సంచైత నియామకం చెల్లదు
close

ప్రధానాంశాలు

సంచైత నియామకం చెల్లదు

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కీలక తీర్పు
మాన్సాస్‌ ట్రస్టు, సింహాచలం దేవస్థానం ఛైర్మన్‌గా అశోక్‌గజపతిరాజు పునరుద్ధరణ

ఈనాడు, అమరావతి: మాన్సాస్‌ ట్రస్టు ఛైర్మన్‌గా సంచైత గజపతిరాజును నియమిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోను ఆ రాష్ట్ర హైకోర్టు రద్దు చేసింది. ఆమె నియామకం చెల్లదని స్పష్టం చేసింది. ట్రస్టు వ్యవస్థాపక కుటుంబ సభ్యులుగా సంచైత గజపతిరాజు, ఊర్మిళ గజపతిరాజు, ఆర్‌వీ సునీత ప్రసాద్‌లను గుర్తిస్తూ ప్రభుత్వం ఇచ్చిన మరో జీవోనూ రద్దు చేసింది. సింహాచలం దేవస్థానం ఛైర్మన్‌గా సంచైత గజపతిరాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెలువరించిన జీవోనూ హైకోర్టు కొట్టేసింది. కేంద్ర మాజీ మంత్రి, ట్రస్టు పూర్వ ఛైర్మన్‌ అశోక్‌గజపతిరాజును మాన్సాస్‌ ట్రస్టు ఛైర్మన్‌గా, సింహాచలం దేవస్థానం వంశపారంపర్య ట్రస్టీ/ ఛైర్మన్‌గా పునరుద్ధరించింది. ఆయన నియామకాలకు సంబంధించి గతంలో జారీ చేసిన జీవోలను సమర్ధించింది. మాన్సాస్‌ ట్రస్టు.. ట్రస్టు డీడ్‌, ప్రాపర్టీ రిజిస్టర్‌ ప్రకారం ‘కుటుంబంలో పెద్దవారయిన పురుషులు’ వంశపారంపర్య ఛైర్మన్‌/అధ్యక్షులుగా వ్యవహరించాలని స్పష్టంగా ఉందని, అందువల్ల అశోక్‌గజపతిరాజే ట్రస్టు ఛైర్మన్‌గా ఉండాలని ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు. దీంతో ఏకీభవించిన హైకోర్టు సంచైత నియామకాన్ని రద్దు చేస్తూ అశోక్‌గజపతిరాజు నియామకాన్ని పునరుద్ధరించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.వెంకటరమణ ఈ మేరకు సోమవారం కీలక తీర్పు ఇచ్చారు.

న్యాయమే గెలిచింది: అశోక్‌గజపతిరాజు 

ఈనాడు, విజయనగరం: మాన్సాస్‌ ట్రస్టు ఛైర్మన్‌, సింహాచలం దేవస్థానం ఛైర్మన్‌గా సంచైత నియామకం చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పు.. రాజ్యాంగం, చట్టాలు ఇంకా బతికే ఉన్నాయని చెబుతోందని కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు వ్యాఖ్యానించారు. ఈ కేసులో న్యాయమే గెలిచిందన్నారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని