ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టు

అడ్డుకునేందుకు ప్రయత్నించిన భద్రతా సిబ్బంది  

ఈనాడు- అమరావతి, న్యూస్‌టుడే-హైదరాబాద్‌: పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వైకాపా ఎంపీ కె.రఘురామకృష్ణరాజును ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఏపీ సీఐడీ అధికారుల బృందం హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని బౌల్డర్‌హిల్స్‌లో ఉన్న రఘురామకృష్ణరాజు నివాసానికి చేరుకుని ఆయన్ను అదుపులోకి తీసుకుంది. సాయంత్రం 4 గంటల సమయంలో ఆయన్ను వాహనంలో ఎక్కించుకుని హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు తరలించారు. అక్కడి నుంచి రాత్రి 9.50 గంటల సమయంలో గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తీసుకొచ్చారు. శుక్రవారం రాత్రి రఘురామకృష్ణరాజును అక్కడే ఉంచారు. శనివారం న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. శుక్రవారం ఎంపీ జన్మదినం కావడంతో హైదరాబాద్‌లోని నివాసంలో కుటుంబసభ్యులతో ఉండగా అరెస్టు చేశారు. రఘురామకృష్ణరాజు కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తున్నారని, ప్రభుత్వం పట్ల అవిధేయతను ప్రోత్సహిస్తున్నారనే సమాచారంపై ప్రాథమిక విచారణ జరిపామని సీఐడీ అదనపు డీజీపీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
అరెస్టును అడ్డుకున్న సీఆర్‌పీఎఫ్‌ బృందం
రఘురామకృష్ణరాజుకు వై కేటగిరీ భద్రత ఉంది. ఆయన భద్రత విధుల్లో సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది ఉన్నారు. ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి చేరుకుని అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందితో పాటు, ఎంపీ కుమారుడు భరత్‌ వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎంపీ కుర్చీపై కూర్చోగా.. ఆయన చుట్టూ సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది వలయంగా ఏర్పడి సీఐడీ అధికారుల్ని దగ్గరకు రానివ్వకుండా నిలువరించారు. సీఆర్‌పీఎఫ్‌ ఉన్నతాధికారులు  అనుమతిస్తేనే ఎంపీని అదుపులోకి తీసుకునేందుకు అంగీకరిస్తామని వారు  చివరకు సీఐడీ అధికారులు.. సీఆర్‌పీఎఫ్‌ ఉన్నతాధికారులతో మాట్లాడి రఘురామకృష్ణరాజును అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులా.. రౌడీలా: భరత్‌
ఎంపీ  అరెస్టును ఆయన కుమారుడు భరత్‌ తీవ్రంగా ఖండించారు. పోలీసులతో ఆయన  వాగ్వాదానికి దిగారు. ముందస్తు నోటీసులివ్వకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ  ప్రశ్నించారు. సాధారణ దుస్తుల్లో వచ్చింది  సీఐడీ అధికారులా లేక రౌడీలా అర్థం కాలేదు.  
బెయిల్‌ కోసం రఘురామ కృష్ణరాజు అత్యవసర పిటిషన్‌
ఈనాడు, అమరావతి : సీఐడీ నమోదు చేసిన కేసులో బెయిలు మంజూరు చేయాలని కోరుతూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు శుక్రవారం రాత్రి అత్యవసరంగా హౌజ్‌మోషన్‌ విధానంలో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై శనివారం మధ్యాహ్నం విచారణ జరుపుతామన్న హైకోర్టు.. అప్పటి వరకు ఎంపీ రఘురామకృష్ణరాజును మెజిస్ట్రేట్‌ ముందు హాజరు పరచవద్దని పేర్కొంది.  
అరెస్టుపై చంద్రబాబు ధ్వజం
ఈనాడు, అమరావతి: కరోనా నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యాలు, అమూల్‌ విషయంలో రైతుల హక్కులపై ప్రశ్నించిన ఎంపీ రఘురామకృష్ణరాజుపై దేశ ద్రోహం కేసు పెట్టినందుకు ఏపీ ప్రభుత్వం సిగ్గుపడాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారందరిపై కేసులు పెడుతున్న జగన్‌రెడ్డి ప్రజా కోర్టులో తప్పించుకోలేరని ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు.
ఎంపీ అరెస్టు దారుణం: బండి సంజయ్‌
ఈనాడు, హైదరాబాద్‌: ఏపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజును హైదరాబాద్‌లో అరెస్టు చేసిన తీరు దారుణంగా ఉందని.. రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోలేక ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని భాజపా తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌ మండిపడ్డారు. తన మిత్రుడైన జగన్‌ కోసం తెలంగాణ సీఎం నిబంధనల్ని తుంగలో తొక్కుతున్నారన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు