స్పుత్నిక్‌ వి టీకా రూ. 995
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్పుత్నిక్‌ వి టీకా రూ. 995

హైదరాబాద్‌లో తొలి డోసు వినియోగం  
త్వరలో లభ్యత పెంచుతాం
 డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌

ఈనాడు, హైదరాబాద్‌: దేశీయ మార్కెట్లో ‘స్పుత్నిక్‌ వి’ టీకాను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ వెల్లడించింది. పరిమిత ప్రయోగాత్మక ప్రాజెక్టులో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌ డాక్టర్‌ రెడ్డీస్‌లో కస్టమ్‌ ఫార్మా సర్వీసెస్‌ వ్యాపార విభాగానికి అధిపతిగా ఉన్న దీపక్‌ సప్రా తొలి ‘స్పుత్నిక్‌ వి’ డోసు తీసుకున్నారు. రష్యా సంస్థ ఆర్‌డీఐఎఫ్‌ నుంచి నేరుగా హైదరాబాద్‌లోని డాక్టర్‌ రెడ్డీస్‌కు తొలి విడతగా 1.5 లక్షల డోసుల ‘స్పుత్నిక్‌ వి’ టీకా ఈ నెల 1వ తేదీన దిగుమతి అయింది. వాటిని పంపిణీ చేయడానికి హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలోని కసౌలిలో ఉన్న సెంట్రల్‌ డ్రగ్స్‌ లేబొరేటరీ ఈ నెల 13న అనుమతినిచ్చింది. దీంతో టీకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ‘డాక్టర్‌ రెడ్డీస్‌’ వివరించింది. వచ్చే వారంలో మరికొన్ని డోసులు రష్యా నుంచి వస్తాయని, ఆ తర్వాత దేశీయంగా తయారయ్యే స్పుత్నిక్‌ వి టీకా కూడా అందుబాటులోకి వస్తుందని తెలిపింది. వచ్చే నెల నుంచి దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, కార్పొరేట్‌ సంస్థలకు టీకా అందిస్తామని పేర్కొంది.
ధర ఇదీ :  దిగుమతి చేసుకుంటున్న టీకా ఒక డోసు ధర రూ.948గా నిర్ణయించారు. దీనికి 5 శాతం జీఎస్‌టీ అదనం. అంటే ఒక డోసుకు రూ.995.40 చెల్లించాల్సి వస్తుంది. దేశీయంగా తయారీ మొదలయ్యాక ధర తగ్గే అవకాశం ఉన్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ పేర్కొంది. మొత్తం 25 కోట్ల డోసుల స్పుత్నిక్‌ టీకా పంపిణీకి ఆర్‌డీఐఎఫ్‌, డాక్టర్‌ రెడ్టీస్‌ మధ్య ఒప్పందం కుదిరింది. ఇందులో దాదాపు 15- 20 శాతం డోసులు రష్యా నుంచి నేరుగా మనదేశానికి దిగుమతి అవుతాయి. మిగిలినవి తయారు చేయడానికి ఆర్‌డీఐఎఫ్‌ మనదేశానికి చెందిన ఆరు ఫార్మా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. హెటిరో బయో ఫార్మా, గ్లాండ్‌ ఫార్మా, విర్కో బయోటెక్‌, పానేషియా బయోటెక్‌, స్టెలిస్‌ బయోఫార్మా ఇందులో ఉన్నాయి. ఈ కంపెనీలతో కలిసి పనిచేస్తున్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ పేర్కొంది. ఈ కంపెనీలు ఈ ఏడాది జులై నుంచి దేశంలో టీకా ఉత్పత్తి చేపట్టే అవకాశం ఉంది. కొవిడ్‌- 19 ను ఎదుర్కోడానికి అందరికీ టీకా ఇవ్వడమే పరిష్కారమని ఈ సందర్భంగా డాక్టర్‌ రెడ్డీస్‌ ఎండీ జీవీ ప్రసాద్‌ అన్నారు. ఈ బృహత్కార్యంలో భాగస్వామిగా మారి ప్రజలకు అండగా నిలుస్తున్నామని వివరించారు.
ఇది మూడో టీకా :  కొవిడ్‌-19 కు మనదేశంలో ఇప్పటి వరకు రెండు కంపెనీల టీకాలు మాత్రమే ఉన్నాయి. సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్‌, భారత్‌ బయోటెక్‌- కొవాగ్జిన్‌ టీకాలను ఇప్పటికే ప్రజలకు ఇస్తున్నారు. స్పుత్నిక్‌ వి తో మూడో టీకా అందుబాటులోకి వచ్చినట్లు అయింది. ఇది కూడా రెండు డోసుల టీకా. దీనికి 90 శాతానికి పైగా ‘ప్రభావశీలత’ ఉన్నట్లు గతంలోనే ఆర్‌డీఐఎఫ్‌ వెల్లడించింది.
స్పుత్నిక్‌ లైట్‌ కూడా అందిస్తాం
భారతదేశానికి త్వరలో స్పుత్నిక్‌ వి లైట్‌ టీకా సైతం అందించాలనేది తమ లక్ష్యమని రష్యా సంస్థ ఆర్‌డీఐఎఫ్‌ సీఈఓ కిరిల్‌ డిమిట్రివ్‌ తెలిపారు. ఇది సింగిల్‌ డోస్‌ టీకా. దీనికి రష్యాలో ఇప్పటికే అనుమతి లభించింది. సింగిల్‌ డోస్‌ టీకాను తక్కువ సమయంలో ఎక్కువ మందికి ఇచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు స్పుత్నిక్‌ వి రెండు డోసుల టీకా లభ్యత పెంచుతున్నట్లు, రెండో విడతగా కొన్ని డోసుల టీకా డాక్టర్‌ రెడ్డీస్‌కు ఈ వారాంతంలో పంపుతున్నట్లు కిరిల్‌ వివరించారు. ఈ ఏడాది భారతదేశంలో 85 కోట్ల డోసుల టీకా తయారు చేయాలనేది తమ ఆలోచనగా తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు