నిర్మాణాలపై ధరల పిడుగు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిర్మాణాలపై ధరల పిడుగు

భారీగా పెరిగిన సిమెంటు, స్టీలు...
ఏడాదిలో 60-80 శాతం భారం
ఈనాడు - హైదరాబాద్‌

లాక్‌డౌన్‌తో సిమెంటు, స్టీలు ఉత్పత్తి తగ్గి, కొరత నెలకొందన్న సాకుతో ఉత్పత్తిదారులు ధరలను అమాంతంగా పెంచడంతో నిర్మాణరంగం కుదేలవుతోంది. ఇతర సామగ్రి ధరలు చుక్కలనంటుతుండటం, సిమెంటు, స్టీలు ధరలు ఏడాదిలో 60 నుంచి 80 శాతం పెరగటం ఈ రంగంపై తీవ్ర ప్రభావమే చూపుతోంది. కొత్త నిర్మాణాల మాట అటుంచితే, నిలిచిపోయిన నిర్మాణాలను కూడా పూర్తిచేయలేని దుస్థితి. గత నాలుగైదేళ్లలో ఇంత పెద్ద మొత్తంలో ధరల పెరుగుదల ఎప్పుడూ లేదని వ్యాపారులు చెబుతున్నారు. ఈ స్థితిలో రోజువారీ విక్రయాలు నాలుగోవంతుకు పడిపోయాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.  ప్రయివేటు నిర్మాణాలు 15నుంచి 25 శాతమే  జరుగుతున్నట్లు క్రెడాయ్‌ ప్రతినిధులు చెబుతున్నారు.

30 శాతం పెరిగిన వ్యయం
కరోనా రెండోదశ ఉద్ధృతంగా ఉండటంతో సిమెంటు, స్టీలు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడిందని కంపెనీలు చెబుతున్నాయి. కూలీలు లేకపోవటంతో సుమారు నెల రోజులుగా ఉత్పత్తి నిలిచిపోయిందని, నామమాత్రంగా ఉన్న సిబ్బందితో యంత్రాల నిర్వహణ పనులు చేయిస్తున్నట్లు ప్రముఖ సిమెంటు కంపెనీ ప్రతినిధి ఒకరు ‘ఈనాడు’తో చెప్పారు. హమాలీలు, వాహన డ్రైవర్ల కొరతతో ఉన్న నిల్వలను తరలించడం కూడా ఇబ్బందికరంగానే మారిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో సిమెంటు బస్తా ధరను రూ.420 నుంచి రూ. 450 వరకు పెంచారు. స్టీలు ధర టన్ను రూ.60 వేలు దాటింది. ప్రముఖ బ్రాండ్ల స్టీలు ధర టన్నుకు రూ. 70 వేలకు పైనే ఉంది. కిటికీలు, తలుపులు, ఇంటీరియర్‌లో ఉపయోగించే చిన్నపాటి మేకుల ధరలు 75 శాతానికి పైగా పెరగటం గమనార్హం. ఇసుక, ఇటుకలు మినహా మిగిలిన అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగాయి. నిర్మాణ కార్మికుల కొరత వల్ల కూలి కూడా ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి వస్తోంది. ఫలితంగా నిర్మాణ వ్యయం 25 నుంచి 30 శాతం వరకు పెరిగినట్లు నిర్మాణదారులు చెబుతున్నారు.

ప్రభుత్వ నియంత్రణ లేమి
- జి.రాంరెడ్డి, జాతీయ ఉపాధ్యక్షులు, క్రెడాయ్‌

సిమెంటు, స్టీలు పరిశ్రమలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి నియంత్రణ లేకపోవటంతో ఇష్టం వచ్చినట్లుగా ధరలు పెరుగుతున్నాయి. సిమెంటు తయారీదారులు కొన్నేళ్లుగా ఏడాదిలో మూడు నాలుగు సార్లు ధరలు పెంచుతున్నారు. 30 శాతం వరకు పెరిగిన నిర్మాణ వ్యయం కొనుగోలుదారులపై గణనీయ ప్రభావం చూపుతుంది. మరోవైపు విక్రయాలూ లేవు. విక్రయించిన ఫ్లాట్లకు సంబంధించిన సొమ్ము కూడా వసూలు కాని పరిస్థితి. కరోనా మొదటి దశలో నిర్మాణాలు పూర్తిగా నిలిచిపోయాయి. రెండో దశలో నిర్మాణాలతోపాటు కొనుగోళ్లపై కూడా ప్రభావం పడింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని