తొమ్మిది, పది షెడ్యూళ్ల ఆస్తుల సత్వర విభజన
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తొమ్మిది, పది షెడ్యూళ్ల ఆస్తుల సత్వర విభజన

నిధుల పంపకాల ప్రక్రియ సత్వరమే పూర్తి
ఉద్యోగుల ఖాళీల వివరాలివ్వాలి
ఉన్నతస్థాయి సమావేశంలో మంత్రి హరీశ్‌రావు

ఈనాడు, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం 9వ షెడ్యూల్లోని 91 సంస్థల్లో వివాదరహితమైన 70 సంస్థలకు సంబంధించి షీలాభిడే కమిటీ సిఫార్సుల ప్రకారం ఆస్తులు, అప్పుల విభజనకు చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయించారు. 10వ షెడ్యూల్లోని 142 సంస్థల సంబంధించిన నిధుల పంపకాలు మినహా ఇతర అంశాలను వెంటనే పరిష్కరించుకోవాలనే అభిప్రాయానికి వచ్చారు. దీనికి అనుగుణంగా తెలంగాణలోని అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, కమిషన్లకు సంబంధించిన పాలన, ఆస్తులు, భూములు, భవనాలు, సంబంధించిన వివరాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు. తొమ్మిది, పది షెడ్యూళ్లలోని సంస్థల విభజన, ఇతర అంశాలపై గురువారం బీఆర్‌కే భవన్‌లో ఈ సమావేశం జరిగింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు పాల్గొన్నారు. దాదాపు ఆరు గంటల పాటు విభజన చట్టంలోని అంశాలు, ప్రభుత్వ శాఖల ఉద్యోగుల వివరాల గురించి చర్చించారు. ‘‘9, 10 షెడ్యూళ్లలోని సంస్థల్లో 2014 జూన్‌ రెండో తేదీవరకు ఉన్న నగదును రెండు రాష్టాల్రు 58:42 దామాషాలో పంచుకోవాలని ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనికి అనుగుణంగా ఇరు రాష్టాల్ర మధ్య దాదాపు 90% పూర్తయిన 10వ షెడ్యూల్‌ సంస్థల నగదు పంపిణీ జరిగింది. తొమ్మిదో షెడ్యూలుకు సంబంధించిన ప్రక్రియ పూర్తికాలేదు. దీని గురించి నివేదిక సిద్ధం చేయాలని’’ మంత్రి ఆదేశించారు. దీంతో పాటు శాఖలవారీగా 9, 10 షెడ్యూళ్లలోని సంస్థల భూములు, బిల్డింగులు, ఇతర స్థిరాస్తుల వివరాలు క్రోడీకరించాలని నిర్ణయించారు. నిర్ణీత నమూనా మేరకు అన్ని శాఖల అధికారులు తమ పరిధిలోని సంస్థల నుంచి సమాచారం సేకరించి ప్రభుత్వానికి పంపించాలని సూచించారు. కొత్త పీఆర్‌సీ నేపథ్యంలో వివిధ శాఖల్లో మంజూరైన పోస్టులు, ఖాళీల వివరాలు, ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులు, వారి వారి జీతభత్యాలపై స్పష్టమైన సమాచారం ఇవ్వాలని మంత్రి ఆదేశించారు.
ముమ్మరంగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు
తెలంగాణలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు ముమ్మరం చేయాలని అన్ని శాఖల అధికారులను సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు. యువత, మహిళలకు పెద్దఎత్తున శిక్షణ ఇవ్వాలన్నారు. గురువారం ఆయన బీఆర్‌కే భవన్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా ప్రజల జీవనోపాధి పెంపుదలకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు