విశాఖలో కూల్చివేతలు
close

ప్రధానాంశాలు

విశాఖలో కూల్చివేతలు

తెదేపా నేత సోదరుడు పల్లా శంకర్రావు,  మరికొందరి భూముల స్వాధీనం

ఈనాడు, విశాఖపట్నం: విశాఖపట్నంలో రెవెన్యూ అధికారులు ఆదివారం ఉదయం కూల్చివేతలు చేపట్టారు. తెల్లవారుజామున 5.30 గంటలకే బృందాలుగా బయల్దేరి.. నగరంలోని వివిధ ప్రాంతాలకు చేరుకున్నారు. సుమారు 100 మంది పోలీసులు భూములు స్వాధీనం చేసుకునే ప్రాంతాలకు ముందుగానే చేరుకుని పహరా కాశారు. ఆర్డీవో పెంచల కిశోర్‌ ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది జేసీబీలు, ఇతర సామగ్రితో మొదట తుంగ్లాం చేరుకున్నారు. అక్కడ సర్వే నంబరు 14లోని భూముల స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించగా నోటీసులు ఇవ్వకుండా ఎలా వస్తారంటూ స్థల యజమాని, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సోదరుడు పల్లా శంకర్రావు ప్రశ్నించారు. అది ప్రభుత్వ భూమి అని.. దానికి నోటీసులు ఇవ్వనవసరం లేదని అధికారులు చెప్పి.. అక్కడున్న ప్రహరీలను కూలగొట్టారు. కొంతసేపు ఇరువర్గాల మధ్య చిన్నపాటి వాదులాట చోటుచేసుకుంది. ఇదే సమయంలో జగ్గరాజుపేట, కూర్మన్నపాలెం, గాజువాక, తుంగ్లాంలోని ఇతర ప్రాంతాల్లోని ఆక్రమణలను నాలుగు జేసీబీలతో తొలగించారు. ఇక్కడున్న స్థలాల్లో కొన్నిచోట్ల ఐరన్‌ షీట్లు, ఫెన్సింగ్‌ తీగలు ఉంటే వాటన్నింటినీ రెవెన్యూ యంత్రాంగం తొలగించింది. రెండు, మూడు చోట్ల ప్రహరీలను కూలగొట్టారు. గాజువాక, పెదగంట్యాడ, ఆనందపురం మండల రెవెన్యూ సిబ్బంది ఆయా ప్రాంతాల్లో ఉన్న షెడ్లు, కంచెలను తొలగించారు. అనంతరం తహశీల్దార్లు లోకేశ్వరరావు, వేణుగోపాలరావు తమ సిబ్బందితో 15 చోట్ల హెచ్చరిక బోర్డులు పాతారు. ఆదివారం తాము స్వాధీనం చేసుకున్న మొత్తం భూములు 49.5 ఎకరాలని, వాటి బహిరంగ మార్కెట్‌ విలువ రూ.791.41 కోట్లని అధికారులు తెలిపారు. గాజువాక మండలం జగ్గరాజుపేట, తుంగ్లాం ప్రాంతాల్లోని వివిధ సర్వే నంబర్లలో 20 చోట్ల ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు రెవెన్యూ అధికారులు ప్రకటించారు.

కక్షపూరితం: శంకర్రావు
దీనిపై పల్లా శంకర్రావు మీడియాతో మాట్లాడుతూ... తమ సోదరుడు వైకాపాలోకి మారలేదనే రాజకీయ కక్షతోనే అధికార పార్టీ ఇలా చేయిస్తోందన్నారు. ఎక్కడా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోలేదని, తమకు తుంగ్లాంలో 40 ఎకరాల జిరాయితీ ఉండగా.. అది ఉమ్మడి ఆస్తి అని తెలిపారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూములకు సంబంధించి న్యాయ పోరాటం చేస్తామని ఆయన పేర్కొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని