మీ బాధల్లో నేనూ భాగస్వామినే
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మీ బాధల్లో నేనూ భాగస్వామినే

ఆసుపత్రుల ఏర్పాటు, ఔషధాలు, టీకాల ఉత్పత్తికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నాం

‘వందేళ్ల తర్వాత వచ్చిన భయంకర మహమ్మారి ప్రపంచానికి అడుగడుగునా పరీక్ష పెడుతోంది. మన ముందు ఇప్పుడు బహురూప అదృశ్య శత్రువు పొంచి ఉంది. దీని కారణంగా ఎంతో మంది ఆప్తులను కోల్పోయాం. గత కొన్ని రోజులుగా దేశ ప్రజలు కష్టాలు, బాధల్లో కొట్టుమిట్టాడుతున్నారు. నేనూ అంతే స్థాయిలో బాధను చవిచూస్తున్నాను. దేశ ప్రధాన సేవకుడిగా మీ భావనలన్నింటిలో నాకూ భాగస్వామ్యం ఉంది. కష్టాలు ఎదురైనప్పుడు ధైర్యాన్ని కోల్పోయే దేశం కాదు మనది. కరోనాపై మనం పోరాడి గెలుస్తాం. కరోనా రెండో దశ వ్యాప్తిని నిలువరించేందుకు ప్రభుత్వంలోని అన్ని విభాగాల వారు,  దేశ భద్రతా బలగాలు, శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు.   

  - ప్రధాని మోదీ


గుండె నిబ్బర భారత్‌

మహమ్మారిపై సమష్టి పోరులో విజయం సాధిస్తాం
కిసాన్‌ సమ్మాన్‌ నిధుల విడుదల కార్యక్రమంలో ప్రధాని వెల్లడి

ఈనాడు, దిల్లీ: బహురూప అదృశ్య శత్రువుపై జరుగుతున్న పోరాటంలో మన దేశం విజయం సాధిస్తుందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. విపత్తులు చుట్టుముట్టినప్పుడు భారత్‌ ధైర్యం కోల్పోయే దేశం కాదని పేర్కొన్నారు. శతాబ్దం తర్వాత విరుచుకుపడిన భయంకర మహమ్మారి ప్రపంచానికి అడుగడుగునా పరీక్ష పెడుతున్నా భారతీయులందరూ కలిసికట్టుగా దాన్ని ఎదుర్కొంటున్నారని తెలిపారు.  ప్రధాని మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కిసాన్‌ సమ్మాన్‌ నిధి 8వ విడత కింద దేశవ్యాప్తంగా 9,50,67,601 మంది రైతులకు రూ.20,667 కోట్లు విడుదల చేశారు. ఇప్పటి వరకు ఈ పథకం కింద 11 కోట్ల మంది రైతులకు మొత్తం రూ.1.35 లక్షల కోట్లు అందినట్లు ప్రధాని చెప్పారు. పథకం ప్రారంభమైన రెండేళ్ల తర్వాత పశ్చిమ బెంగాల్‌కు చెందిన 7.03 లక్షల మంది రైతులకు మొట్టమొదటి సారిగా కిసాన్‌ సమ్మాన్‌ నిధులు శుక్రవారం విడుదలయ్యాయి. కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ కరోనా సమయంలో రైతులు దేశానికి చేస్తున్న సేవను ప్రత్యేకంగా శ్లాఘించారు.
రైతుల శ్రమ ఫలితమే ఉచిత రేషన్‌
‘కరోనాపై జరుగుతున్న యుద్ధంలో పల్లెలు, రైతులకు ప్రధాన భూమిక ఉంది. మీ శ్రమ ఫలితం వల్లే ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత రేషన్‌ పథకాన్ని భారత్‌ అమలు చేయగలుగుతోంది. గత ఏడాది 8 నెలల పాటు పేదలకు ఉచిత రేషన్‌ పంపిణీ చేయగలిగాం. ఇప్పుడు మే, జూన్‌ నెలల్లో 80 కోట్ల మందికి పైగా పేదలకు ఉచితంగా తిండి గింజలు ఇస్తున్నాం’ అని ప్రధాని తెలిపారు.
నల్లబజారు వ్యాపారులపై కఠిన చర్యలు
‘ప్రస్తుత సంకట సమయంలో మందులు, అత్యవసర వస్తువులను కొందరు స్వార్థపరులు అక్రమంగా నిల్వచేసి, నల్లబజారులో విక్రయిస్తున్నారు. ఇది మానవత్వానికి వ్యతిరేకమైన చర్య. రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని ప్రధాని సూచించారు.

 
గ్రామీణులూ.. జర భద్రం 

‘ఇప్పుడు గ్రామాల్లోనూ కరోనా వేగంగా సంక్రమిస్తోంది. ప్రజలందరూ మాస్కులు ధరించాలి. జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పుల్లాంటి లక్షణాలు కనిపిస్తే వాటిని సాధారణమైనవిగా భావించొద్దు. వెంటనే వేరుగా ఉండి, వేగంగా పరీక్ష చేయించుకోండి. రిపోర్టు వచ్చేంత వరకు వైద్యులు చెప్పే మందులు తీసుకోండి. దీన్నుంచి బయటపడే మార్గం కరోనా టీకాయే. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా లభిస్తోంది. మీ వంతు వచ్చినప్పుడు తప్పనిసరిగా టీకా తీసుకోండి. ఇప్పటివరకు 18కోట్ల డోసులు అందించాం. సాధ్యమైనంత ఎక్కువ మందికి వేగంగా టీకా అందించడానికి ప్రయత్నిస్తున్నాం’అని మోదీ పేర్కొన్నారు.

 

కిసాన్‌ క్రెడిట్‌కార్డు రెన్యువల్‌ గడువు పెంపు 

రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు అందించడానికి 2 కోట్ల కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు మంజూరు చేశామని, వీటి ద్వారా రైతులు రూ.2లక్షల కోట్ల రుణం తీసుకున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. కరోనా సమయాన్ని దృష్టిలో ఉంచుకొని కేసీసీ రెన్యూవల్‌ సమయాన్ని పెంచినట్లు తెలిపారు. బకాయిలు ఉన్న రైతులు జూన్‌ 30లోపు తమ రుణాలను రెన్యూవల్‌ చేసుకోవచ్చన్నారు. ఈ సమయంలోనూ రైతులకు 4% వడ్డీ ప్రయోజనం దక్కుతుందన్నారు. వివిధ పథకాల కింద లబ్ధిపొందుతున్న ఆరుగురు రైతులతో ప్రధాని మోదీ నేరుగా మాట్లాడారు. వారిలో ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా మహిళా రైతు వన్నూరమ్మ కూడా ఉన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు