‌ప్లాజా, రామాపురం క్రాస్‌రోడ్డు వద్ద ఈ పరిస్థితి నెలకొంది. దీంతో పదుల సంఖ్యలో కొవిడ్‌ రోగులు, వారి కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కొవిడ్‌ బాధితుల్లో కొంత మంది అంబులెన్సుల్లో ఆక్సిజన్‌పై ఉన్నారు. పోలీసులను బతిమలాడినా ఫలితం లేకపోవడంతో ఏం చేయాలో తెలియక బిక్కుబిక్కుమంటూ వెనుదిరిగారు. గురువారం రాత్రి 10 గంటల నుంచి మొదలైన ఈ వాహనాల నిలిపివేత శుక్రవారం రాత్రి వరకు కొనసాగింది. తెలంగాణ ప్రభుత్వ తీరుపై హైకోర్టు అసహనం వ్యక్తం చేస్తూ మధ్యాహ్నమే స్టే విధించినా.. ఆదేశాలు అందలేదంటూ పోలీసులు నిలిపివేతను కొనసాగించారు. మరోవైపు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ అంశంపై మాట్లాడుతూ తెలంగాణ నిబంధనలు కఠినంగా ఉన్నాయని, మానవతా దృక్పథంతో ఆలోచించాలన్నారు. అంబులెన్స్‌లు ఆపడం మంచి సంప్రదాయం కాదని, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి సూచించారు. ఎట్టకేలకు శుక్రవారం రాత్రి 10 గంటలకు అన్ని అంబులెన్సులను తెలంగాణ పోలీసులు అనుమతించారు. ఈ మేరకు నల్గొండ ఎస్పీ ఏవీ రంగనాథ్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. అంతకు ముందు పుల్లూరు వద్ద కడప, నంద్యాలకు చెందిన ఇద్దరు రోగులు చనిపోయారంటూ ప్రచారం జరగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
వెంటిలేటర్‌పై ఉన్న వారినీ ఆపేశారు...
కొవిడ్‌తో బాధపడుతున్న తిరుపతికి చెందిన అబ్దుల్లాకు హైదరాబాద్‌లోని జీవన్‌ ఆసుపత్రిలో చికిత్స ఇప్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుని అతని భార్య రహమున్నీసా అంబులెన్సులో వస్తున్నారు. అప్పటికే ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారు. తెలంగాణ సరిహద్దులోకి ప్రవేశించగానే పోలీసులు నిలిపేశారు. అనుమతులు చూపాలంటూ వెనక్కి పంపారు. అప్పటికే అతని పల్స్‌ పడిపోతోంది. ఆక్సిజన్‌ స్థాయి తగ్గిపోతోంది. దీంతో ఆమె తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఓ వైపు భర్త ప్రాణాలు కాపాడుకోవాలన్న ఆరాటం.. మరోవైపు తెలంగాణ పోలీసులు అనుమతించట్లేదన్న బాధ.. చివరికి ఆమె కర్నూలు ప్రభుత్వాసుపత్రికి వస్తే ఆక్సిజన్‌ పడకలు లేవన్నారు. తన ఆవేదనను కన్నీటి పర్యంతమవుతూ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయటంతో ఇన్‌ఛార్జ్‌ కలెక్టర్‌ స్పందించి చికిత్సకు తగిన ఏర్పాట్లు చేశారు. రామాపురం క్రాస్‌రోడ్డు వద్ద నుంచి కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న పలువురు రోగులు వెనుదిరిగారు.

అమ్మ ప్రాణాలు పోతున్నాయ్‌ ప్లీజ్‌...
కరోనాతో బాధపడుతున్న కడపకు చెందిన లీలావతమ్మను ఆమె కుమారుడు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పడక ఖరారు చేసుకొని తీసుకెళ్తున్నారు. పుల్లూరు వద్ద శుక్రవారం తెల్లవారుజామున  నిలిపేశారు. మధ్యాహ్నం 1 గంట వరకూ ఆమె కుమారుడు పోలీసుల్ని బతిమిలాడాడు. తనకు తెలంగాణ ఈ-పాస్‌ కూడా వచ్చిందని చెప్పినా వినలేదు. ఓ వైపు అంబులెన్సులోని ఆక్సిజన్‌ సిలెండర్‌ నిండుకునే పరిస్థితి ఎదురవ్వటంతో దిక్కుతోచని స్థితిలో వెనుదిరిగారు.
వరంగల్‌ వ్యక్తినీ అనుమతించలేదు
పుల్లూరు వద్ద తెలంగాణ పోలీసులు వెనక్కి పంపిన అంబులెన్సుల్లోని కొందర్ని కర్నూలు జిల్లా పోలీసులు అక్కడి ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. వరంగల్‌కు చెందిన యోహాన్‌ అనంతపురంలోని ఆయన కుమారుడి వద్దకు వచ్చి అస్వస్థతకు గురికాగా.. ఆయన్ను హైదరాబాద్‌ అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు అనుమతించకపోవటంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. కడప జిల్లా చౌట్‌పల్లికి చెందిన రాఘవరెడ్డిని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. కడప జిల్లాకు చెందిన లీలావతి, బళ్లారి నుంచి వచ్చిన ప్రమీల, హిందూపూర్‌కు చెందిన మరో మహిళా రోగి వెనక్కి మళ్లిపోయారు. వారి పరిస్థితి ఏమిటో తెలియని దుస్థితి.  


ఉమ్మడి రాజధానిగా మూడేళ్ల సమయం ఉంది.. సామినేని
రామాపురం అడ్డురోడ్డు వద్ద ఏపీ ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను తెలంగాణ సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాజధానిగా ఇంకా మూడేళ్ల సమయం ఉందని, తామేమీ పాకిస్తాన్‌ నుంచి రావట్లేదని మండిపడ్డారు. మాజీ మంత్రి నెట్టెం రఘురాం సైతం చెక్‌పోస్టు వద్దకు వచ్చి నిరసన తెలిపారు. పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌  పోలీసులతో మాట్లాడగా హైదరాబాద్‌ ఆసుపత్రిలో పడక నిర్ధారణ అయిన రోగి ఉన్న అంబులెన్సును అనుమతించారు. ఆ తర్వాత పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అక్కడికి చేరుకుని గద్వాల జిల్లా ఎస్పీతో మాట్లాడినా ప్రయోజనం లేకపోయింది. తెదేపా కర్నూలు జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వరరావు, భాజపా నాయకులు అక్కడికి చేరుకొని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల తీరును ఎండగట్టి నిరసనకు దిగారు. ఏపీ సరిహద్దుల్లోకి వెళ్లాలని తెలంగాణ పోలీసులు సూచించడంతో వారు పంచలింగాల వద్దకు వచ్చి జాతీయ రహదారిపై ఆందోళన కొనసాగించారు. మొత్తంగా పుల్లూరు నుంచి 20 అంబులెన్సులను వెనక్కు పంపి మూడింటికి అనుమతించారు. రామాపురం వద్ద 57కు పైగా అంబులెన్సులు వెనుదిరిగాయి. పదింటిని అనుమతించారు. మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా, కర్ణాటక నుంచీ ఎక్కువ మంది హైదరాబాద్‌ వస్తున్నారని, పడకలు దొరక్క ఇబ్బంది పడుతున్నారని, అందుకే అనుమతించడంలేదని పోలీసులు అంటున్నారు.


హైకోర్టు ఆదేశించినా అనుమతించరా?
-మహబూబ్‌ బాషా, ఆదోని

వైద్యారోగ్య శాఖలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేసి పదవీ విరమణ పొందాను. మా అత్త మరియమ్‌ బీ (83)కి కొవిడ్‌ నిర్ధారణైంది. హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లోని రోమా ఆసుపత్రిలో పడక ఖరారు చేసుకున్నాం. పుల్లూరు వద్దకు వచ్చాక ఈ-పాస్‌ ఉంటేనే అనుమతిస్తామని నిలిపేశారు. అంబులెన్సులు అడ్డుకోవొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించినా అనుమతించకపోతే ఎలా? ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలి. మా అత్త ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్‌ వెళ్లే వీలు లేనందున ఏం చేయాలో అర్థం కావట్లేదు.


అంబులెన్స్‌లు ఆపడం తగదు
- కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న అంబులెన్సులను తెలంగాణ సరిహద్దుల్లో ఆపడం మంచి సంప్రదాయం కాదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. దిల్లీలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉభయ తెలుగు రాష్ట్రాలు సమన్వయంతో సహకరించుకోవాలన్నారు. మృత్యువుతో పోరాడుతూ అంబులెన్స్‌ల్లో వస్తున్న వారిని అడ్డుకోవడం తప్పన్నారు. ఈ విషయంలో మానవీయ కోణంలో ఆలోచించాలని తెలంగాణ ముఖ్యమంత్రికి సూచించారు. కేసీఆర్‌ చొరవ తీసుకొని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్యను ఏరకంగా పరిష్కరించాలో ఆలోచించాలని కోరారు. ఈ అంశంపై ఇప్పటికే కేంద్ర హోం శాఖ కార్యదర్శి తెలంగాణ ప్రధాన కార్యదర్శితో మాట్లాడారని ఆయన చెప్పారు.ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు