టీకాల ఉత్పత్తి పెంచండి
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీకాల ఉత్పత్తి పెంచండి

కొవిడ్‌ కట్టడికి సహకరించండి
 ఔషధ సంస్థలకు మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తి
అన్నివిధాలా ప్రోత్సహిస్తామని వెల్లడి  

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా తీవ్రత దృష్ట్యా అవసరమైన టీకాలు, ఔషధాలు, ఇంజక్షన్లను సరఫరా చేయాలని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు కోరారు. ఈ క్రమంలో ఉత్పత్తి సామర్థ్యం పెంపుదల, రవాణా తదితర అంశాలకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందన్నారు. ‘‘రాష్ట్రంలోని ప్రజలకు వీలైనంత త్వరగా టీకాల పంపిణీ సాగాలి. మందులు, ఇంజక్షన్లకు కొరత రాకూడదు. ఈ లక్ష్యంతో మా ప్రభుత్వం పనిచేస్తోంది. ముందస్తు ప్రణాళికలతో వ్యవహరిస్తోంది’’ అని తెలిపారు. కొవిడ్‌పై ప్రభుత్వం నియమించిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ అయిన కేటీఆర్‌ టీకాలు, ఔషధాలు, రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల తయారీదారులతో శుక్రవారం ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. భారత్‌ బయోటెక్‌, బయోలాజికల్‌-ఇ, సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, నాట్కో ఫార్మా, జైడుస్‌ కాడిలా, హెటిరో డ్రగ్స్‌, సనోఫి ఇండియా, వర్చ్యు బయోటెక్‌, గ్లాండ్‌ ఫార్మా, ఇండియన్‌ ఇమ్యునోలాజికల్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ సంస్థల ప్రతినిధులతో విడివిడిగా సమావేశమయ్యారు.
రాష్ట్రంలో టీకాలు, ఔషధాలు, ఇంజక్షన్ల డిమాండు, లభ్యత వాటిని సమకూర్చుకోవడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

చరిత్ర సృష్టించిన భారత్‌ బయోటెక్‌
తెలంగాణలో కరోనా కట్టడి తక్షణావసరమని దీని కోసం సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో పకడ్బందీగా ముందుకెళ్తున్నామని కేటీఆర్‌ తెలిపారు. ‘‘ఆసుపత్రుల్లో పడకలు పెద్దఎత్తున పెంచాం. వెంటిలేటర్లు, ఇతర మౌలిక వసతులు కల్పించాం. వైద్య సిబ్బందిని నియమిస్తున్నాం. ఆక్సిజన్‌ కొరత తీరుస్తున్నాం. ఇప్పుడు చికిత్సకు టీకాలు, ఔషధాలు, ఇంజక్షన్లు కీలకం. తెలంగాణలో అన్ని వయసుల వారికి టీకాలు వేయాలని కేసీఆర్‌ సంకల్పించారు. గ్లోబల్‌ టెండర్లను పిలవాలని మంత్రిమండలి నిర్ణయించింది. రాష్ట్రం ఔషధ ఉత్పత్తి కేంద్రంగా ఉంది. కరోనా నివారణకు దేశీయంగా తొలి టీకా కొవాగ్జిన్‌ ఉత్పత్తి ద్వారా భారత్‌ బయోటెక్‌ చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌, స్పుత్నిక్‌ టీకాలు అందుబాటులో ఉన్నాయి. మరో మూడు రకాలు త్వరలోనే రానున్నాయి. మన ఔషధ సంస్థలకు విశ్వ ఖ్యాతి ఉంది. రాష్ట్రంలో టీకాల లభ్యత కోసం ఉత్పత్తిని ముమ్మరం చేయాలి. రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌, బ్లాక్‌ ఫంగస్‌ తదితరాలకు సంబంధించిన మందులకు భారీ డిమాండు ఉంది. వీటన్నింటి కోసం పెద్దఎత్తున కృషి జరగాలి. అందుకు అన్ని సంస్థలూ ముందుకు రావాలి. టీకాల విషయంలో భారత్‌ బయోటెక్‌, బయోలాజికల్‌-ఇ ఇప్పటికే ముందంజలో ఉన్నాయి. మిగిలిన సంస్థలు ఈ కృషిలో భాగస్వాములు కావాలి. ప్రభుత్వపరంగా అన్నివిధాలా ప్రోత్సాహాన్ని అందిస్తాం. ప్రస్తుతం సిద్ధంగా ఉన్నవే గాక భవిష్యత్తులో అందుబాటులోకి రానున్న వివిధ టీకాలను తెలంగాణలో పంపిణీ చేసేందుకు సంస్థలు ప్రాధాన్యమివ్వాలి. టీకాల సేకరణకు సంబంధించి స్థానిక సంస్థలతో పాటు అంతర్జాతీయ సంస్థలతో సంప్రదింపులు నిర్వహిస్తాం’’ అని మంత్రి చెప్పారు. కార్యక్రమంలో పరిశ్రమలు, సాధారణ పరిపాలన, పంచాయతీరాజ్‌ శాఖల ముఖ్య కార్యదర్శులు జయేశ్‌రంజన్‌, వికాస్‌రాజ్‌, సందీప్‌కుమార్‌ సుల్తానియా, విపత్తు నివారణ శాఖ కమిషనర్‌ రాహుల్‌బొజ్జా, సీఎంవో కార్యదర్శి, కరోనా ప్రత్యేకాధికారి రాజశేఖర్‌రెడ్డి, టీఎస్‌ఐఐసీ ఎండీ వెంకటనర్సింహారెడ్డి, జీవశాస్త్రాల సంచాలకుడు శక్తినాగప్పన్‌లు పాల్గొన్నారు.
టీఎస్‌ఐఐసీ రూ. 1.19 కోట్ల విరాళం
రాష్ట్ర ప్రభుత్వం కరోనా నియంత్రణకు కోసం చేస్తున్న కార్యక్రమాల కోసం తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) కార్పొరేటు సామాజిక బాధ్యత కింద రూ.1.19 కోట్ల విరాళాన్ని అందించింది. మంత్రి కేటీ రామారావు సమక్షంలో టీఎస్‌ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌లు దీనికి సంబంధించిన చెక్కును రాష్ట్ర విపత్తు నివారణ కమిషనర్‌ రాహుల్‌ బొజ్జాకు అందజేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు