మూడో ముప్పుపై.. ‘పరిశోధన’ వ్యూహం
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మూడో ముప్పుపై.. ‘పరిశోధన’ వ్యూహం

ముందే గుర్తించే సామర్థ్యాల అభివృద్ధిపై దృష్టి
స్థానిక ప్రభుత్వాలతో పనిచేయనున్న సీసీఎంబీ నేతృత్వంలోని కన్సార్షియం

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌ రెండో దశ ఉద్ధృతి తగ్గినా.. వైరస్‌ ముప్పు పూర్తిగా తొలగిపోలేదు. భవిష్యత్తులో మరిన్ని దశలు వచ్చేందుకు అవకాశం ఉందని నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో పరిశోధన సంస్థలు అప్రమత్తమయ్యాయి. అధిక వ్యాప్తికి కారణమయ్యే ఆందోళనకర వైరస్‌ రకాలను ముందే గుర్తించడానికి అవసరమైన వ్యూహాలు, సామర్థ్యాల అభివృద్ధే లక్ష్యంగా హైదరాబాద్‌, బెంగళూరు, దిల్లీ, పుణెలలోని పరిశోధన సంస్థలు నగరాల వారీగా క్లస్టర్లుగా ఏర్పడ్డాయి. ఎప్పటికప్పుడు వైరస్‌ జన్యుక్రమాల ఆవిష్కరణతో ఆరంభంలోనే కొత్త వైరస్‌ రకాలను కనుగొనడంతోపాటు, అధిక వ్యాప్తికి కారణమయ్యే వాటిని గుర్తించి ప్రభుత్వాలను అప్రమత్తం చేయనున్నాయి. దేశవ్యాప్తంగా పది సంస్థలతో కలిసి గతేడాది ఆఖరులో కేంద్రం ఏర్పాటు చేసిన ‘ఇన్స్‌కాగ్‌’ కన్సార్షియానికి ఇది అదనం. దీనికి  హైదరాబాద్‌లోని సెంటర్‌ఫర్‌ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) నేతృత్వం వహిస్తోంది. రాకీఫెల్లర్‌ ఫౌండేషన్‌ నిధులు సమకూరుస్తోంది. సీసీఎంబీ సలహాదారు డాక్టర్‌ రాకేశ్‌మిశ్ర, ఎన్‌సీబీఎస్‌ ఆచార్యులు సత్యజిత్‌ మేయర్‌, పుణె నాలెడ్జి క్లస్టర్‌ నుంచి ఆచార్య ఎల్‌ఎస్‌ శశిధర, ఐజీఐబీ నుంచి డా.అనురాగ్‌ అగర్వాల్‌ల ఆధ్వర్యంలో పరిశోధనలు జరగనున్నాయి. ‘ఇందులో భాగమవుతున్న సంస్థలన్నీ కొవిడ్‌ ప్రారంభం నుంచి పరిశోధనలు చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ కలిసి పనిచేయడం అవసరం. నిర్మాణాత్మక సూచనలు చేసేందుకు వీలుంటుంది’ అని సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ వినయ్‌ నందికూరి తెలిపారు.

పరిశోధన లక్ష్యాలు
వైరస్‌ వ్యాప్తిపై నిరంతర నిఘా
అధునాతన గణన పద్ధతులతో వ్యాప్తి తీరుతెన్నులను గుర్తించడం
ఆరంభం నుంచే వైరస్‌ రకాలను ట్రాక్‌ చేయడం
క్లినికల్‌ డాటా ఆధారంగా రోగ లక్షణాలు, వ్యాధి తీవ్రతను పోల్చి చూడటం
వైరస్‌ ముప్పును ముందే గుర్తించేలా అంటువ్యాధుల నిఘా సామర్థ్యాలను పెంపొందించడం
ఆందోళనకర వైరస్‌ రకాలను ముందే గుర్తించేలా వ్యూహాలు, సామర్థ్యాలను అభివృద్ధి చేయడం

 భాగస్వామ్య సంస్థలు
హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ)
దిల్లీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జీనోమిక్స్‌ అండ్‌ ఇంటిగ్రేటివ్‌ బయాలజీ(ఐజీఐబీ)
బెంగళూరులోని ఎన్‌సీబీఎస్‌-టీఐఎఫ్‌ఆర్‌, ఇన్‌స్టెమ్‌-డీబీటీ, ఎన్‌ఐఎంహెచ్‌ఏఎన్‌ఎస్‌
పుణెలోని ఐఐఎస్‌ఈఆర్‌, ఎన్‌సీఎల్‌, పుణె నాలెడ్జి క్లస్టర్‌


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని