Remdesivir, Oxygen కోటా పెంపు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Remdesivir, Oxygen కోటా పెంపు

రోజూ మరో 5,000 ఇంజక్షన్లు
అదనంగా 200 టన్నుల ఆక్సిజన్‌
సీఎం కేసీఆర్‌కు తెలిపిన కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌

ఈనాడు, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ వినతి మేరకు కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రానికి రెమ్‌డెసివిర్‌, ఆక్సిజన్‌ కేటాయింపులు పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణకు ప్రస్తుతం రోజుకు 5,500 రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు ఇస్తుండగా మరో అయిదువేలు కలిపి మొత్తం 10,500 చొప్పున సరఫరా చేయనుంది. అలాగే ప్రస్తుతం 430 టన్నుల ఆక్సిజన్‌ను సమకూరుస్తుండగా 200 టన్నులు అదనంగా ఇవ్వనుంది. కేంద్ర పరిశ్రమలు, రైల్వే శాఖల మంత్రి పీయూష్‌ గోయల్‌ శనివారం రాత్రి సీఎం కేసీఆర్‌కు ఫోన్‌ చేసి ఈ విషయం చెప్పారు.  త్వరలో టీకాలను సైతం సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.

సోమవారం నుంచే...
గత వారం దృశ్యమాధ్యమ సమీక్షలో ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ రాష్ట్ర అవసరాలను తెలియజేశారు. అందరికీ కరోనా వైద్యం అందించాలని హైకోర్టు పేర్కొన్న నేపథ్యంలో టీకాలు, రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు, ఆక్సిజన్‌ను తగిన మేరకు సరఫరా చేయాలని అభ్యర్థించారు. దీనిపై ప్రధాని.. పీయూష్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఆయన అదేరోజు కేసీఆర్‌తో మాట్లాడారు. అధికారులతో చర్చించి తెలంగాణకు కోటా పెంచే నిర్ణయం తీసుకున్నారు. ‘‘తెలంగాణకు పెంచిన 5,000 రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు సోమవారం నుంచి పంపిణీ అవుతాయి. ఆక్సిజన్‌ను ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌ నుంచి, ఒడిశాలోని అనుగుల్‌ నుంచి, పశ్చిమబెంగాల్‌లోని దుర్గాపూర్‌ నుంచి సరఫరా చేయాలని నిర్ణయించాం’’ అని కేంద్రమంత్రి వివరించారు.

టీకాలూ కావాలి
టీకాలను పెద్దఎత్తున సరఫరాచేయాలని సీఎం.. కేంద్ర మంత్రిని అభ్యర్థించారు. పీయూష్‌ సానుకూలంగా స్పందించారు. వ్యాక్సిన్‌ కోటాను పెంచుతామని, మొదటి డోస్‌కు గాకుండా రెండో డోస్‌కు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. తాము రెండో డోస్‌పైనే దృష్టి కేంద్రీకరిస్తున్నామని తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని