కస్టడీలో ఉన్న ఎంపీని కొట్టడమేంటి?
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కస్టడీలో ఉన్న ఎంపీని కొట్టడమేంటి?

ఏపీ ప్రభుత్వాన్ని, పోలీసులను ప్రశ్నించిన హైకోర్టు

ఈనాడు, అమరావతి: సీఐడీ పోలీసు కస్టడీలో ఉన్న నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుకు గాయాలవడంపై ఏపీ హైకోర్టు మండిపడింది. పోలీసు కస్టడీలో ఉన్నవారిని ఎలా కొడతారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంపీ శరీరంపై ఉన్నవి పోలీసు దెబ్బల వల్ల అయిన గాయాలని తేలితే తీవ్ర పరిణామాలు తప్పవని ప్రభుత్వాన్ని, పోలీసులను హెచ్చరించింది. రాష్ట్రంలో అసలేం జరుగుతోందని ప్రభుత్వాన్ని నిలదీసింది. రఘురామ కృష్ణరాజు శరీరం, కాళ్లపై ఉన్న గాయాల్ని పరిశీలించి నివేదిక ఇచ్చేందుకు ముగ్గురు వైద్యులతో మెడికల్‌ బోర్డును ఏర్పాటు చేసింది. గుంటూరు ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌, జనరల్‌ మెడిసిన్‌ విభాగాధిపతి, సూపరింటెండెంట్‌ నామినేట్‌ చేసిన మరొక వైద్యుడు బోర్డులో ఉండాలని సూచించింది. ఎంపీని మెడికల్‌ బోర్డు వద్ద ఉంచాలని సీఐడీని ఆదేశించింది. తక్షణం పరీక్ష నిర్వహించి నివేదిక సమర్పించాలని బోర్డుకు స్పష్టం చేసింది. ఎంపీని పరీక్షించే సమయంలో వీడియో చిత్రీకరణ చేయాలని ఆదేశించింది. చిత్రీకరణ వీడియోను, వివరాల్ని సీల్డ్‌ కవర్లో గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి (పీడీజే)కి అప్పగించాలంది. గుంటూరు మెజిస్ట్రేట్‌ ఎంపీ వాంగ్మూలాన్ని రికార్డు చేసి ఉంటే దాన్ని కూడా సీల్డ్‌ కవర్లో పీడీజేకు అందజేయాలని ఆదేశించింది. వాటిని హైకోర్టు వెకేషన్‌ అధికారి ఎం.నాగేశ్వరరావుకు పంపాలని పీడీజేకు స్పష్టం చేసింది. అవసరమైతే ఆసుపత్రిలో ఎంపీకి చికిత్స అందించాలన్న న్యాయవాది అభ్యర్థనపై ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడం లేదని, దీనిపై నిర్ణయాన్ని మెడికల్‌ బోర్డుకు వదిలేస్తున్నట్లు పేర్కొంది. ఎంపీని పరీక్షించే సమయంలో కుటుంబసభ్యులు, కుటుంబ వైద్యుడ్ని అనుమతించాలన్న అభ్యర్థనను తోసిపుచ్చింది. వ్యక్తిగత భద్రతా సిబ్బందిని ఎంపీతో అనుమతించాలన్న విజ్ఞప్తినీ తిరస్కరించింది. ఒకవేళ ఎంపీ ఆసుపత్రిలో చేరితే రాష్ట్ర పోలీసులే భద్రత కల్పించాలని తేల్చిచెప్పింది. విచారణను ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ కె.లలితతో కూడిన ధర్మాసనం శనివారం ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది.
సీఐడీ పోలీసు కస్టడీలో ఉన్న ఎంపీ రఘురామ కృష్ణరాజును గుంటూరులోని మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచడానికి తీసుకెళ్లగా ఆయన శరీరంపై గాయాలున్న సంగతి వెలుగు చూసింది. పోలీసులు తనను కొట్టారని ఎంపీ మెజిస్ట్రేట్‌కు చెప్పారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఎంపీని కొట్టిన సంగతి, కమిలిపోయిన గాయాలకు సంబంధించిన ఫొటోలను న్యాయమూర్తుల దృష్టికి తీసుకెళుతూ ఆయన తరఫు సీనియర్‌ న్యాయవాది ఆదినారాయణరావు హైకోర్టుకు లేఖ రాశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని