Black Fungusపై సర్కారు అప్రమత్తం
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Black Fungusపై సర్కారు అప్రమత్తం

చికిత్సకు కోఠి ఈఎన్‌టీలో నోడల్‌ కేంద్రం
కొవిడ్‌ సమయంలో వ్యాధి సోకితే గాంధీలో చికిత్స
ప్రైవేటు ఆసుపత్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌ : రాష్ట్రంలో బ్లాక్‌ఫంగస్‌ తీవ్రత పెరగడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు దీనిని నియంత్రించేందుకు అత్యవసర చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో వ్యాధి బారిన పడిన వారికి చికిత్స కోసం హైదరాబాద్‌ కోఠిలోని ఈఎన్‌టీ ఆసుపత్రిలో నోడల్‌ కేంద్రం ఏర్పాటు చేసింది. కరోనా నుంచి కోలుకున్న వారిలో కొందరు ఈ ఫంగస్‌ బారిన పడుతున్నారని, ఎక్కువ మందిలో ఈఎన్‌టీ సమస్యలు తలెత్తుతున్నాయని, దీని గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. బాధితులకు ఈఎన్‌టీ ఆసుపత్రిలో పూర్తిగా చికిత్స అందించాలని వైద్యఆరోగ్యశాఖను ఆదేశించింది. మరోవైపు కరోనా రోగులకు బ్లాక్‌ఫంగస్‌ నిర్ధారణ అయితే గాంధీలో చికిత్స అందించాలని సూచించింది. ఈ వ్యాధికి వాడే అన్ని ఔషధాలను ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమకూర్చాలని రాష్ట్ర వైద్యమౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎన్‌ఎంఐడీసీ)ను ఆదేశించింది.

నివారణకు చర్యలు తీసుకోవాలి
కరోనాతో చికిత్స పొందుతున్న సమయంలో బ్లాక్‌ఫంగస్‌ రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రైవేటు ఆసుపత్రులను సర్కారు ఆదేశించింది. కొవిడ్‌ రోగులకు చికిత్సనందించే సమయంలో షుగర్‌ స్థాయిని సరిగా అదుపు చేయాలని సూచించింది. బ్లాక్‌ఫంగస్‌తో బాధపడుతున్న వారికి ఎక్కువగా ఈఎన్‌టీ సమస్యలు వస్తున్నాయని, రోగులకు కంటి వైద్యుడి అవసరం ఉంటే సరోజినిదేవి ఆసుపత్రి సేవలు వినియోగించుకోవాలంది. గాంధీ ఆసుపత్రి, సరోజినిదేవి, ఈఎన్‌టీ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు పరస్పరం సమన్వయంతో తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది.

ఏమిటీ వ్యాధి.. ఎలా వస్తోంది?

మ్యుకర్‌మైసోసిన్‌నే సాధారణ పరిభాషలో బ్లాక్‌ఫంగస్‌ అంటారు. ఇదొక ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌. కరోనా కారణంగా ఈ ఫంగస్‌ బారిన పడుతున్న వాళ్ల సంఖ్య ఎక్కువవుతోంది. కొవిడ్‌ చికిత్సలో భాగంగా స్టెరాయిడ్లను వాడటంతో పాటు డయాబెటిస్‌ (షుగర్‌) ఉన్న వారిలో ఇది ఎక్కువగా వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ ఇన్ఫెక్షన్‌ అంతకుముందే డయాబెటిస్‌, కిడ్నీ, గుండె వైఫల్యాలు, క్యాన్సర్‌తో బాధపడుతూ కొవిడ్‌ నుంచి కోలుకున్న వాళ్లలో ఎక్కువగా కనిపిస్తున్నట్లు చెప్పారు. దీనిని త్వరగా గుర్తించడం చాలా ముఖ్యమన్నారు. కళ్లు లేదా చెంపల్లో వాపు, ముక్కులో అడ్డంకి, నల్లటి పొక్కుల్లాంటివి కనిపిస్తే వెంటనే బయాప్సీకి పంపించి యాంటీఫంగల్‌ థెరపీ చేయాలని సూచిస్తున్నారు.

ఈ వ్యాధి కొత్తదేమీ కాదు
-  ప్రజారోగ్య సంచాలకుడు

బ్లాక్‌ఫంగస్‌ కొత్తదేమీ కాదని, ఇప్పటికే ఉన్న వ్యాధి అని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు, అవయవ మార్పిడి చేయించుకున్న వారికి ఎక్కువగా వస్తోందన్నారు. దీనికి సర్జికల్‌ డెబ్రీడ్మెంట్‌తో పాటుగా యాంటీఫంగల్‌ మందులతో చికిత్స చేస్తారని తెలిపారు. కరోనా సమయంలో రోగులకు స్టెరాయిడ్‌ మందు అధిక మోతాదులో వాడటం, ఆక్సిజన్‌ అందించే పరికరాలు సరిగా శుభ్రపర్చకపోవడం వల్ల వ్యాధి వ్యాపిస్తోందన్నారు. వ్యాధిరాకుండా జాగ్రత్తలు, చర్యలపై అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులకు సూచనలిచ్చామని, వ్యాధిగ్రస్తులకు ఉచిత చికిత్స కోసం కోఠి ఈఎన్‌టీ, గాంధీ ఆసుపత్రులను సంసిద్ధం చేశామన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని