TS News: పత్తి గింజల నూనెపై గురి
close

ప్రధానాంశాలు

TS News: పత్తి గింజల నూనెపై గురి

కొత్త విధానం తెచ్చే యోచన

ఈనాడు, హైదరాబాద్‌: వంటనూనెల కొరత తీర్చేందుకు పత్తిగింజలే సరైన పరిష్కారమని అధికార వర్గాలు ప్రభుత్వానికి సూచిస్తున్నాయి. పత్తి గింజల నుంచి వంటనూనె, వ్యర్థాలతో నూనె చెక్క తయారీకి ప్రత్యేక విధానం తేవాలనే ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పరిశీలిస్తోంది. దీని కోసం మిల్లుల ఏర్పాటుకు ప్రోత్సాహాకాలివ్వాలని యోచన. ప్రస్తుతం తెలంగాణలో మిల్లులు లేక గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ వ్యాపారులు ఇక్కడి నుంచి గింజలు కొని తీసుకెళుతున్నారు. అక్కడ ఉత్పత్తి అయిన పత్తి నూనెను ఇక్కడి వ్యాపారులు కొని తెస్తున్నారు. ఈ ప్రక్రియలో రవాణా ఛార్జీలు అధికమై ఇక్కడ పత్తి నూనె ధర లీటరు రూ.120 పలుకుతోంది. ఇక్కడే మిల్లులుంటే ధర తగ్గుతుందని అంచనా. తెలుగు రాష్ట్రాల్లో వంటనూనెలకు భారీగా డిమాండు ఉంది. వీటి తయారీకి పంటల కొరత తీవ్రంగా ఉన్నందున పత్తిగింజలే ఇందుకు పరిష్కారమని ‘రాష్ట్ర పత్తి జిన్నింగ్‌ మిల్లుల సంఘం’ ఇచ్చిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.
తెలంగాణలో ఈ వానాకాలంలో పత్తి ఒక్కటే 75 లక్షల ఎకరాల్లో సాగవుతుందని అంచనా. గత జనవరిలో పత్తి గింజల క్వింటా ధర రికార్డు స్థాయిలో రూ.2600కు చేరింది. గింజలను గానుగాడితే నూనెతోపాటు వచ్చే వ్యర్థాలను పశుదాణాకు, సబ్బుల తయారీకి వాడతారు. పత్తి నూనెల ఉత్పత్తికి ప్రత్యేక విధానం తెచ్చేందుకు యోచిస్తున్నట్లు వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల మంత్రి నిరంజన్‌రెడ్డి ధ్రువీకరించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని