మావోయిస్టులపై మహమ్మారి పంజా
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మావోయిస్టులపై మహమ్మారి పంజా

చికిత్సకు వచ్చే వారిపై పోలీసుల ఆరా
ఆసుపత్రులపైనా నిఘా

ఈనాడు, హైదరాబాద్‌: అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు కరోనా మహమ్మారి బారిన పడ్డారన్న వార్తల నేపథ్యంలో పోలీసుశాఖ నిఘా పెంచింది. దండకారణ్యం ప్రత్యేక డివిజినల్‌ కమిటీ కార్యదర్శి శోభారాయ్‌ అలియాస్‌ గడ్డం మధుకర్‌ కరోనాతో ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. ఆయనను విచారించినప్పుడు ఇంకా పలువురు నాయకులకు కొవిడ్‌ సోకినట్లు తెలుసుకున్న పోలీసులు వారి కదలికలపై నిఘా పెట్టారు. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్‌లో తలదాచుకుంటున్న అగ్రనేతలు చుట్టుపక్కల రాష్ట్రాల్లోని ఆసుపత్రులకు వచ్చే అవకాశం ఉందన్న సమాచారంతో వాటిపై కన్నేశారు.
లొంగిపోతే తామే చికిత్స అందిస్తామని ఇప్పటికే ప్రకటించిన అధికారులు చాటుమాటుగా చికిత్స కోసం వచ్చేవారి ఆచూకీ తెలుసుకునేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలిసింది.  

సమీప గ్రామాలపై దృష్టి
మావోయిస్టు అగ్రనేతల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 150 మంది దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉన్నారు. వారిలో 20 మందికిపైగా అగ్రస్థాయి వారుకాగా, కేంద్ర కమిటీలో 17 మంది సభ్యులు ఉన్నారు. ఇంకా రాష్ట్ర కమిటీలు, డివిజినల్‌ కమిటీల వారూ తెలుగువారే. వీరిలో పలువురు కరోనా బారిన పడ్డట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారిలో దాదాపు అందరూ 50 ఏళ్లకు పైబడ్డవారే. వీరు రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ఇదివరకే గుర్తించారు. ఇలాంటివారికి కొవిడ్‌ సోకితే అజ్ఞాతంలో ఉండి కోలుకోవడం కష్టం. ఆసుపత్రి చికిత్స అవసరం పడవచ్చు. అందుకే చికిత్స కోసం మధుకర్‌ వచ్చినట్లే వీరు కూడా కచ్చితంగా సమీపంలోని పట్టణాల్లోని ఆసుపత్రులకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. అందుకే దండకారణ్యం చుట్టుపక్కల ఉన్న పట్టణాలన్నింటినీ అప్రమత్తం చేశారు. ఆ పట్టణాలకు వెళ్లే రహదారుల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. అక్కడి ఆసుపత్రుల్లో చికిత్స కోసం వచ్చేవారి వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకునే ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. కొందరు అజ్ఞాతంలోనే చనిపోయినట్లు అనుమానిస్తున్న పోలీసులు వారి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు