ధాన్యం కొనుగోలు కోసం రైతుల ఆందోళన
close

ప్రధానాంశాలు

ధాన్యం కొనుగోలు కోసం రైతుల ఆందోళన

జాతీయ రహదారిపై 4 గంటల రాస్తారోకో

షాద్‌నగర్‌ న్యూటౌన్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం తమ ధాన్యం కొనుగోలు చేయాలని రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని వ్యవసాయ మార్కెట్‌ యార్డు వద్ద రైతులు ఆదివారం ఉదయం ఆందోళనకు దిగారు. రైతులు ధాన్యాన్ని యార్డు వద్దకు తీసుకురాగా, నిల్వ చేయడానికి లోపల చోటు లేదంటూ కొనుగోలు కేంద్రం నిర్వాహకులు యార్డు గేటును మూసివేశారు. దీంతో ఆగ్రహించిన రైతులు పాత జాతీయరహదారిపై రాస్తారోకో చేపట్టారు. ధాన్యం బస్తాను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. తెదేపా జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు అక్కడికి చేరుకుని అన్నదాతలకు మద్దతు ప్రకటించారు. అనంతరం రైస్‌మిల్లు యజమాని కొట్ర శ్రీధర్‌, పీఏసీఎస్‌ షాద్‌నగర్‌ ఛైర్మన్‌ బక్కన్న యాదవ్‌లతో ఫోన్‌లో మాట్లాడి సమస్యను వివరించారు. కొట్ర శ్రీధర్‌ యార్డు వద్దకు వచ్చి ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉన్నామని, గోదాం నిర్వహణ తమది కాదని వివరించారు. పీఏసీఎస్‌ షాద్‌నగర్‌, చేగూరు ఛైర్మన్లు బక్కన్నయాదవ్‌, అశోక్‌, వైస్‌ ఛైర్మన్‌ జగదీశ్‌ కూడా అక్కడికి చేరుకున్నారు. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ సూచించిన మేరకు ధాన్యం బస్తాలను నిల్వకు బూర్గుల శివారులోని అమిత్‌ పత్తి మిల్లు వద్దకు తీసుకెళ్లాలని రైతులకు తెలిపారు. అక్కడి నుంచి మిల్లుకు తీసుకెళ్లడానికి ఇబ్బందుల్లేకుండా చూస్తామని ఆర్డీఓ రాజేశ్వరి చెప్పారని వివరించడంతో అన్నదాతలు ఆందోళన విరమించారు. సుమారు 4 గంటల పాటు కొనసాగిన రాస్తారోకోతో వాహనాలు నిలిచిపోయాయి. రైతులు ధాన్యాన్ని నేరుగా అమిత్‌ పత్తి మిల్లుకు తీసుకురావాలని పీఏసీఎస్‌ల ఛైర్మన్లు బక్కన్నయాదవ్‌, అశోక్‌ తెలిపారు.

కౌలు రైతు ఆత్మహత్యాయత్నం
కోనరావుపేట, న్యూస్‌టుడే: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన ఆసరి అంజయ్య అనే కౌలు రైతు ఆదివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతను ఎకరన్నర భూమిని కౌలుకు తీసుకుని యాసంగిలో వరి సాగు చేశాడు. ధాన్యాన్ని ధర్మారంలోని కొనుగోలు కేంద్రానికి తరలించి నెల రోజులు గడుస్తున్నా నిర్వాహకులు తూకం వేయలేదు. వర్షానికి సుమారు 10 క్వింటాళ్ల ధాన్యం మొలకెత్తడంతో కొనుగోలు చేస్తారో లేదోనని మనస్తాపానికి గురై పురుగుల మందు తాగాడు. ప్రస్తుతం అతను ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై సింగిల్‌ విండ్‌ సీఈవో రాజేశంను వివరణ కోరగా.. కొనుగోలు కేంద్రంలో రైతుల ధాన్యాన్ని వరస క్రమంలో తూకం వేయించామని తెలిపారు. అంజయ్య కొనుగోలు కేంద్రం వైపు రాలేదని.. ధాన్యం ఆరబెట్టకపోవడం, తూర్పార పట్టకపోవడంతోనే తూకం వేయలేదన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని