‘ఇన్‌యాక్టివేటెడ్‌ వెరో సెల్‌’ టీకా తయారీ ఎంతో కష్టం
close

ప్రధానాంశాలు

‘ఇన్‌యాక్టివేటెడ్‌ వెరో సెల్‌’ టీకా తయారీ ఎంతో కష్టం

ఖరీదైన వ్యవహారం కూడా
అందుకే కొవాగ్జిన్‌కు అధిక ధర

ఈనాడు, హైదరాబాద్‌: సంక్లిష్ట సాంకేతిక పరిజ్ఞానం, అత్యంత భద్రమైన తయారీ సదుపాయాలకు తోడు ఖరీదైన ముడిపదార్థాలు వినియోగించాల్సి రావడం వల్ల ‘కొవాగ్జిన్‌’ టీకాను తక్కువ ధరలో సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడిందని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ మంగళవారం ఒక ప్రకటనలో వివరించింది. ప్రభుత్వానికి ఒక డోసు టీకా రూ.150 ధరకే అందిస్తున్నామని, ఈ ధరకు టీకా సరఫరా చేయలేని పరిస్థితుల్లో ‘ప్రైవేటు’కు అధిక ధర నిర్ణయించాల్సి వచ్చిందని పేర్కొంది. కొవాగ్జిన్‌ టీకాను హోల్‌-విరియన్‌ ఇన్‌యాక్టివేటెడ్‌ వెరో సెల్‌ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేస్తున్నారు. ఇది ఎంతో సంక్లిష్ట సాంకేతిక పరిజ్ఞానమని, ఇందులో కొవిడ్‌-19 లైవ్‌ వైరస్‌ను డెడ్‌ వైరస్‌గా మార్చి, వినియోగించాల్సి ఉన్నందున ఎంతో భద్రమైన పరిస్థితుల్లో టీకా తయారీ చేపట్టాల్సి ఉంటుందని భారత్‌ బయోటెక్‌ వివరించింది. ఇప్పటి వరకు 4 కోట్ల డోసుల టీకా సరఫరా చేశామని, ఎక్కడా ఎటువంటి భద్రతా సమస్యలు తలెత్తలేదని పేర్కొంది. టీకా వల్ల తలెత్తే సమస్యలపై తాము భారత ప్రభుత్వం నుంచి రక్షణ (ఇండెన్‌మ్నిటీ) కూడా కోరలేదనే విషయాన్ని గుర్తు చేసింది.
ప్రైవేటుకు ఇప్పటివరకు 10 శాతం.. ఇకపై 25 శాతం
‘కేంద్ర ప్రభుత్వానికి రూ.150 ధరకే ఒక డోసు టీకా అందిస్తున్నాం, కానీ ఇంత తక్కువ ధరలో టీకాను దీర్ఘకాలం సరఫరా చేయడం సాధ్యం కాని విషయం, అందుకే ‘ప్రైవేటు’ రంగానికి అధిక ధర నిర్ణయించాల్సి వచ్చింది, తద్వారా కొంతమేరకైనా నష్టాలు పూడ్చుకునే అవకాశం కలుగుతుంది’ అని భారత్‌ బయోటెక్‌ వివరించింది. ఇప్పటి వరకు తమ ఉత్పత్తిలో 10 శాతం టీకా డోసులు మాత్రమే ప్రైవేటుకు అందించినట్లు, మిగతా 90 శాతం టీకాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సరఫరా చేసినట్లు వెల్లడించింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు కలిపి తాము సరఫరా చేసే టీకా సగటు ధర రూ.250 కంటే మించడం లేదని తెలియజేసింది. మున్ముందు తాము ఉత్పత్తి చేసే టీకాలో 75 శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకే అందిస్తామని, ప్రైవేటు ఆస్పత్రులకు ఇచ్చేది 25 శాతం మాత్రమేనని స్పష్టం చేసింది.
రూ.500 కోట్ల పెట్టుబడి
కొవాగ్జిన్‌ టీకా అభివృద్ధి, క్లినికల్‌ పరీక్షల నిర్వహణ, టీకా తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేయడం..  తదితర అవసరాలకు భారత్‌ బయోటెక్‌ ఇప్పటి వరకు సొంతంగా రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టింది. పైగా టీకా అభివృద్ధి ప్రక్రియలో ఎంతో రిస్కు ఉంటుందని, ఈ అంశాలన్నింటినీ టీకా ధర నిర్ణయించే విషయంలో పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుందని వివరించింది. సార్స్‌-కోవ్‌-2 లైవ్‌ వైరస్‌ స్ట్రెయిన్‌ అందించడంతో పాటు క్లినికల్‌ పరీక్షల నిర్వహణ, మరికొన్ని ఇతర అంశాల్లో ఐసీఎంఆర్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ నుంచి మద్దతు లభించిందని, బదులుగా ఆ సంస్థలకు రాయల్టీ చెల్లిస్తామని భారత్‌ బయోటెక్‌ పేర్కొంది. కొవాగ్జిన్‌ మాదిరిగానే మరికొన్ని టీకాలను ప్రభుత్వానికి తక్కువ ధరకే సరఫరా చేస్తున్నామని, అవే టీకాలకు ప్రైవేటులో అధిక ధర నిర్ణయించినట్లు వెల్లడించింది. ధరలో ఈ వ్యత్యాసం లేని పక్షంలో పరిశోధన- అభివృద్ధి కార్యకలాపాలపై పెట్టుబడి పెట్టడానికి, పెద్దఎత్తున ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉండదని, కేవలం కాంట్రాక్టు తయారీ పాత్రకు దేశీయ కంపెనీలు పరిమితం కావలసి వస్తుందని పేర్కొంది.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని