పక్కనే కంపు కొడుతుంటే భోజనాలు ఎలా చేస్తారు?
close

ప్రధానాంశాలు

పక్కనే కంపు కొడుతుంటే భోజనాలు ఎలా చేస్తారు?

ఆసుపత్రుల్లో శుభ్రత పెంచాలి
సీనియర్‌ వైద్యులు పూర్తిస్థాయి విధులు నిర్వర్తించాల్సిందే
ఏఎన్‌ఎంలకు ఐప్యాడ్లు, ఆశాలకు ఐఫోన్లు
మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులు

ఈనాడు- హైదరాబాద్‌: ఆసుపత్రుల్లో ఎంత మంచి ఆహారం పెట్టినా.. పక్కనే దుర్వాసన వస్తుంటే ఎలా తినగలరని, ఆసుపత్రుల్లో పారిశుద్ధ్యాన్ని అత్యంత ప్రాధాన్యాంశంగా పరిగణించాలని మంత్రివర్గ ఉపసంఘం సూచించింది. వార్డులు, మరుగుదొడ్లు, స్నానాల గదులను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపింది. బోధనాసుపత్రుల్లో వైద్యులు సమయపాలన పాటించకపోడంతో రోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అభిప్రాయపడింది. సమయపాలన పాటించని వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బయోమెట్రిక్‌ విధానాన్ని విధిగా అమలుచేయాలని ఆదేశించింది.  రాష్ట్రంలో వైద్యసేవల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో భద్రపర్చాలని సూచించింది. ఇందుకోసం ఆశాలకు ఐఫోన్లు, ఏఎన్‌ఎంలకు ఐప్యాడ్‌లు అందించాలని సిఫార్సు చేసింది. ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగుపర్చేందుకు ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం బీఆర్‌కే భవన్‌లో ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధ్యక్షతన గురువారం సమావేశమైంది.
ఇందులో ఉపసంఘం సభ్యులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌లతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, కాళోజీ ఆరోగ్యవర్సిటీ ఉపకులపతి డాక్టర్‌ కరుణాకర్‌రెడ్డి, వైద్యవిద్య సంచాలకులు డాక్టర్‌ రమేశ్‌రెడ్డి, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు, తెలంగాణ రాష్ట్ర వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, సీఎం పేషీ ఓఎస్డీ డాక్టర్‌ టి.గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఉపసంఘం చేసిన కీలక సూచనలివి..
* ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు, పరికరాల అసమతౌల్యంపై దృష్టిపెట్టి తక్షణమే చక్కదిద్దాలి. అవసరం లేని చోటు నుంచి అవసరమున్న మరోచోటుకు వైద్యశాలలను తరలించాలి. సిబ్బంది సర్దుబాటులోనూ హేతుబద్ధత పాటించాలి.
* ఈ నెలాఖరు లేదా వచ్చే నెలలో తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి వైద్యసేవలను పరిశీలించాలి.
* వైద్యశాఖలోని ఒప్పంద, పొరుగు సేవల సిబ్బందికి ఒకటో తేదీనే కచ్చితంగా వేతనాలివ్వాలి.
* కాన్పు కోతలు, గర్భసంచి కోతలను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలి.
* తెలంగాణ వైద్యవిధాన పరిషత్‌ ఆసుపత్రుల పనితీరును బేరీజు వేసి, పనితీరును మెరుగుపర్చుకోవాలి.
* సమగ్ర ఆరోగ్య సర్వేను ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలి.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని