ప్రపంచంలో అత్యంత నాణ్యమైనది కొవాగ్జిన్‌
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రపంచంలో అత్యంత నాణ్యమైనది కొవాగ్జిన్‌

కేంద్ర సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి

ఈనాడు, దిల్లీ: హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌ ఉత్పత్తి చేస్తున్న కొవాగ్జిన్‌.. ప్రపంచంలోనే అత్యధిక నాణ్యత ఉన్న వ్యాక్సిన్‌గా గుర్తింపు పొందిందని, ఇది తెలుగు వాళ్లుగా మనం గర్వించే విషయమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన ఆన్‌లైన్‌ ద్వారా విలేకరులతో మాట్లాడారు. ‘కరోనా వ్యాక్సిన్లు కనుక్కొనే క్రమంలో మన శాస్త్రవేత్తలు, ఫార్మా కంపెనీల పనితీరు ప్రపంచం అబ్బురపడేలా ఉంది. భారత్‌ బయోటెక్‌, సీరం, జైడస్‌ కేడిలా సంస్థలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా సందర్శించారు. ప్రపంచంలో అత్యుత్తమ నాణ్యత కలిగిన అయిదారు వ్యాక్సిన్లలో మన దేశానికి చెందిన కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ ఉన్నాయి. భారత్‌ బయోటెక్‌ ఉత్పత్తి చేసిన టీకాల్లో అత్యధికం మన దేశంలోనే వినియోగిస్తున్నాం. అమెరికాకు చెందిన ఆస్ట్రాజెనికాతో కలిసి సీరం ఇనిస్టిట్యూట్‌ పరిశోధన చేసి ఉత్పత్తి చేస్తున్నందున పేటెంట్‌ హక్కుల దృష్ట్యా అమెరికాకు సరఫరా చేస్తున్నాం. ఫైజర్‌, మొడెర్నా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వ్యాక్సిన్లు మన దేశంలోని కరోనా వేరియంట్లపై సమర్థంగా పని చేస్తాయని నిరూపణ అయినందున వాటి దిగుమతికి సంప్రదింపులు వేగవంతం చేశాం’ అని వివరించారు.

ఆక్సిజన్‌ సరఫరా బాధ్యత రాష్ట్రాలదే
‘దేశంలో 5,700 మెట్రిక్‌ టన్నుల మెడికల్‌ ఆక్సిజన్‌ ఉత్పత్తి అయ్యేది. ఇప్పుడు 9,446 మెట్రిక్‌ టన్నులు ఉత్పత్తి చేస్తున్నాం. కరోనా ముందు వరకు దేశంలో 2 వేల వెంటిలేటర్లు ఉంటే వాటిని 51 వేలకు పెంచి రాష్ట్రాలకు పంపాం. ఆయా రాష్ట్రాల అవసరాలకు తగినట్లు ఆక్సిజన్‌, వెంటిలేటర్లు, రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు, ఎన్‌-95 మాస్క్‌లు పంపుతున్నాం. రాష్ట్రాలకు ఇచ్చిన వెంటిలేటర్లలో కొన్నింటిని తెరవడం లేదు. తెలంగాణకు 1400 వెంటిలేటర్లు పంపితే ఓపెన్‌ చేయని వంద వెంటిలేటర్లను నేను ప్రత్యక్షంగా చూశా. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి, మరణాలు ఎక్కువగా ఉండడం, సరైన వసతులు లేకపోవడంతో 4,960 వెంటిలేటర్లు అందజేశాం. రాష్ట్రాలకు ఆక్సిజన్‌, వెంటిలేటర్లు పంపడమే కేంద్రాల బాధ్యత. ఏ ఆసుపత్రికి ఎంత అవసరం, ఎవరికి ఎంత పంపాలనేది రాష్ట్రాల పని’ అని కిషన్‌రెడ్డి చెప్పారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని