అసత్య ప్రచారాలపై కఠిన చర్యలు
close

ప్రధానాంశాలు

అసత్య ప్రచారాలపై కఠిన చర్యలు

ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేవారిని ఉపేక్షించం
డీహెచ్‌, డీఎంఈల హెచ్చరిక
ఇప్పటికే మూడు దశల ఇంటింటి సర్వే పూర్తి
8.97 లక్షలమందికి కిట్లు
జాగ్రత్తలు మరవొద్దని హితవు

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘మూడో దశ వైరస్‌ ఉద్ధృతిపై కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఇటీవల ఒక టీవీ చర్చలో బాధ్యతారాహిత్యంగా మాట్లాడిన కెమికల్‌ ఇంజినీర్‌ పరుచూరి మల్లిక్‌పై సుల్తాన్‌బజార్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. ఎపిడెమిక్‌ చట్టం ప్రకారం కేసు నమోదైంది. ఇలా ఎవరు తప్పుడు ప్రచారాలు చేసినా కఠిన చర్యలు తప్పవు’’ అని ప్రజారోగ్య సంచాలకులు(డీహెచ్‌) డాక్టర్‌ జి.శ్రీనివాసరావు, వైద్యవిద్య సంచాలకులు(డీఎంఈ) డాక్టర్‌ రమేశ్‌రెడ్డి హెచ్చరించారు. టీకాలు పొందిన దేశాల్లో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని, ఇలాంటి సమయంలో ప్రజలకు దైర్యం కల్పించేలా మాట్లాడాలే తప్ప దుష్ప్రచారాలు తగవని హితవు పలికారు. మూడోదశలో తీవ్రత ఎక్కువగా ఉంటుందని, చిన్నపిల్లలపై దుష్ప్రభావాలుంటాయనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. మొదటి, రెండోదశలో కూడా కొవిడ్‌ బారినపడిన చిన్నారులున్నారని గుర్తుచేశారు. సాధారణ మరణాలనూ కొవిడ్‌ ఖాతాలో వేయడం సమంజసం కాదన్నారు. ఒకవేళ మూడోదశ ఉద్ధృతి వచ్చినా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసానిచ్చారు. కేసులు తగ్గినా.. ప్రజలు జాగ్రత్తలు పాటించడం మరవొద్దని సూచించారు. కోఠిలోని ప్రజారోగ్య సంచాలక కార్యాలయంలో డీహెచ్‌, డీఎంఈలు సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

తగ్గిన పాజిటివ్‌లు
‘‘రాష్ట్రంలో లాక్‌డౌన్‌కు ముందు 29 వేలకు పైగా క్రియాశీల కేసులుండగా.. ప్రస్తుతం 8,369 ఉన్నాయి. కొవిడ్‌ పడకల్లో చికిత్స పొందుతున్న వారి శాతం అప్పుడు 52గా ఉండగా.. ఇప్పుడు అది 16 శాతం మాత్రమే. ప్రస్తుతం పాజిటివిటి రేటు 1.36 శాతమే. రాష్ట్రంలో కరోనా తీవ్రత క్రమేణా తగ్గుతుందనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. ఇప్పటికే రాష్ట్రంలో మూడోవిడత ఇంటింటి సర్వే పూర్తయింది. జ్వర సర్వే, కొవిడ్‌ ఓపీలు కలిపి మొత్తంగా 8.97 లక్షల మందికి ఔషధ కిట్లను పంపిణీ చేశారు. ప్రస్తుతం జ్వరాల సీజన్‌ కావడంతో ఈ సర్వే మున్ముందు కూడా కొనసాగుతుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో మే నెల 25 నుంచి జూన్‌ 13 వరకూ సుమారు 35 రకాల కేటగిరీల్లోని 16,74,737 మంది హైరిస్క్‌ గ్రూపు లబ్ధిదారులకు వ్యాక్సిన్‌ అందజేశాం. ఇప్పటి వరకూ 80 లక్షలకు పైగా డోసుల పంపిణీ పూర్తయింది. 170 ప్రైవేటు ఆసుపత్రులపై 350 ఫిర్యాదులొచ్చాయి. అధిక రుసుంలు వసూలు చేస్తున్న ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటున్నాం. తిరిగి బాధితులకు ఆ మొత్తం ఇప్పిస్తున్నాం.

2025 నాటికి మలేరియా రహిత రాష్ట్రంగా..
కాలానుగుణ వ్యాధులు ప్రబలకుండా పంచాయతీరాజ్‌, పురపాలక, గ్రామీణ నీటిసరఫరా శాఖలతో సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక కార్యాచరణతో ఆరోగ్యశాఖ ముందుకెళ్తోంది. గత నాలుగేళ్లలో మలేరియాతో ఒక్క మరణమూ సంభవించలేదు. 2025 నాటికి మలేరియా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నాం. బ్లాక్‌ ఫంగస్‌ను ఎదుర్కొనేందుకు తెలంగాణ సర్కారు ముందస్తు వ్యూహంతో వ్యవహరించింది. అందుకే తీవ్ర నష్టం జరగలేదు. ఇప్పటి వరకు 800 బ్లాక్‌ఫంగస్‌ శస్త్రచికిత్సలు జరిగాయి. రాష్ట్రంలో అన్ని పడకలకూ ఆక్సిజన్‌ సౌకర్యాన్ని కల్పించే దిశగా ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి’’ అని డీహెచ్‌, డీఎంఈ వెల్లడించారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని