మూడు రోజుల్లో 13,553 మరణాలు
close

ప్రధానాంశాలు

మూడు రోజుల్లో 13,553 మరణాలు

తాజాగా 84,332 కొవిడ్‌ కేసులు
4.39%కి పాజిటివిటీ రేటు

ఈనాడు, దిల్లీ: దేశంలో మూడు రోజుల్లో 13,553 కొవిడ్‌ మరణాలు నమోదయ్యాయి. బిహార్‌, మహారాష్ట్రల్లో ఆడిట్‌ చేసి మరణాల గణాంకాల్లో ఇంతవరకు చేర్చని వాటిని తాజాగా జత చేయడంతో ఈ సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఈనెల 10 నుంచి 12 వరకు 3 రోజుల్లో వరుసగా 6,148, 3,403, 4,002 రోజువారీ మరణాలు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తంగా ఈ మూడు రోజుల్లో సాధారణ మరణాలు 5,848 సంభవించగా.. రెండు రాష్ట్రాల్లో ఆడిటింగ్‌ తర్వాత అదనంగా 7,705 చేర్చారు.
* దేశవ్యాప్తంగా శనివారం 24 గంటల్లో 84,332 కొత్త కేసులు బయటపడ్డాయి. లక్ష లోపు కేసులు నమోదు కావడం వరుసగా ఇది 5వ రోజు. ఏప్రిల్‌ 2 తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో కేసులు రావడం ఇదే తొలిసారి. మొత్తం కేసుల సంఖ్య 2,93,59,155కి చేరగా.. ఇంతవరకు 3,67,081 మంది కొవిడ్‌కు బలైపోయారు. మరణాల రేటు 1.25 శాతానికి పెరిగింది.
* మే 10న గరిష్ఠంగా 37,45,237 మేర ఉన్న క్రియాశీలక కేసులు శనివారం నాటికి 10,80,690కి తగ్గాయి. దాదాపు నెల రోజుల్లో ఇవి 71% మేర తగ్గాయి. క్రియాశీలక కేసుల రేటు 3.68%కి తగ్గింది. ఒక్కరోజులో 1,21,311 మంది కోలుకోగా రికవరీ రేటు 95.07%కి పెరిగింది.
* దేశవ్యాప్తంగా శుక్రవారం 20,44,131 కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు జరిపారు. రోజువారీ పాజిటివిటీ రేటు 4.39% నమోదైంది. వారపు పాజిటివిటీ రేటు 4.94 శాతానికి తగ్గింది. నెల రోజుల క్రితం ఇది 17.62%గా ఉండేది. దేశంలో ఇంతవరకు 24.96 కోట్ల టీకా డోసులు వేశారు.
* మహారాష్ట్రలో ఒక్క రోజులో 2,619 మరణాలు నమోదయ్యాయి.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని