TS Lockdown: మరికొన్ని సడలింపులతో లాక్‌డౌన్‌ కొనసాగింపు!

ప్రధానాంశాలు

TS Lockdown: మరికొన్ని సడలింపులతో లాక్‌డౌన్‌ కొనసాగింపు!

కరోనా నియంత్రణకు పకడ్బందీ చర్యలు
వానాకాలం పంటల ప్రణాళిక ఖరారు  
30న మంత్రిమండలిలో చర్చ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆంక్షల సడలింపు సమయం పెంచి లాక్‌డౌన్‌ను మరికొంత కాలం పొడిగించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ఈనెల 30న జరిగే రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. లాక్‌డౌన్‌, వానాకాలం పంటల ప్రణాళిక సహా పలు కీలక అంశాలపై ఇందులో చర్చించనున్నారు. కరోనా కేసులు, బ్లాక్‌ఫంగస్‌ పరిణామాలతో పాటు వాటికి చికిత్స, ఔషధాలు, రెండోదశ టీకాలు, కొవిడ్‌ పరీక్షల పెంపు, ఆక్సిజన్‌ ఉత్పత్తి, సేకరణ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పన, వ్యవసాయ రంగానికి సంబంధించి ధాన్యం సేకరణ, విత్తనాలు, ఎరువుల లభ్యత అంశాలపై మంత్రిమండలి చర్చిస్తుంది. ఇంటింటి జ్వర సర్వే, లక్షణాలున్న వారికి కిట్ల పంపిణీని సమీక్షిస్తారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వైద్య-ఆరోగ్య, హోంశాఖలకు బడ్జెట్‌ పెంచుతామని, కొన్ని శాఖలకు తగ్గిస్తామని సీఎం ఇప్పటికే స్పష్టం చేశారు. దీనికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసే అవకాశముంది. జూనియర్‌ వైద్యులు ఏటా సమ్మె చేస్తున్నందున వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. డిమాండ్ల పరిష్కారంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజారోగ్య పరిరక్షణకు జూడాలు తప్పనిసరిగా అక్కడ పనిచేయాలనే కేంద్ర నిబంధనల అమలు గురించి కూడా కేబినెట్‌ చర్చించనున్నట్లు సమాచారం.

వానాకాలం పంటలపై దృష్టి
నీటి లభ్యత కారణంగా ఈ సీజన్‌లో సాగు విస్తీర్ణం మరింత పెరుగుతుందని, కోటీ 40 లక్షల ఎకరాలకు పైగా ఉండవచ్చని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. వానాకాలం పంటల ప్రణాళికను మంత్రిమండలి ఖరారు చేయనుంది. నీటి వినియోగం, వరితో పాటు ఇతర పంటలు ఎంత మేరకు సాగు చేయాలనేదానిపై నిర్ణయం తీసుకుంటారు.  కల్తీ విత్తనాలకు అడ్డుకట్ట వేసేందుకు మరింత కఠిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.  గోదాముల్లో ఖాళీ లేకపోవడంతో ధాన్యం కొనుగోళ్లకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చిస్తారు.

తగ్గనున్న ఆంక్షలు

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా రాష్ట్రంలో ఈనెల 30 వరకు లాక్‌డౌన్‌ కొనసాగనుంది. ఇది కొంతమేరకు సత్ఫలితాలు ఇచ్చిందని ప్రభుత్వవర్గాలు భావిస్తున్నాయి. మరికొన్ని రోజులు పొడిగిస్తే మరింత ఫలితం ఉంటుందని అంచనా వేస్తున్నాయి. రెండోదశ టీకాల కార్యక్రమం కొనసాగుతోంది. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మరో పదిరోజులు జరగనుంది. జూన్‌ నుంచి వానాకాలం పంటల సీజన్‌ ప్రారంభం కానుంది. పంటల సాగు, విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లు పెద్దఎత్తున జరుగుతాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని లాక్‌డౌన్‌లో సడలింపు సమయాన్ని మరికొన్ని గంటలు పెంచే అవకాశముంది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని