మీరెవరు అడ్డుకోడానికి?
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మీరెవరు అడ్డుకోడానికి?

బాధితులు సరిహద్దుల్లో చనిపోవాల్సిందేనా!
అంబులెన్సులను ఆపడం రాజ్యాంగ విరుద్ధం
తెలంగాణ సర్క్యులర్‌పై హైకోర్టు ఆగ్రహం
తక్షణం అమలును నిలిపివేస్తున్నట్లు ఆదేశం  


‘‘సలహా పేరుతో సర్క్యులర్‌ జారీ చేసి ఇతర రాష్ట్రాలవారి రాకపోకలను అడ్డుకోజాలరు. మీలా సర్క్యులర్‌ జారీ చేసిన ఒక్క రాష్ట్రమేదైనా ఉంటే చూపండి. ఏ చట్టాలైనా, ఉత్తర్వులైనా రాజ్యాంగానికి లోబడి ఉండాల్సిందే. రాష్ట్రాల మధ్య రాకపోకలను అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధం. కొవిడ్‌ సోకి అల్లాడుతూ అంబులెన్సులో వచ్చిన బాధితులు అనుమతులు పొందలేకపోతే సరిహద్దులోనే చనిపోవాల్సిందేనా? ఈ సర్క్యులర్‌ రూపొందించినదెవరు? వారిపై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోరాదో నోటీసుల జారీ చేస్తాం’’
గద్వాల, కరీంనగర్‌ వంటి పట్టణాల నుంచి వచ్చేవాళ్లకు కూడా హైదరాబాద్‌లో బెడ్‌లు ఖాళీ ఉన్నాయో లేదో తెలియడంలేదు. ఈ విషయం ప్రధాన కార్యదర్శికీ తెలుసు. ఎక్కడా దొరక్కపోతే గాంధీ, ఉస్మానియాలకు వెళ్తుంటారు. మరి వారిని అనుమతిస్తున్నపుడు ఇతర రాష్ట్రాల వారిని అనుమతించకపోవడం వివక్ష చూపడమే కదా. పడకలు దొరక్కపోతే వారే వెనక్కి వెళ్లిపోతారు. లేదంటే వాళ్ల ప్రాణాలను వాళ్లే ప్రమాదంలో పెట్టుకుంటారు. వైరస్‌ వ్యాప్తి అంటూ మీరు చెబుతున్నది సరైన కారణం కాదు.

- తెలంగాణ హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: ఇతర రాష్ట్రాల నుంచి చికిత్స కోసం వచ్చే కొవిడ్‌ రోగులు ఆసుపత్రుల్లో బెడ్‌ కేటాయింపునకు సంబంధించిన ధ్రువీకరణ పత్రం చూపి, కంట్రోల్‌ రూమ్‌ నుంచి అనుమతి పొందాకే రాష్ట్రంలోకి అనుమతించాలంటూ తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 11న జారీ చేసిన సర్క్యులర్‌ అమలును హైకోర్టు నిలిపివేసింది.  అత్యవసరంగా చికిత్స కోసం అంబులెన్సుల్లో వచ్చే రోగులను అడ్డుకోడానికి దొడ్డిదారిలో మరే ఉత్తర్వులు, మార్గదర్శకాలు, సర్క్యులర్లూ తెచ్చే ప్రయత్నం చేయవద్దని హోంశాఖ కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను హెచ్చరించింది. ఇక్కడికి వచ్చి ఆసుపత్రుల్లో చేరడానికి ఎలాంటి అధీకృత పత్రం అవసరంలేదంది. తమ ఆదేశాలు తక్షణం అమలయ్యేలా అధికార యంత్రాంగానికి సమాచారం ఇవ్వాలని సూచించింది. రెండు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలంటూ విచారణను జూన్‌ 17కు వాయిదా వేసింది. ఇతర రాష్ట్రాల నుంచి కొవిడ్‌ చికిత్స కోసం తెలంగాణకు వచ్చే రోగులు ముందుగా ఆసుపత్రుల్లో బెడ్‌ రిజర్వ్‌ చేసుకోవాలని, కంట్రోల్‌ రూమ్‌లో ధ్రువీకరణ పత్రం పొందాలంటూ ఈనెల 11న ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన జి.వెంకట కృష్ణారావు అత్యవసరంగా ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం మధ్యాహ్నం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.


ప్రజల కోసమే..
- అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌

విషమిస్తున్న పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికే మార్గదర్శకాలు జారీ చేశామని తెలంగాణ అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ తెలిపారు. వివిధ రాష్ట్రాల నుంచి కొవిడ్‌ రోగులు విపరీతంగా వస్తున్నారని, పడకలు దొరక్క నగరం మొత్తం తిరుగుతున్నారని, దీనివల్ల వైరస్‌ వ్యాప్తి తీవ్రమవుతోందన్నారు. ఇప్పటికే ఇక్కడ బెడ్‌లు, ఆక్సిజన్‌, మందుల కొరత ఉందని, తెలంగాణ ప్రజలకు ఇబ్బంది లేకుండా వైద్యం అందించాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఇతర రాష్ట్రాల రోగుల రాకపోకలను అడ్డుకోవడంలేదని, కేవలం ఆసుపత్రిలో పడకకు ధ్రువీకరణ చూపి అనుమతి పొందాలంటున్నామన్నారు. ఇక్కడ వైద్యం కోసం వచ్చి అది లభించక ఎవరూ చనిపోరాదన్నదే తమ లక్ష్యమని వివరించారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ అలాంటి సర్క్యులర్‌ ఎలా జారీ చేస్తారు? ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వచ్చేవారిని అడ్డుకోవడానికి వీల్లేదు.. అని పేర్కొంది. పైగా ఇది ఈనెల 11న తాము ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధమని తప్పుపట్టింది. కేంద్రం సలహాతో చేశామనగా అది చట్టబద్ధం కాదని, రోగులను ఎలా వెనక్కి పంపుతారని ప్రశ్నించింది. మీలా ఏ రాష్ట్రమూ చట్టవిరుద్ధంగా సర్క్యులర్‌ జారీ చేయలేదని వ్యాఖ్యానించింది. గతంలో తమిళనాడు, కర్ణాటక మధ్య వివాదంలో సుప్రీం కోర్టు తీర్పునకు ఇది విరుద్ధమని పేర్కొంది.


అడ్డుకునే హక్కెవరిచ్చారు?
జాతీయ రహదారులపై రాకపోకలను అడ్డుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరిచ్చారని ధర్మాసనం ప్రశ్నించింది. ఇది శిక్షార్హమని పేర్కొంది. ఎన్‌హెచ్‌ అథారిటీ నుంచి అనుమతి పొందారా అని నిలదీసింది. ఏజీ జోక్యం చేసుకుంటూ మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాలు కూడా రాకపోకలను నిషేధించాయని, తాము సాధారణ ప్రజల రాకపోకలను అడ్డుకోలేదనగా.. ‘మీలా బెడ్‌లు ఉంటేనే అనుమతిస్తామంటూ ఏ రాష్ట్రమైనా ఆదేశాలిచ్చి ఉంటే చూపండి’ అని కోర్టు పేర్కొంది. విపత్తుల నిర్వహణ చట్టం, అంటువ్యాధుల నిరోధక చట్టాలకు లోబడే సర్క్యులర్‌ జారీ చేశామన్న ఏజీ వాదనతో విభేదిస్తూ ఏ చట్టాలైనా రాజ్యాంగానికి అతీతం కాదని స్పష్టంచేసింది. ఈ దశలో ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ జోక్యం చేసుకుంటూ లాక్‌డౌన్‌ కారణంగా నియంత్రణ అమలు చేస్తున్నామన్నారు. సాధారణ వాహనాలను అడ్డుకోవడంలేదని, రాజస్థాన్‌, దిల్లీ, మహరాష్ట్ర కూడా ఇలాంటి జీవోలు ఇచ్చాయనగా మీలా ఆసుపత్రుల్లో బెడ్‌లు కేటాయింపు చూపాలంటూ ఎవరైనా ఉత్తర్వులు ఇచ్చారా? అంటూ ధర్మాసనం మరోమారు ప్రశ్నించింది. రాష్ట్రంలోకి వచ్చేవారికి ఆర్‌టీపీసీఆర్‌ ధ్రువీకరణ పత్రం ఉండేలా చూడాలని గతంలో చెప్పామని, మరిదాన్నెందుకు పట్టించుకోరని నిలదీసింది.


మెరుగైన వైద్యం కోసమే వస్తుంటారు: ఏపీ అడ్వొకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం
ఆంధ్రప్రదేశ్‌ అడ్వొకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం వాదనలు వినిపిస్తూ అన్ని రాష్ట్రాలూ సవాళ్లను ఎదుర్కొంటున్నాయని అన్నారు. ఖమ్మం విజయవాడకు సమీపంలోనూ, ఆదిలాబాద్‌ మహారాష్ట్రకు దగ్గరగా ఉన్నాయని, అక్కడివారు సమీప ప్రాంతాలకే వైద్యం కోసం వెళ్తుంటారన్నారు. అలాగే చాలా ప్రాంతాలవారు అత్యవసర వైద్యం కోసం మెరుగైన సౌకర్యాలున్న హైదరాబాద్‌ వస్తుంటారని చెప్పారు. పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ గుజరాత్‌లో ఆసుపత్రిలో చేరాలంటే స్థానికంగా నివాస గుర్తింపు పత్రాన్ని చూపాలన్న నిబంధనను సుప్రీం కోర్టు తప్పుబట్టిందని గుర్తుచేశారు. ఈ వాదనలను విన్న ధర్మాసనం తెలంగాణ సర్క్యులర్‌ అమలును నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. ఈ దశలో పిటిషనర్‌ తరఫు న్యాయవాది అభ్యర్థనపై ధర్మాసనం తక్షణం ఉత్తర్వులు అమలయ్యేలా అధికారులకు ఆదేశాలివ్వాలని ఏజీకి సూచిస్తూ విచారణను వాయిదా వేసింది.


 


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు