నిర్మాణ రంగానికి ఊతమివ్వండి
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిర్మాణ రంగానికి ఊతమివ్వండి

కేంద్రాన్ని, రాష్ట్రాలను కోరిన క్రెడాయ్‌
మహారాష్ట్ర తరహాలో స్టాంపు డ్యూటీ తగ్గించాలని వినతి
తాజా పరిస్థితులపై బిల్డర్లతో సర్వే

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘నిర్మాణ రంగంపై కరోనా రెండో దశ తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. నిర్మాణానికి కావాల్సిన ఉత్పత్తులు సకాలంలో అందని పరిస్థితి. ధరలు అనూహ్యంగా పెరగటంతో వ్యయం గణనీయంగా పెరుగుతోంది. కొనుగోళ్లు మందగించాయి. నిర్మాణ రంగం కరోనా ప్రతిబంధకాలను అధిగమించేందుకు రాయితీలను, ప్రోత్సాహకాలను ప్రకటించాలి’’ అని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(క్రెడాయ్‌) కేంద్రాన్ని, రాష్ట్రాలను కోరింది. నిర్మాణ రంగంపై కరోనా రెండో దశ ఎలాంటి ప్రభావాన్ని చూపుతోందనే అంశంపై దేశవ్యాప్తంగా 4,813 మంది బిల్డర్లతో క్రెడాయ్‌ సర్వే నిర్వహించింది. తెలంగాణ నుంచి 410 మంది, ఆంధ్రప్రదేశ్‌ నుంచి 225 మంది బిల్డర్లు పాల్గొన్నట్లు క్రెడాయ్‌ జాతీయ ఉపాధ్యక్షుడు జి.రాంరెడ్డి గురువారం వెల్లడించారు.
అక్కడ స్టాంపు డ్యూటీ మూడు శాతమే
‘‘కరోనా సమయంలో నిర్మాణదారులను, కొనుగోలుదారులను ప్రోత్సహించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా స్టాంపు డ్యూటీని 3శాతమే వసూలు చేస్తోంది. ఇది చాలా ఉపయుక్తంగా ఉంది. కొనుగోలుదారులకు మరింత ఉత్సాహాన్ని ఇస్తోంది. స్టాంపు డ్యూటీ తగ్గించటం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలపై ఎలాంటి ప్రభావం ఉండదని మహారాష్ట్ర విధానం నిరూపిస్తోంది.
నిర్మాణాల్లో తొమ్మిది నెలల జాప్యం
కరోనా కారణంగా కార్మికులు అందుబాటులో లేకపోవడం, సామగ్రి లభ్యతలో జాప్యం కారణంగా నిర్మాణాలపై ఆ ప్రభావం కనిపిస్తోంది. కరోనా తొలిదశ తీవ్రతతో వలస కార్మికులు సొంత ప్రాంతాలకు వెళ్లగా కొంత మంది మాత్రమే తిరిగి వచ్చారు. ఈలోగా రెండోదశ రావటంతో మరికొంత మంది వెళ్లిపోవటంతో నిర్మాణాల్లో జాప్యం చోటు చేసుకుంటోంది. లాక్‌డౌన్లలో సరకు రవాణా వాహనాలకు వెసులుబాటు ఇచ్చినా ఉత్పత్తి కేంద్రాల్లో కార్మికుల కొరత కారణంగా సిమెంటు, స్టీలు ఇతర వస్తువులు రావటంలో ఆలస్యమవుతోంది. ఫలితంగా నిర్మాణాలు నిర్ధారిత వ్యవధి కన్నా సుమారు తొమ్మిది నెలల వరకు జాప్యం కావొచ్చు.
జీఎస్టీ 12 శాతమే వసూలు చేయాలి
జీఎస్టీ విషయంలో నిర్మాణదారులకు కొంత స్వేచ్ఛ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పనులు చేసే కాంట్రాక్టర్ల నుంచి జీఎస్టీ 12% వసూలు చేస్తున్నారు. అదే ప్రయివేటు పనులు చేసే వారి నుంచి 18% వసూలు చేస్తున్నారు. ఒకే తరహాలో 12% వసూలు చేయాలి. ఇన్‌పుట్‌ క్రెడిట్‌లో 12%, 5% అంటూ రెండు శ్లాబులు ఉన్నాయి. వాటిల్లో ఏది ఎంచుకోవాలన్న స్వేచ్ఛ నిర్మాణదారులకు ఇవ్వాలి. బిల్డర్లు తీసుకున్న రుణాలకు సంబంధించి బకాయిల చెల్లింపులను రీషెడ్యూల్‌ చేయాలి. గతంలో ఇచ్చినట్లుగానే అదనపు మూలధనాన్ని ఇవ్వాలి’’ అని క్రెడాయ్‌ ఆ నివేదికలో కోరింది. సర్వే నివేదికను కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలకు శుక్రవారం పంపనున్నట్లు క్రెడాయ్‌ జాతీయ ఉపాధ్యక్షుడు రాంరెడ్డి చెప్పారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు