రెండోరోజూ స్వల్ప తగ్గుదల
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రెండోరోజూ స్వల్ప తగ్గుదల

దేశంలో 3,26,098 కరోనా కొత్త కేసులు

ఈనాడు, దిల్లీ: దేశంలో రోజువారీ కరోనా కేసులు వరుసగా రెండోరోజు తగ్గాయి. గత 24 గంటల్లో 3,26,098 కేసులు నమోదయ్యాయి. ముందురోజు కంటే 4.96% మేర తగ్గుముఖం పట్టాయి. మరణాలు కూడా మూడు రోజుల అనంతరం నాలుగువేల దిగువకు (3890) చేరాయి. పరీక్షలు 1,82,422 మేర తగ్గాయి. దానివల్లే కేసుల్లో తగ్గుదల నమోదైనట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం క్రియాశీలక కేసుల పరంగా మహారాష్ట్రను కర్ణాటక దాటిపోయింది. అక్కడ క్రియాశీలక కేసులు 5,98,625కి చేరాయి. ఇవి మహారాష్ట్ర కంటే 15% అధికం. గత 24 గంటల్లో క్రియాశీలక కేసులు తగ్గిన తొలి 10 రాష్ట్రాల్లో మహారాష్ట్ర (14,021) మొదటి స్థానంలో నిలవగా, ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, దిల్లీ, గుజరాత్‌, హరియాణా, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌, తెలంగాణలు ఆ తర్వాతి స్థానాలను ఆక్రమించాయి. 10 రాష్ట్రాల్లోనే 85 శాతం కరోనా కేసులు ఉన్నాయని, 11 రాష్ట్రాల్లో లక్షకుపైగా క్రియాశీలక కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత ఐదు రోజుల్లో నాలుగోసారి.. కొత్తగా నమోదైన కేసుల కన్నా రికవరీలే ఎక్కువగా ఉన్నాయని తెలిపింది.

రెండో ఉద్ధృతి తగ్గుముఖం
దేశంలో కరోనా కేసుల్లో స్థిరీకరణ కనిపిస్తోందని ప్రభుత్వం ప్రకటించింది. పరిస్థితి మరింతగా నియంత్రణలోకి వచ్చేలా ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. అత్యధిక క్రియాశీలక కేసులు పెరిగిన తొలి 7 రాష్ట్రాల్లో తమిళనాడు మొదటి స్థానం ఆక్రమించగా, కర్ణాటక, కేరళ, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, ఉత్తరాఖండ్‌లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొత్త కేసుల కంటే అధికంగా 31,091 మంది కోలుకొని ఇంటికెళ్లారు. ఇలా జరగడం గత అయిదు రోజుల్లో ఇది నాలుగోసారి. ప్రస్తుత పరిస్థితులను బట్టిచూస్తే రెండో ఉద్ధృతి తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. గత వారం రోజుల్లో అంతకుముందు కంటే 9% కేసులు తగ్గడమే ఇందుకు నిదర్శనం. దక్షిణాదిలో నాలుగు రాష్ట్రాలు మాత్రం కరోనా గుప్పిట్లో చిక్కుకున్నాయి. ప్రస్తుతం దేశంలో అత్యధిక కేసులు పెరుగుతున్న రాష్ట్రాల జాబితాలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, కేరళలు తొలి నాలుగు స్థానాల్లో నిలిచాయి. మే 1 నుంచి 15 మధ్య ఈ రాష్ట్రాల్లో వరుసగా 69.71%, 65.70%, 56.41%, 45.54% మేర కేసులు పెరిగాయి.

కేసులు తగ్గిన తొలి 5 రాష్ట్రాల్లో తెలంగాణ
కేసుల పాజిటివిటీ రేటు 22.59% నుంచి 19.67%కి చేరింది. మరణాలు మాత్రం 5.75% మేర పెరిగాయి. గత రెండు వారాల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లో 62.36%, తెలంగాణలో 30.49%, దిల్లీలో 27.74%, మహారాష్ట్రలో 21.51%, గుజరాత్‌లో 17.36%, కేసులు తగ్గినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కేసుల తగ్గుదలలో ఈ అయిదు రాష్ట్రాలు మొదటి ఐదు స్థానాల్లో నిలిచినట్లు పేర్కొంది. గత 24 గంటల్లో మహారాష్ట్ర (39,923)ని మించి కర్ణాటకలో (41,779) అత్యధిక రోజువారీ కేసులు నమోదయ్యాయి. ఇలా జరగడం ఈ వారంలో ఇది రెండోసారి. మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్‌లలో మరణాల ఉద్ధృతి తగ్గడం లేదు. దిల్లీలో మాత్రం ఏప్రిల్‌ 21వ తేదీ తర్వాత తొలిసారి మూడువందల లోపు నమోదయ్యాయి. తమిళనాడులో గత నాలుగు రోజులుగా దాదాపు 300కి దగ్గరగా మరణాలు సంభవిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా బారిన పడినవారిలో 83.83% మంది కోలుకున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని