Twitter: మరో వివాదంలో ట్విటర్‌

ప్రధానాంశాలు

Twitter: మరో వివాదంలో ట్విటర్‌

ప్రముఖుల ఖాతాలపై ‘బ్లూ టిక్‌’ రద్దు
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మోహన్‌ భాగవత్‌లకూ వర్తింపు
విమర్శల అనంతరం పునరుద్ధరణ
నిబంధనలు పాటించాలని సామాజిక మాధ్యమానికి కేంద్రం తుది గడువు

ఈనాడు, దిల్లీ: సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విటర్‌ మరో వివాదంలో చిక్కుకొంది. కేంద్ర ప్రభుత్వ ఆగ్రహానికి గురయింది. నూతన ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐ.టి.) నిబంధనలు పాటించడం లేదంటూ ఇప్పటికే ఆ సంస్థపై కేంద్రం అసంతృప్తి వ్యక్తంచేస్తోంది. కొంతమంది భాజపా నాయకుల ఖాతాలపై ‘‘తప్పుడు సమాచారం’’ అన్న ముద్ర వేయడంపైనా గుర్రుగా ఉంది. తాజాగా.. ట్విటర్‌లో ప్రముఖులకు ఉండే వాస్తవ ఖాతాలను అధికారికంగా ధ్రువీకరించే ‘బ్లూ టిక్‌’ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులకు తొలగించడం మరింత వివాదాస్పదమయింది. పరిస్థితి తీవ్రతను గమనించిన ట్విటర్‌ కొన్ని గంటల్లోనే నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఆ గుర్తింపును పునరుద్ధరించింది. ఇదిలాఉండగా.. దేశ చట్టాలను అమలు చేయాల్సిందేనంటూ ట్విటర్‌కు ఇదివరకే స్పష్టీకరించిన కేంద్రప్రభుత్వం శనివారం ‘తుది హెచ్చరిక’ను జారీ చేసింది. తమ సహనాన్ని పరీక్షించవద్దని కూడా వ్యాఖ్యానించింది.
‘కాషాయం’పై ‘నీలి’ మాయం
ట్విటర్‌ ఖాతాపై ‘నీలి చిహ్నం’ (బ్లూ టిక్‌/బ్యాడ్జ్‌) ఉందంటే సంబంధిత వ్యక్తులు ‘ప్రజలకు అత్యంత ప్రాధాన్యం ఉన్నవారు’ అని అర్థం. ఇది ‘ప్రముఖం, అధీకృతం, సచేతనం’ అన్న ప్రత్యేకమైన గుర్తింపును పొందుతుంది. ఎవరితో సంభాషణలు జరుపుతున్నామో అన్న విషయమై ఖాతాదార్లకు స్పష్టమైన అవగాహన ఉంటుంది. ట్విటర్‌ ఇచ్చే ధ్రువీకరణకు ఇది నిదర్శనంలాంటిది. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు, అయిదుగురు ప్రముఖ ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుల వ్యక్తిగత ఖాతాలపై ఈ నీలి చిహ్నం మాయమవడం కలకలం సృష్టించింది. ఆర్‌.ఎస్‌.ఎస్‌. అధిపతి మోహన్‌ భాగవత్‌తో పాటు, ఇతర ప్రముఖ నాయకులు సురేష్‌ జోషి, సురేష్‌ సోని, అరుణ్‌ కుమార్‌, కృష్ణకుమార్‌ల ఖాతాలపై ఉన్న ఈ నీలి గుర్తులను ట్విటర్‌ తొలగించింది. దీనిపై ఆర్‌ఎస్‌ఎస్‌ వర్గాలు తీవ్రంగా విమర్శించాయి. ఇది ‘‘పక్షపాతం, సాంకేతిక ఫ్యూడలిజం’’ అని ఆ సంస్థ దిల్లీ శాఖ నాయకుడు రాజీవ్‌ తులి ఆరోపించారు. ఈస్ట్‌ ఇండియా కంపెనీ మాదిరిగా ట్విటర్‌ వ్యవహరిస్తోందని విశ్వహిందూ పరిషత్‌ నాయకుడు వినోద్‌ బన్సల్‌ విమర్శించారు. దేశంలో సొమ్ము చేసుకుంటూ దేశవాసులనే దూషిస్తోందని అన్నారు. ఉపరాష్ట్రపతి ఖాతాకు బ్లూ టిక్‌ను తొలగించడం ‘‘రాజ్యాంగ పదవిని ధిక్కరించడమే’’ అని కేంద్ర ఐ.టి.శాఖ విమర్శించింది. దేశ సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించింది.
ఆటోమేటిక్‌గా జరుగుతుంది...
విమర్శలు హోరెత్తడంతో అనంతరం ట్విటర్‌ వివరణ ఇచ్చింది. ఇది కావాలని చేసింది కాదని, ‘ఆటోమేటిక్‌’గా జరుగుతుందని తెలిపింది. ఆరు నెలలపాటు ఖాతాను ఉపయోగించకపోతే నిబంధనల ప్రకారం ఆ గుర్తింపు దానంతట అదే రద్దవుతుందని స్పష్టం చేసింది. ‘‘ఖాతాల్లో స్తబ్ధత రావడం అనేది లాగిన్‌ కావడంపై ఆధారపడి ఉంటుంది. ఖాతాదారు కనీసం ఆరు నెలల్లో ఒకసారయినా లాగిన్‌ కావాల్సి ఉంటుంది. అప్పుడే ఖాతా సచేతనంగా ఉంటుంది’’ అని పేర్కొంది. అంతేకాకుండా తమ వ్యక్తిగత వివరాలు సంపూర్ణంగా ఉన్నట్టు ఖాతాదారు చూసుకోవాలి. సరయిన ఈ-మెయిల్‌ చిరునామాగానీ ఫోన్‌ నెంబరుగానీ, ఫొటో, పేరు ఉండేటట్టు చూసుకోవాలి. అయితే ఈ వివరాలను ఎట్టిపరిస్థితుల్లోనూ బహిర్గతం చేయబోమని, విక్రయించబోమని కూడా తెలిపింది. ఆర్‌ఎస్‌ఎస్‌ వర్గాలు మాత్రం ఈ వివరణపై తృప్తి చెందలేదు. ఎంతోమంది చాలా కాలంపాటు ఖాతాలను ఉపయోగించకపోయినా, ఇలాంటి చర్య తీసుకోలేదని తెలిపింది.
వెంటనే సవరణ
అనంతరం ఈ ఖాతాలపై ఉన్న ‘బ్లూ టిక్‌’ను ట్విటర్‌ పునరుద్ధరించింది. దీనిపై ఉపరాష్ట్రపతి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఉపరాష్ట్రపతి వ్యక్తిగత ఖాతా Naidu @MVenkaiahNaidu ను చాలా కాలంగా ఉపయోగించడం లేదని తెలిపింది. చివరగా గత ఏడాది జులై 23న ట్వీట్‌ చేశారని పేర్కొంది. ఈ చిహ్నం లేని విషయాన్ని ట్విటర్‌ను సంప్రదించామని, ఉదయం 10.30 గంటల ప్రాంతంలో దాన్ని పునరుద్ధరించారని తెలిపింది. ప్రస్తుతం వెంకయ్య నాయుడు అధికారిక ఖాతా అయిన @VPSecretariat ను ఉపయోగిస్తున్నారు. మిగిలిన నాయకుల ఖాతాలనూ కూడా ట్విటర్‌ పునరుద్ధరించింది. ఎన్నో ఒత్తిళ్లు వచ్చిన తరువాతనే ఈ నిర్ణయం తీసుకొందని ఆర్‌ఎస్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి.

ఇదే చివరి నోటీసు: కేంద్రం

నూతన ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐ.టి.) నిబంధనలు తక్షణమే పాటించాలంటూ కేంద్ర ప్రభుత్వం ట్విటర్‌కు ‘మరో చివరి నోటీసు’ ఇచ్చింది. వీటిని అమలు చేయకపోతే ఐ.టి. చట్టం కింద లభించే మినహాయింపులను కోల్పోవలసి ఉంటుందని హెచ్చరించింది. ట్విటర్‌ వ్యవహారం చూస్తుంటే దేశ ప్రజలకు సురక్షితమైన అనుభవాలు కలిగేలా చూడడంపై శ్రద్ధ పెడుతున్నట్టు కనిపించడం లేదని ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ వ్యాఖ్యానించింది. దశాబ్దానికిపైగా భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ, సకాలంలో పారదర్శకంగా సమస్యలు పరిష్కరించుకోవడానికి ట్విటర్‌ ఏర్పాట్లు చేయకపోవడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించింది. ఇప్పటికైనా నిబంధనలు పాటించకపోతే ఐటీ చట్టంతో పాటు ఇతర చట్టాల కింద పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించింది. అయితే ఏ తేదీలోగా వీటిని అమలు చేయాలన్న విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు. ఆ సామాజిక మాధ్యమం ద్వారా వేధింపులకు గురయ్యేవారి సమస్యల పరిష్కారానికి చట్టప్రకారం ఓ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. దీనిని స్వయంగా ట్విట్టరే ఏర్పాటు చేయాల్సి ఉందంది. అలా చేయకపోగా, చట్టం ప్రకారం చేయాల్సిన దాన్ని కూడా ఆచరణలోకి తేవడం లేదని తెలిపింది. నిబంధనల మేరకు ప్రధాన సమస్యల పరిష్కార అధికారిని నియమించాల్సి ఉండగా దానికి సంబంధించి ఇంతవరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని పేర్కొంది. ప్రత్యేకంగా అధికారిని నియమించడానికి బదులు ఓ లా ఫర్మ్‌ చిరునామా ఇచ్చిందని తెలిపింది. అందువల్ల చట్టాన్ని అమలు చేయకపోతే పర్యవసానాలు తప్పవని హెచ్చరించింది.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని