సోనూసూద్‌తో కలిసి పనిచేస్తాం
close

ప్రధానాంశాలు

సోనూసూద్‌తో కలిసి పనిచేస్తాం

వెబినార్‌లో తెదేపా అధినేత చంద్రబాబు వెల్లడి
ఆయన దూరదృష్టితోనే హైదరాబాద్‌ అభివృద్ధి: సూద్‌

ఈనాడు, అమరావతి: కొవిడ్‌ మూడో దశను ఎదుర్కొనేందుకు అంతా సన్నద్ధం కావాలని, అందరూ టీకాలు వేయించుకోవాలని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు సూచించారు. ‘రెండు దశల అనుభవాలతో మూడో దశ రాకుండా  ప్రజల్లో అవగాహన కలిగిద్దాం. ఒక ప్రాంతాన్ని నమూనాగా తీసుకుని క్లస్టర్‌ ప్రాతిపదికన వాలంటీర్ల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొద్దాం.. ప్రభుత్వంపైనా ఒత్తిడి పెంచుదాం’ అని చెప్పారు. ఎన్టీఆర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో బాలీవుడ్‌ నటుడు సోనూ సూద్‌, అమెరికాకు చెందిన వైద్యుడు లోకేశ్వరరావుతోపాటు పలువురితో ‘సమాజ శ్రేయస్సును నిర్ధారించే మార్గాలు’ పేరుతో శనివారం నిర్వహించిన వెబినార్‌లో చంద్రబాబు మాట్లాడారు. నటుడు సోనూ సూద్‌ సేవలను చంద్రబాబు ప్రశంసించారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని పని చేయాలని పిలుపునిచ్చారు.  ‘మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది. త్వరలో మనం కలుద్దాం, కలిసి పని చేద్దాం’ అని సోనూ సూద్‌తో చెప్పారు. ‘ఎంతో మంది ప్రాణాలు కాపాడిన ఫ్రంట్‌లైన్‌ యోధులకు వందనం. కొవిడ్‌ సమయంలో ఎన్టీఆర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ఎకో సిస్టమ్‌ అభివృద్ధి చేశాం. వైద్య సాయం అందించాం. దీన్ని కొనసాగిస్తాం’ అని తెలిపారు.

మీ శక్తి సామర్థ్యాలను తక్కువ అంచనా వేసుకోవద్దు: సోనూసూద్‌

‘షూటింగ్‌ నిమిత్తం హైదరాబాద్‌ వచ్చినప్పుడు నగర అభివృద్ధి చూసి ఆశ్చర్యపోయా. చంద్రబాబు దూరదృష్టితోనే ఇది సాధ్యమైందని తెలుసుకున్నా’ అని సోనూ సూద్‌ పేర్కొన్నారు. సంక్షోభ సమయంలో చంద్రబాబు అందరికీ ఆదర్శంగా నిలిచారని తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తన భార్య గోదావరి జిల్లాలకు చెందినవారని తెలిపారు. ‘కొవిడ్‌ సంక్షోభ సమయంలో ఎంతోమంది వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బాధితులను ఆదుకునేందుకు ఎన్టీఆర్‌ ట్రస్టుతో పాటు ఎంతోమంది సహకారం అందించారు. మానవత్వంతో నాకు చేతనైన సాయం అందించా. తలచుకుంటే ఎవరైనా చేయగలరు. మీ శక్తి సామర్థ్యాలను తక్కువగా అంచనా వేసుకోవద్దు’ అని సోనూ సూద్‌ చెప్పారు. సూద్‌ ఛారిటీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, నెల్లూరుతోపాటు మరోచోట, తెలంగాణలో హైదరాబాద్‌ సహా వివిధ రాష్ట్రాల్లో 18 ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని