Tauktae: కేరళ కకావికలం
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tauktae: కేరళ కకావికలం

భారీ వర్షాలతో తీవ్ర నష్టం
ఉప్పొంగుతున్న సముద్రం
ఆనకట్టల గేట్ల ఎత్తివేత
ఎల్లుండి పోర్‌బందర్‌ సమీపంలో తీరాన్ని దాటనున్న ‘తౌక్టే’
యంత్రాంగం అప్రమత్తం

తిరువనంతపురం, దిల్లీ: అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారడంతో శనివారం కేరళ కకావికలమయింది. ‘తౌక్టే’ తుపాను ప్రభావంగా ఈదురుగాలులు వీచి, అతి భారీ వర్షాలు కురుస్తుండడంతో వాతావరణ విభాగం ‘రెడ్‌ అలర్ట్‌’ ప్రకటించింది. ఉత్తర జిల్లాలైన మల్లాపురం, కొళికోడ్‌, వయనాడ్‌, కన్నూర్‌, కాసర్‌గోడ్‌ల్లో తీవ్రత అధికంగా ఉంది. అళప్పుళ, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకుళం, త్రిస్సూర్‌, పాలక్కాడ్‌ జిల్లాల్లోనూ ప్రభావం కనిపించింది. తీర ప్రాంతాల్లో సముద్రం ఆకస్మికంగా ముందుకురావడంతో జనజీవనం స్తంభించింది. వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. చెట్లు విరిగిపోవడంతో చాలా ప్రాంతాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ప్రధాన నదులైన మీనాచిల్‌, అచన్‌కోవిల్‌, మణిమాలల్లో  నీటి ప్రవాహం పెరుగుతోంది. ఇడుక్కి జిల్లాలోని కల్లార్‌కుట్టి, మాలాంకర, భూతథంకెట్టు ఆనకట్టలు, పధనంథిట్ట జిల్లాలోని మణియార్‌ ఆనకట్టల గేట్లను ఎత్తివేశారు. చెట్లు విరిగి ఇళ్లు, వాహనాలపై పడడంతో ఇడుక్కి జిల్లాలోని మున్నార్‌-వత్తవాడ మార్గంలో చాలాసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
కాసర్‌గోడ్‌ జిల్లా చేరంగాయ్‌లో ఓ రెండతస్తుల భవనం కుప్పకూలింది. అందులో నివసించే కుటుంబాలు ముందుజాగ్రత్తగా సురక్షిత ప్రాంతానికి వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ప్రాంతంలోని చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి. దాంతో సహాయ చర్యల నిమిత్తం 35 మంది సైనికులు వచ్చారు.

కరోనా జాగ్రత్తలతో సహాయ కేంద్రాలకు..
తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు సహాయ శిబిరాలకు తరలించారు. అయితే కరోనాను దృష్టిలో పెట్టుకొని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

తీవ్రరూపం దాల్చిన తుపాను
తౌక్టే తుపాను తీవ్రరూపంగా దాల్చి గుజరాత్‌ వైపు పయనిస్తోందని వాతావరణ శాఖ వర్గాలు తెలిపాయి. ఇది ‘అత్యంత తీవ్రమైన’ తుపానుగా మారుతుందని పేర్కొన్నాయి. సుమారుగా ఈ నెల 18 (మంగళవారం)న మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 8.30 గంటల సమయంలో గుజరాత్‌లోని పోర్‌బందర్‌-నలియాల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వెల్లడించాయి. తీరం దాటేప్పుడు 150-175 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. తుపాను కారణంగా ఆదివారం నుంచి మంగళవారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గోవా, కొంకణ్‌, మహారాష్ట్రలోనూ దీని ప్రభావం కనిపించనుంది.
గుజరాత్‌లోని సౌరాష్ట్రలో తుపాను తీవ్రత అధికంగా ఉండనుందని కేంద్ర హోం శాఖ సమాచారం పంపించింది. మట్టి ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దేవభూమి ద్వారక, జునాగడ్‌ ప్రాంతాల్లో సముద్ర అలలు 1-2 మీటర్ల ఎత్తులో ఎగసిపడే అవకాశం ఉందని తెలిపింది. మహారాష్ట్రలోని పాల్ఘఢ్‌, రాయ్‌గఢ్‌, రత్నగిరి, సింధుదుర్గ్‌ జిల్లాలకు తుపాను ముప్పు ఎక్కువగా ఉండనుంది. తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే అధికారులను ఆదేశించారు. ముంబయి నగరంపై మాత్రం పరిమితంగానే ప్రభావం చూపనుంది.

రంగంలో 4,700 మంది ఎన్‌డీఆర్‌ఎఫ్‌ జవాన్లు
సహాయ చర్యలు అందించేందుకు జాతీయ విపత్తు స్పందన బృందం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) దళాలు రంగంలోకి దిగాయి. ముందుగా 53 దళాలను పంపించాలని భావించగా, ఆ సంఖ్యను 100కు పెంచినట్టు డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌.ఎన్‌.ప్రధాన్‌ తెలిపారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్‌, గోవా, మహారాష్ట్రల్లో మోహరించినట్టు చెప్పారు. ఇప్పటికే 42 బృందాలు క్షేత్రస్థాయిలో ఉన్నాయని తెలిపారు. ఒక్కో బృందంలో 47 మంది జవాన్లు ఉంటారు. అంటే మొత్తం 4,700 మంది జవాన్లు సేవలు అందించడానికి సంసిద్ధంగా ఉన్నారు. వారి వద్ద శాటిలైట్‌ ఫోన్లు, సహాయ బోట్లు, రంపాలు, మందులు, ఇతర అత్యవసర సామగ్రి ఉంటుంది. వీరందరికీ కరోనా టీకాలు ఇచ్చామని, ఇతర రక్షణ సామగ్రి అందజేశామని ప్రధాన్‌ వివరించారు. వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో భువనేశ్వర్‌ నుంచి ఐదు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చేరుకున్నాయి. ద్వారక, పోర్‌బందర్‌ వంటి తీర ప్రాంతాల్లో వీటిని మోహరించనున్నారు.

సంసిద్ధతపై ప్రధాని సమీక్ష
తుపాను నేపథ్యంలో అధికార యంత్రాంగం సంసిద్ధతపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష జరిపారు. అత్యవసర సేవలైన విద్యుత్తు, ఫోన్లు, ఆరోగ్యం, తాగునీటికి అవాంతరాలు లేకుండా చూడాలని ఆదేశించారు.

సముద్ర వంతెనకు పగుళ్లు

భారీ గాలుల కారణంగా తిరువనంతపురంలోని సముద్రతీరం వద్ద ఉన్న పాతకాలంనాటి వలియత్తుర వంతెనకు పగుళ్లు ఏర్పడ్డాయి. శుక్రవారం రాత్రి నుంచి ఒకటే గాలులు వీస్తుండడంతో తట్టుకోలేకపోయింది. సుమారు 200 మీటర్ల మేర ఒక పక్కకు ఒరిగింది. చాలా ప్రాంతాల్లో సముద్రం నీరు ఇళ్లల్లోకి ప్రవేశించింది. కొన్ని చోట్ల గుడిసెలు నేలమట్టమయ్యాయి. కన్నూరు జిల్లాలో చిన్నపడవలో సముద్రంలోకి వెళ్లిన ముగ్గురు మత్స్యకారులను శుక్రవారం రాత్రి కోస్టుగార్డు నౌక ‘విక్రం’ రక్షించింది.

రాష్ట్రంలో నేడూ, రేపూ వర్షాలు

ఈనాడు, హైదరాబాద్‌: అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుపాను ప్రభావంతో తెలంగాణలో ఆది, సోమవారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో ఒక మాదిరి వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. వర్షాలు పడే సమయంలో గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని అంచనా. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం ఉదయం 8 నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకూ 256 ప్రాంతాల్లో కురిశాయి. శనివారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ 60 ప్రాంతాల్లో పడ్డాయి. శనివారం పగలు అత్యధికంగా గద్వాలలో 3.1, చిన్న జత్వారం (నారాయణపేట జిల్లా)లో 3.1, ధరూర్‌ (జోగులాంబ జిల్లా)లో 2.9, అమరచింత (వనపర్తి)లో 1.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వర్షాలతో వరి ధాన్యం తడిసిపోయింది. కోతకు వచ్చిన మామిడికాయలు రాలిపోయాయి. వర్షాలు కొనసాగే అవకాశాలున్నందున రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మార్కెటింగ్‌ శాఖ సూచించింది. ధాన్యం ఆరుబయట ఆరబోయవద్దని, పరదాలు సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు