జోన్లు కుదిరినా.. ఎదురు చూపులేనా!
close

ప్రధానాంశాలు

జోన్లు కుదిరినా.. ఎదురు చూపులేనా!

రాష్ట్రంలో తొలి గ్రూప్‌-1 ప్రకటనపై మీనమేషాలు

ఈనాడు, హైదరాబాద్‌ : రాష్ట్ర తొలి గ్రూప్‌-1 ప్రకటన కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. మూడేళ్ల క్రితమే ప్రకటన జారీ చేయాలనుకున్నప్పటికీ, నూతన జోనల్‌ విధానం అమల్లోకి తీసుకురావాలన్న నిర్ణయంతో నిలిచిపోయింది. ప్రస్తుతం రాష్ట్రపతి నూతన ఉత్తర్వులు అమల్లోకి వచ్చినప్పటికీ, సర్వీసు నిబంధనలు, పోస్టుల పునర్విభజన కాకపోవడంతో ప్రక్రియ ముందుకు సాగడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా మూడేళ్ల క్రితమే దాదాపు 137 పోస్టులను  గుర్తించిన సర్కారు, భర్తీ చేసేందుకు టీఎస్‌పీఎస్సీకి ఆదేశాలిచ్చింది. అప్పట్నుంచి సాధారణ పరిపాలన శాఖ, ప్రభుత్వ విభాగాధిపతుల నుంచి సవరణ ప్రతిపాదనలు అందకపోవడంతో ఈ ప్రకటన వెలువడలేదు.
ఉమ్మడి రాష్ట్రంలో 122 పోస్టులు...
ఉమ్మడి రాష్ట్రంలో గ్రూప్‌-1 ప్రకటనకు తెలంగాణ ఏర్పాటయ్యాక ఇంటర్వ్యూలు జరిగాయి. రాష్ట్రానికి 128 పోస్టులు లభించాయి. మౌఖిక పరీక్షలు నిర్వహించి 122 పోస్టులను కమిషన్‌ భర్తీ చేసింది. సరైన అభ్యర్థులు లేని కారణంగా ఆరు పోస్టులు బ్యాక్‌లాగ్‌గా మిగిలిపోయాయి. 2018లో తెలంగాణ తొలి గ్రూప్‌-1 ప్రకటన కింద 137 పోస్టులు భర్తీ చేయాలని భావించినా, చివరి నిమిషంలో ప్రక్రియ నిలిచిపోయింది. ఈ నోటిఫికేషన్‌లో డిప్యూటీ కలెక్టర్‌ పోస్టులు-8, డీఎస్పీ పోస్టులు 42 ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ ముగిసే సమయానికి ఈ రెండు కేటగిరీల్లోనే దాదాపు 60కి పైగా పోస్టుల భర్తీకి అనుమతులు వచ్చే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు నాడు అంచనా వేశాయి.  గ్రూప్‌-3 కింద 339 పోస్టులు గుర్తించి భర్తీ చేసేందుకు కమిషన్‌కు సర్కారు ఆదేశాలిచ్చింది.  
మూడేళ్లయినా అందని ప్రతిపాదనలు
గ్రూప్‌-1, 3 ప్రకటనలు వెలువరించే సమయానికి నూతన జోనల్‌ విధానం అమలు చేయాలని ప్రభుత్వం భావించింది. సర్కారు ప్రతిపాదనలకు రాష్ట్రపతి ఆమోదం కూడా లభించింది. దీంతో అప్పటికే గుర్తించిన గ్రూప్‌-1, 3 పోస్టులను రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల మేరకు సర్వీసు నిబంధనలు రూపొందించి, సవరణ ప్రతిపాదనలు పంపించాలని టీఎస్‌పీఎస్సీ ప్రభుత్వాన్ని కోరింది. మూడేళ్లవుతున్నా సవరణ ప్రతిపాదనలు కమిషన్‌కు అందలేదు. మరోవైపు నూతన ఉత్తర్వుల మేరకు ప్రభుత్వ విభాగాల వారీగా జిల్లా, జోనల్‌, మల్టీజోనల్‌ పోస్టుల పునర్విభజన, సర్వీసు నిబంధనలు, నూతన రోస్టర్‌ కసరత్తు మూడేళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఈ ప్రక్రియ పూర్తయితేనే గ్రూప్‌-1, 3 ప్రకటనలు వెలువడతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని