TS News: భూములపై హక్కులను తేల్చే పరిధి కమిషన్‌కు ఎక్కడిది?
close

ప్రధానాంశాలు

TS News: భూములపై హక్కులను తేల్చే పరిధి కమిషన్‌కు ఎక్కడిది?

సుప్రీం, హైకోర్టుల కంటే అత్యున్నతమా?
రూ.2 వేల కోట్ల విలువైన రాయదుర్గం భూములపై హైకోర్టు విచారణ 

 

ఈనాడు, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో సుమారు రూ.2 వేల కోట్ల విలువైన భూముల హక్కులను నిర్ణయిస్తూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ ఉత్తర్వులివ్వడంపై మంగళవారం హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తంచేసింది. భూములపై హక్కులను తేల్చే పరిధి కమిషన్‌కు ఎక్కడుంది.. ఏమైనా అత్యున్నత అధికారాలున్నాయా అంటూ ప్రశ్నించింది. అందులోనూ సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో కేసులు పెండింగ్‌ ఉన్నపుడు ఎలా తేలుస్తుందని నిలదీసింది. రాయదుర్గంలోని సర్వే నం.46లోని 84.30 ఎకరాల భూములను లార్వెన్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌, సయ్యద్‌ రహీముల్లా హుస్సేనికి అప్పగించాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ)ను ఆదేశిస్తూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ ఏప్రిల్‌ 12న ఇచ్చిన తీర్పు అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. హక్కుల కమిషన్‌ తీర్పునకు సంబంధించిన వ్యవహారంపై ప్రతివాదులైన రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి, సీసీఎల్‌ఏ, కలెక్టర్‌, పోలీసు కమిషనర్‌, రాయదుర్గం ఎస్‌హెచ్‌ఓ, డీజీపీ, ప్రైవేటుకు చెందిన లార్వెన్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌, సయ్యద్‌ రహీముల్లా హుస్సేనీలకు నోటీసులిచ్చింది. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను సెప్టెంబరు 13కు వాయిదా వేసింది. కమిషన్‌ ఉత్తర్వులపై ప్రభుత్వం దాఖలు చేసే పిటిషన్‌ను దీనికి జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది.
రాయదుర్గం భూములపై తనకు హక్కులున్నాయని పోరాడుతున్న సయ్యద్‌ హైదర్‌ మొహినుద్దీన్‌ హుస్సేని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిల ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డి, రాఘవేందర్‌రావులు వాదనలు వినిపిస్తూ.. ఈ భూమి ఆక్రమణలకు గురికాకుండా రక్షణ కల్పించాలని హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారని, భూమిని ప్రతివాదులైన లార్వెన్‌ ప్రాజెక్ట్స్‌కు అప్పగించాలని తుది తీర్పు వెలువరించిందన్నారు. లార్వెన్‌ తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ సుప్రీం తీర్పు ప్రకారం ఆస్తిపై హక్కు ప్రాథమిక హక్కేనని, ఇందులో కమిషన్‌ జోక్యం చేసుకోవచ్చనగా ధర్మాసనం తిరస్కరించింది. దీనిపై ప్రభుత్వ విచారణార్హత లేదని తాను స్వయంగా వాదనల సమయంలో హాజరై చెప్పానని ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్‌ పేర్కొన్నారు.

ఇదీ నేపథ్యం..: రాయదుర్గంలోని సర్వే నం.46పై ఆరు దశాబ్దాలుగా వివాదం నెలకొంది. 1925లో మౌల్వి సయ్యద్‌ అక్బర్‌ హుస్సేనికి చెందిన ఆస్తులను విభజించాలని కోరడంతో పాటు అనంతరం ఈ భూమిని కోర్టు ఆఫ్‌ వార్డులో ఉంచాలని ఆయన భార్య నిజాంను కోరారు. అప్పటినుంచి ఈ భూమిపై వివాదం నడుస్తోంది. ఇది ప్రభుత్వానిదని రెవెన్యూ అధికారులు వాదిస్తుండగా.. ప్రైవేటు భూమిగా కొందరు వ్యక్తులు కేసులు వేశారు. 1968 సమయంలో వలీవుల్లా హుస్సేని అనే వ్యక్తి అప్పటి హైదరాబాద్‌ జాయింట్‌ కలెక్టర్‌ కోర్టులో కేసు వేయగా కొట్టివేశారు. ఈ భూమి విషయంపై సుప్రీంకోర్టులోనూ కేసు నమోదైంది. మరోవైపు వలీవుల్లా కుమారుడు అజీజుల్లా హుస్సేన్‌ నుంచి లార్వెన్‌ ప్రాజెక్టు యాజమాన్యం భూమిపై ఒప్పందం చేసుకుంది. దీనిపై రెవెన్యూ రికార్డుల్లో పేర్లు బదలాయించాలని 2020లో హైకోర్టులో కేసు వేయగా.. ప్రస్తుతం అది నడుస్తోంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని