ఒక్క రోజులో 6,148 కొవిడ్‌ మరణాలు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒక్క రోజులో 6,148 కొవిడ్‌ మరణాలు

బిహార్‌లో సవరించిన లెక్కలతో మృతుల సంఖ్య పెరుగుదల
దేశంలో 24 గంటల్లో 94,052 కేసులు

ఈనాడు, దిల్లీ: దేశంలో గతంలో ఎన్నడూ లేనంతగా గురువారం అత్యధిక సంఖ్యలో ఒకేరోజు 6,148 కొవిడ్‌ మరణాలు నమోదయ్యాయి. ఇందులో ఒక్క బిహార్‌లో నమోదైన మరణాలే 3,971 ఉన్నాయి. ఇంతవరకు లెక్కల్లో చేరని మరణాలను ఆడిట్‌ చేసి తాజాగా చేర్చడంతో ఒక్క రోజు మరణాల సంఖ్యలో భారీగా పెరుగుదల నమోదైంది. బిహార్‌ను మినహాయిస్తే మిగతా రాష్ట్రాల్లో 2,177 మరణాలు నమోదయ్యాయి.
దేశంలో వరుసగా మూడో రోజు లక్ష కంటే దిగువకు (94,052) కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే క్రితం రోజు కంటే 1.57% మేర పెరిగాయి. మొత్తం కేసుల సంఖ్య 2,91,83,121కి చేరగా.. ఇంతవరకు కొవిడ్‌ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 3,59,676కి పెరిగింది. మరణాల రేటు 1.23%కి చేరింది.
దేశవ్యాప్తంగా ఒక్కరోజులో 1,51,367 మంది కొవిడ్‌ నుంచి కోలుకోగా.. క్రియాశీలక కేసులు మరింత తగ్గి 11,67,952 (4%)కి చేరాయి. ఇంతవరకు 2,76,55,493మంది కొవిడ్‌ను జయించారు.
మహారాష్ట్ర, తమిళనాడు మినహాయించి మిగిలిన అన్ని రాష్ట్రాల్లో (బిహార్‌ కాకుండా) మరణాలు తగ్గుముఖం పట్టాయి. మూడు రోజుల తర్వాత రోజువారీ కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల సంఖ్యను మళ్లీ 20 లక్షలకు పెంచారు. రోజువారీ పాజిటివిటీ రేటు 4.69%, వారం సగటు పాజిటివిటీ రేటు 5.43%కి చేరింది. దేశంలో ఇంతవరకు 24,27,26,693 కొవిడ్‌ టీకా డోసులు వేశారు.
బిహార్‌లో క్రితం రోజు వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 5,458. ఆడిట్‌ చేసి సవరించడంతో రాష్ట్రంలో ఆ సంఖ్య ఒక్కసారిగా 72% పెరిగి 9,429కి చేరింది. ఆ ప్రభావం గురువారం దేశవ్యాప్త గణాంకాలపై పడింది. బిహార్‌లో 3 వారాలు జిల్లాల వారీగా ఆడిట్‌ జరిపిన లెక్కలను విడుదల చేశారు. ఇందులో అత్యధికంగా 2,303 మరణాలు రాష్ట్ర రాజధాని పట్నాలోనే నమోదయ్యాయి. బక్సర్‌ జిల్లాలో మరణాల్లో కనిపించిన అవకతవకలకు గమనించిన పట్నా హైకోర్టు మొత్తం పరిస్థితులపై విచారణ జరిపించాలని మే 17న ఆదేశించడంతో జిల్లాల వారీగా ఆడిట్‌ నిర్వహించారు. దాంతో తనిఖీ తర్వాత అక్కడి మరణాలు పెరిగిపోయాయి. ప్రైవేటు ఆసుపత్రులు, హోం ఐసోలేషన్‌, కొవిడ్‌ అనంతర సమస్యల కారణంగానే మరణాలు పెరిగినట్లు అధికారులు తేల్చారు. వీటిని ఇదివరకు లెక్కలోకి తీసుకోలేదని చెప్పారు. మరోవైపు కరోనా రెండో ఉద్ధృతిలో సంభవించిన మరణాలపై ఆడిట్‌ నిర్వహించాలని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వాన్ని కూడా ఆ రాష్ట్ర హైకోర్టు తాజాగా ఆదేశించింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు