అంతా తానొక్కరే అనుకుంటారు
close

ప్రధానాంశాలు

అంతా తానొక్కరే అనుకుంటారు

కేసీఆర్‌ తత్వం అదే
ఆలస్యంగా మంత్రివర్గం ఏర్పాటు ఆయన అహంకారానికి నిదర్శనం
మాజీ మంత్రి ఈటల రాజేందర్‌
పలువురు నేతలతో కలిసి భాజపాలో చేరిక

ఈనాడు, దిల్లీ: మాజీమంత్రి ఈటల రాజేందర్‌ సోమవారం భాజపాలో చేరారు. దిల్లీలో పెట్రోలియం, ఉక్కుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఆయనకు పార్టీ సభ్యత్వాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఆర్థిక, ఆరోగ్యమంత్రిగా పనిచేసిన సీనియర్‌ నేత ఈటలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నామన్నారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా భాజపా సత్తా చాటుతుందన్నారు. ఈటలతోపాటు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, మాజీ ఎంపీ రమేశ్‌ రాథోడ్‌, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా జడ్పీ మాజీ ఛైర్మన్‌ తులఉమ, గండ్ర నళిని, అశ్వత్థామరెడ్డి, అందె బాబయ్య, పలువురు ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి నేతలు కమలం గూటికి చేరారు. వీరిని కేంద్ర మంత్రి ధర్మేంద్ర, భాజపా ప్రధాన కార్యదర్శి దుష్యంత్‌ గౌతమ్‌, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ ఛుగ్‌ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి నివాసంలో ఈటల విలేకరులతో మాట్లాడారు. ‘భాజపా కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలు నాపై పెట్టుకున్న విశ్వాస్వాన్ని వమ్ము చేయను. రాష్ట్రం నలువైపులా పార్టీ విస్తరణకు కృషిచేస్తా. రానున్న రోజుల్లో తెలంగాణలోని ఇతర జిల్లాల నుంచి భారీగా చేరికలు ఉంటాయి.

హుజూరాబాద్‌లో నిలుస్తా.. గెలుస్తా
మంత్రులేంది... ఎమ్మెల్యేలేంది.. రాజ్యాంగం ఏంది.. నేనొక్కడినే పాలించాలనుకునే తత్వం కేసీఆర్‌ది. ప్రజాస్వామ్య వ్యవస్థను ఎన్నడూ ఆయన గౌరవించలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నెలల పాటు మంత్రివర్గం ఏర్పాటు చేయకపోవడం ఆయన అహంకారానికి నిదర్శనం. ఎన్నో అవమానాలు భరించినా ఎన్నడూ బయటపడలేదు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో నిలుస్తా. వంద శాతం గెలుస్తా. తెలంగాణ ఉద్యమంలో మేమేం చేశామో, మా పాత్ర ఏమిటో ప్రజలకు తెలుసు. ప్రత్యేక రాష్ట్రాభివృద్ధిలో మేధావుల సలహాలు, సూచనలు తీసుకుంటామని ఉద్యమ సమయంలో కేసీఆర్‌ చెప్పారు. ఇప్పుడు కనీసం అపాయింట్‌మెంట్‌ లభించడం లేదు.  ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా శాసనసభ్యులను అధికార పార్టీ చీల్చితే విమర్శించాం. 88 మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత కాంగ్రెస్‌, తెదేపా ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ఏం నీతి. నా ఆస్తులు, భూములపై సీబీఐ, సిట్టింగ్‌ జడ్జితో విచారణకు సిద్ధం. నా ఆస్తులపై దాడి జరిగిందనే తెరాసకు వ్యతిరేకంగా మాట్లాడానని కొందరు అంటున్నారు. గులాబీ జెండాకు ఓనర్లమని ఏడాది కిందటే చెప్పా. ధాన్యం కొనుగోళ్లు, ఆర్టీసీలో సంఘాల అవసరంపై గతంలోనూ మాట్లాడా’ అని ఈటల అన్నారు. రెండోసారి గెలిచిన తర్వాత తెరాసలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందా? మంత్రులకు స్వేచ్ఛనిస్తున్నారా? అని విలేకరులు ప్రశ్నించగా ‘స్వేచ్ఛనిస్తే నన్ను వాళ్లు అమ్మేస్తారని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్టు తనకు తెలిసిందని’’ ఈటల సమాధానమిచ్చారు.

ఈటలకు పార్టీ అండగా ఉంటుంది: సంజయ్‌
పార్టీలో ఈటల చేరిక సందర్భంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మాట్లాడుతూ, తెలంగాణ సాధనలో కీలక భూమిక పోషించిన రాజేందర్‌తో పాటు పలువురు నాయకులు పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. నియంత నాయకత్వం నుంచి బయటకు వచ్చిన వారికి అండగా ఉంటామన్నారు. తెలంగాణ తల్లి బంధవిముక్తికి భాజపా చేపట్టిన ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీలు ధర్మపురి అర్వింద్‌, సోయం బాపురావు, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ, సీనియర్‌ నేతలు మురళీధర్‌రావు, మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి, బంగారు శ్రుతి తదితరులు పాల్గొన్నారు. కొవిడ్‌ నిబంధనలతో కేంద్ర కార్యాలయంలో 20 మందికే అవకాశం ఇవ్వడంతో హుజూరాబాద్‌, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 200 మందికి కిషన్‌రెడ్డి నివాసంలో నేతలు కండువాలు వేసి భాజపాలోకి ఆహ్వానించారు.

నడ్డాతో ఆయన నివాసంలో భేటీ
కేంద్ర కార్యాలయంలో భాజపాలో చేరిన అనంతరం ఈటల, ఏనుగు రవీందర్‌రెడ్డి, రమేశ్‌ రాథోడ్‌, తుల ఉమ తదితరులు భాజపా జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డాను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. నేతలందరికీ నడ్డా కండువాలు వేసి ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, అన్ని విధాలుగా అండగా నిలుస్తామని నడ్డా ఈటల బృందానికి హామీ ఇచ్చారు. సోమవారం రాత్రి ఈటల తదితరులు జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ను ఆయన నివాసంలో కలిశారు. నేడు హైదరాబాద్‌ రానున్న ఈటల భాజపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు.

ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్ష పదవికి రాజీనామా

అబిడ్స్‌, న్యూస్‌టుడే: దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన ఎగ్జిబిషన్‌ సొసైటీకి 2014 నుంచి అధ్యక్షులుగా కొనసాగుతున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ సోమవారం ఆ పదవికి రాజీనామా చేశారు. సంబంధిత పత్రాన్ని తన వ్యక్తిగత సహాయకుడితో సొసైటీ కార్యదర్శికి పంపినట్లు సమాచారం. నూతన అధ్యక్షులుగా మంత్రి కేటీఆర్‌ పేరును సొసైటీ సభ్యులు ఏకగ్రీవం చేసి ఆయన అనుమతి కోసం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. మంగళవారం మేనేజింగ్‌ కమిటీ సమావేశంలో ఈ విషయంపై చర్చించే అవకాశముంది.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని