గల్ఫ్‌ పారిశ్రామికవేత్తలకు రాష్ట్రం అనుకూలం
close

ప్రధానాంశాలు

గల్ఫ్‌ పారిశ్రామికవేత్తలకు రాష్ట్రం అనుకూలం

పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: గల్ఫ్‌ దేశాల అభివృద్ధిలో తెలంగాణ కార్మికులు, ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారని, అక్కడి పారిశ్రామికవేత్తలు తమ పెట్టుబడుల కేంద్రంగా రాష్ట్రాన్ని ఎంచుకొని తరలిరావాలని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు. ఐటీ, ఔషధ, జీవశాస్త్రాలు, వైమానిక, రక్షణ, సౌర విద్యుత్తు, ఆహారశుద్ధి, నిర్మాణ రంగాల్లో పరిశ్రమల స్థాపనకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. రాష్ట్ర స్నేహపూర్వక విధానాల వల్ల గత ఏడేళ్లలో అగ్రశ్రేణి సంస్థల నుంచి భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చాయన్నారు. సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం ఆ దేశ పారిశ్రామిక సంస్థలతోపాటు సౌదీ-భారత వాణిజ్య మండలితో కలిసి తెలంగాణ పెట్టుబడుల సదస్సును సోమవారం ప్రారంభించింది. వర్చువల్‌గా నిర్వహించిన ఈ సదస్సులో సౌదీ-భారత్‌ వాణిజ్య మండలి ఛైర్మన్‌ అబ్దుల్‌ అజీజ్‌అల్‌ ఖతానీ, సౌదీ ప్రభుత్వ ప్రతినిధి మహమ్మద్‌ అల్‌ హస్నా, రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, నీతిఆయోగ్‌ అదనపు కార్యదర్శి రాకేశ్‌అగర్వాల్‌, టీఎస్‌ఐఐసీ ఎండీ వెంకట నర్సింహారెడ్డి పాల్గొన్నారు. ఈ సదస్సులో కేటీఆర్‌ ప్రగతిభవన్‌ నుంచి ప్రసంగించారు.

అన్నివిధాలా సానుకూలతలు
‘పరిశ్రమలకు రాయితీలు, ప్రోత్సాహకాలు పెద్దఎత్తున అందిస్తున్నాం. టీఎస్‌ఐపాస్‌ ఏకగవాక్ష సత్వర అనుమతుల విధానంతో రాష్ట్రంలో 15,852 పరిశ్రమల ద్వారా రూ.2,14,951 కోట్ల పెట్టుబడులు, 15,60,506 మందికి ఉపాధి ప్రతిపాదనలు అందాయి. అందులో 90 శాతం కార్యరూపం దాల్చాయి. సౌదీతో తెలంగాణ రాష్ట్ర వ్యాపార వాణిజ్య సంబంధాలు బలోపేతం కావాలి. అక్కడి పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నాం’ అని కేటీఆర్‌ తెలిపారు.

దేశానికి ఆదర్శంగా తెలంగాణ
ఆవిర్భావం అనంతరం అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్రం పారిశ్రామిక ప్రగతి సాధించి, దేశంలోనే అత్యుత్తమ స్థానంలో ఉందని ఈ సందర్భంగా సౌదీలో భారత రాయబారి అవుసాఫ్‌ సయూద్‌ ప్రశంసించారు. మంత్రి కేటీ రామారావు ప్రత్యేక చొరవతో సౌదీలోని కంపెనీలకు తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలపై రాయబార కార్యాలయం సంధానకర్తగా పనిచేస్తోందన్నారు. తాజా సదస్సు ద్వారా తెలంగాణకు పెట్టుబడులు వస్తాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని