Corona: కల్యాణ సంక్షోభమే!
close

ప్రధానాంశాలు

Corona: కల్యాణ సంక్షోభమే!

వివాహాలు, శుభకార్యాలు పెద్దఎత్తున వాయిదా
కొవిడ్‌తో ఉపాధికి అష్టకష్టాలు
రెండు లక్షల మందిపై ప్రభావం
కళ తప్పిన ఫంక్షన్‌ హాళ్లు.. సందడి లేని ఈవెంట్‌ సంస్థలు

పెళ్లి, నిశ్చితార్థం, పుట్టినరోజు వేడుక ఏదైనా ఇంటిల్లిపాదికి, బంధు మిత్రులకు ప్రత్యక్షంగా ఆనందాన్నిస్తుంది. పరోక్షంగా ఎంతోమందికి ఉపాధినిస్తుంది. ముహూర్తం ఖరారవడం ఆలస్యం.. ఆహ్వానపత్రికలు అచ్చేసి ఇచ్చేది ఒకరు.. ఫంక్షన్‌ హాల్‌ సిద్ధం చేసేది మరొకరు.. కొందరు వేదికను అందంగా అలంకరించి పెడితే, ఇంకొందరు నోరూరించే వంటకాలు సిద్ధం చేస్తారు. మరికొందరు అతిథులకు వడ్డిస్తారు. బ్యాండు బాజాలు మోగిస్తూ.. ఫొటోలు, వీడియోలు తీస్తూ, అతిథులకు ఆహ్వానం పలుకుతూ, వినోదాలను పంచుతూ ఆ వేడుక తమ ఇంటిదే అన్నంతగా లీనమైపోతారు. ఇలా ఒక మోస్తరు హంగామాతో చేసే పెళ్లి వంద నుంచి నూటయాభై మందికి ఉపాధి కల్పిస్తుందని అంచనా. కానీ కరోనా మహమ్మారి పరిస్థితిని తలకిందులు చేసింది. శుభకార్యాలు, ఇతర కార్యక్రమాలపై ఆధారపడ్డవారి వ్యాపారం, ఉపాధిని మహమ్మారి కుప్పకూల్చేసింది. ఆదాయం లేక, కుటుంబ అవసరాలు తీర్చేవారు లేక, రుణ వాయిదాలు కట్టలేక కొందరు ఆస్తులు, బంగారం అమ్ముకుంటున్నారు.  రాష్ట్రానికి చెందినవారే కాదు.. హైదరాబాద్‌లో రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో ఇతర రాష్ట్రాల వాళ్లు సైతం ఈ రంగంలో పెద్దఎత్తున ఉపాధి పొందుతున్నారు. వీరంతా ఇప్పుడు బతుకుదెరువుకోసం దొరికిన పనల్లా చేయాల్సిన స్థితికి వెళ్లారు. ప్రత్యక్షంగానే దాదాపు రెండు లక్షలమంది  ఉపాధిని కొవిడ్‌ మహమ్మారి ఊడ్చేసింది.


ముహూర్తాలున్నా వైరస్‌ ముంచేసింది..

ప్రతి సీజన్‌లో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో సుమారు తొమ్మిది వేల పెళ్లిళ్లు జరిగేవి. కరోనా రెండో దశ కారణంగా చాలామంది వేడుకలను వాయిదా వేసుకుంటే కొందరు మాత్రమే నిరాడంబరంగా చేసుకున్నారు. నగరంలోని సుమారు 800 ఫంక్షన్‌ హాళ్లు  వేడుకల కళ లేక వెలవెలబోతున్నాయి. ఇందులో కొన్ని కొవిడ్‌ ఐసొలేషన్‌ కేంద్రాలుగా కూడా మారాయి. శుభ ముహూర్తాలున్నప్పుడు పెళ్లిళ్లే కాకుండా గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలు వంటివి కూడా పెద్దఎత్తున జరుగుతాయి. కానీ ఈఏడాది అంతా తారుమారైంది.మే, జూన్‌ నెలల్లో మంచి ముహూర్తాలున్నా రెండో వేవ్‌ విజృంభణతో చాలామంది భయపడిపోయారు. దీనికి తోడు ప్రభుత్వ ఆంక్షలు కూడా ఉండడంతో ఎవరూ వేడుకల జోలికిపోలేదు. దాదాపు 80 శాతం కార్యక్రమాలను వాయిదా వేశారు. మిగిలిన 20 శాతం కూడా అతి తక్కువ మంది సన్నిహితుల మధ్య నిర్వహిస్తున్నారు. దీంతో ఈ రంగంపై ఆధారపడ్డ వారి ఆర్థిక స్థితి అస్తవ్యస్తమైంది. ‘‘రాష్ట్రంలో 30 వేల మంది పురోహితులు ఉన్నారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల ద్వారా ఉపాధి పొందే వారు ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు. తొంభైశాతం మందికి ఉపాధి పూర్తిగా తగ్గిపోయింది’’అంటూ ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర అర్చక, ఉద్యోగ సంఘం ఐకాస కన్వీనర్‌ డీవీఆర్‌ శర్మ. ‘ఈవెంట్లలో అతిథులకు ప్లేట్లు, పండ్లు అందించిన మహిళలు ఉపాధి లేక ఇళ్లలో పాచిపనులు చేసుకుంటున్నారు. బాయ్స్‌ ఊర్లలో వ్యవసాయ పనులు, నగరాల్లో కూరగాయలు అమ్ముకుంటున్నారు. ఏటా 200 వరకు పెళ్లిళ్లు, ఈవెంట్లకు సేవలు అందించేవాళ్లం. రూ.3 కోట్ల వ్యాపారం జరిగేది. ఇప్పుడు దాదాపు 90శాతం వ్యాపారం కుప్పకూలింది. జూన్‌, జులైకి ఒక్క బుకింగ్‌ కూడా కాలేదు’ అని అన్నారు నగరంలోని ప్రముఖ సప్లయింగ్‌ కంపెనీ అధినేత నందికొండ శ్రీనివాస్‌రెడ్డి. ఇలా వివాహానికి సంబంధించిన ప్రతి రంగంపై కరోనా చూపిన ప్రభావం తీవ్రంగా ఉంది. మళ్లీ ఆ కళకళలు తిరిగి ఎప్పుడొస్తాయో అని అందరూ ఎదురు చూస్తున్నారు.

‘ఈ ఏడాది ముహూర్తాలు బాగా ఉండడంతో ఆర్థికంగా బాగానే ఉంటుందనుకున్నాం. కానీ పరిస్థితులు అనుకూలించలేదు. ఈ నెలాఖరు వరకు ముహూర్తాలు ఉన్నాయి. జులై 10 నుంచి ఆషాఢం మొదలవుతుంది. దీంతో శుభకార్యాలు ఆగిపోతాయి. ఇప్పటికే చాలా పెళ్లిళ్లు వాయిదాపడ్డాయి.’

-జి.రాఘవేంద్రశర్మ

ఆన్‌లైన్‌  సదస్సులతో

టీ, ఫార్మా, బీపీఓ కంపెనీలు, కేంద్రప్రభుత్వ సంస్థలు, రియాల్టీ కంపెనీలు, ప్రైవేటు సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాలరీత్యా వందలమందితో కాన్ఫరెన్స్‌లు నిర్వహించేవి. ఇలాంటి సదస్సులకు సాంకేతికంగా, నిర్వహణపరంగా అవసరమైన ఏర్పాట్లు చేసేవారికి, భోజనాలు అందించేవారికి, ఏసీలు, లైటింగ్‌ అందించేవారికి ఉపాధి లభించేది. ఇప్పుడా కాన్ఫరెన్స్‌లు అన్నీ ఆన్‌లైన్‌ కావడంతో వీరి ఉపాధి ఘోరంగా దెబ్బతింది.

అడ్వాన్స్‌లు ఇచ్చి రద్దు చేసుకున్నారు

రోనా రెండో వేవ్‌ మొదలుకాక ముందు 28 వివాహాలకు వేదిక బుక్‌ చేసుకున్నారు. కేసులు పెరగడంతో 25 రద్దయిపోగా కేవలం మూడు పెళ్లి వేడుకలు మాత్రమే జరిగాయి. రద్దయినవాళ్లంతా అడ్వాన్సులు తిరిగిచ్చేయమని అడిగారు. లక్షల్లో వ్యాపార నష్టం వాటిల్లింది. దీనికి నిర్వహణ ఖర్చులు తోడయ్యాయి.

- శ్రీతేజ, ‘శ్రీ’ కన్వెన్షన్‌ నిర్వాహకుడు


వడ్డీలు కట్టడానికే సరిపోతోంది

రోనాకు ముందు ఈవెంట్స్‌ వ్యాపారం బాగా సాగేందుకు మిత్రులందరం కలిసి ఓ కన్వెన్షన్‌ హాల్‌తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాం. నా వంతుగా రూ.45లక్షలు ఇచ్చాను. కొద్ది రోజుల్లోనే లాక్‌డౌన్‌తో పెళ్లిళ్లు, ఇతర వేడుకలు వాయిదా పడ్డాయి. ఈ సీజన్‌ అయినా బాగుంటుందని అనుకున్న తరుణంలో మళ్లీ రెండో వేవ్‌ తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. అప్పులు చేసి డబ్బు కట్టాం. డబ్బు ఇస్తానని నిర్వాహకుడు చెప్పినా ఏడాదిన్నరగా వ్యక్తిగతంగా నెలకు రూ.40వేల చొప్పున వడ్డీ కడుతున్నాను.

- విజయ్‌, అన్వయ ఈవెంట్స్‌


రూ.40 లక్షల నష్టం

‘ఈ సీజన్‌లో మొత్తం 10 పెళ్లిళ్లకు అడ్వాన్సులు ఇచ్చారు. ఇందులో కేవలం రెండు మాత్రమే జరిగాయి. జరిగిన రెండింటిలోనూ 40 మంది మాత్రమే హాజరయ్యారు. ఈ సీజన్‌లో సుమారు రూ.40 లక్షల వ్యాపారం నష్టం జరిగింది. ఓ వేడుకకు సుమారు 70 మందికి ఉపాధి కల్పించేవాడిని. ఇప్పుడా పరిస్థితి లేదు’

- నర్సింహారావు, లక్ష్మీ క్యాటరర్స్‌.

-ఈనాడు, హైదరాబాద్‌; ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని