ఏడాదైంది.. ఏదీ ఆత్మ నిర్భర్‌?
close

ప్రధానాంశాలు

ఏడాదైంది.. ఏదీ ఆత్మ నిర్భర్‌?

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఆదుకునేలా ప్యాకేజీని పునర్‌ నిర్వచించాలి
భారీ ఆర్థిక గ్రాంటును ఇవ్వాలి
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలకు మంత్రి కేటీఆర్‌ లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా సంక్షోభానికి ప్రభావితమైన వివిధ రంగాలను ఆదుకునేందుకు ప్రధాని నరేంద్రమోదీ రూ.20 లక్షల కోట్లతో ఆత్మ నిర్భర్‌ భారత్‌ పేరిట సహాయ ప్యాకేజీ ప్రకటించి ఏడాదవుతున్నా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ)కు ఎలాంటి సాయం అందలేదని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. రాష్ట్ర తయారీ రంగానికి వెన్నెముకగా నిలుస్తున్న ఎంఎస్‌ఎంఈలకు ప్యాకేజీ ద్వారా లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వపరంగా గట్టి ప్రయత్నాలు చేసినా ఫలించలేదన్నారు. రాష్ట్రంలో ఉన్న 80 శాతానికిపైగా పరిశ్రమలు లాక్‌డౌన్‌ నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, 25 శాతానికి పైగా తమ రాబడులను పూర్తిగా కోల్పోయాయన్నారు. గత ఏడాది ప్రకటించిన ఆత్మనిర్భర్‌ సహాయ ప్యాకేజీలో ఎన్నో పరిమితులు, ఇబ్బందులు ఉన్నందున దానిని పునర్‌ నిర్వచించి కరోనా కారణంగా దెబ్బతిన్న రంగాలు, ఎంఎస్‌ఎంఈలకు వీలైనంత ఎక్కువ చేయూత అందించేలా చూడాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కరోనా నష్టాలను భరించేలా భారీ ఆర్థిక గ్రాంట్‌ ఇవ్వాలన్నారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు గురువారం లేఖ రాశారు.
ఆకర్షణేమీ లేదు
‘‘ప్యాకేజీలో ప్రధానంగా ఎంఎస్‌ఎంఈలకు అత్యవసర పూచీ పరపతి పథకం కోసం రూ. మూడు లక్షల కోట్లను కేటాయించారు. దీని మార్గదర్శకాలు వెలువడిన తర్వాత అందులో ప్రత్యేక ఆకర్షణ ఏమీ లేదని ఎంఎస్‌ఎంఈలు భావిస్తున్నాయి. పైగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందే ప్రక్రియ అత్యంత సంక్లిష్టంగా ఉండడంతో అవి అనేక వ్యయప్రయాసలకు గురవుతున్నాయి. ఈ పథకం ద్వారా వాటి అవసరాలు తీరే అవకాశం లేదు. సంవత్సరానికి పైగా  కష్టాల్లో ఉన్న చిన్న పరిశ్రమలు ఈ రోజుకు కూడా సరఫరా ఆధారిత పంపిణీ,  కార్మికుల కొరత వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి.
రుణభారంతో సతమతమవుతున్న ఎంఎస్‌ఎంఈ యూనిట్లు, ఆవిష్కరణలకు ప్రాధాన్యమిచ్చే వాటి కోసం ప్యాకేజీలో మరో రెండు పథకాలను ప్రకటించారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రాష్ట్రంలోనే కాదు.. దేశంలో ఎక్కడా అవి ప్రారంభమే కాలేదు. రుణభారంతో సతమతమవుతున్న ఎంఎస్‌ఎంఈల కోసం ప్రకటించిన సబార్డినేట్‌ డెబిట్‌ పథకం అత్యంత తక్కువ రుణ మొత్తాన్ని అందిస్తోంది. ఇది ఎంఎస్‌ఎంఈల అవసరాలకు ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో పాటు  ఆవిష్కరణల చిన్న పరిశ్రమలకు ప్రకటించిన కార్పస్‌ ఫండ్‌ స్కీమ్‌ మార్గదర్శకాలు ఇంతవరకు విడుదల కాలేదు.
కరోనా సంక్షోభం స్వల్పకాలమే ఉంటుందని, ఈ కాలానికి ప్యాకేజీ సరిపోతుందని ఆశించాం. అయితే ప్రస్తుతం కరోనా సంక్షోభం రెండో దశను సైతం దాటి కొనసాగుతోంది. మూడోదశ కూడా వచ్చే అవకాశం ఉంది.  ఈ నేపథ్యంలో, ప్రస్తుత ఆత్మ నిర్భర్‌ సహాయ ప్యాకేజీలో మార్పులు చేస్తే ఎంఎస్‌ఎంఈ రంగానికి మరింత చేయూత లభిస్తుంది. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రయత్నాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ ప్యాకేజీ విషయంలో మా ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని, రాష్ట్రాల అంచనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి’’ అని కేటీఆర్‌ లేఖలో కోరారు.


పీఎల్‌ఐ పథకం కూడా అంతే..

ప్యాకేజీలో కీలక రంగాలకు ప్రకటించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ)  ద్వారా దేశంలోని ఎంఎస్‌ఎంఈలపై పెద్దఎత్తున సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉండేది. కానీ అది కేవలం పెద్ద తయారీ కంపెనీలకు మాత్రమే ప్రయోజనాలు చేకూర్చేలా ఉంది. ఎంఎస్‌ఎంఈలతో కూడిన సరఫరా, డిమాండు అనుసంధాన వ్యవస్థ ఏర్పాటు చేయాలని భారీ తయారీ కంపెనీలకు ఒక నిబంధన రూపొందించాలి. తద్వారా  పీఎల్‌ఐ ప్రయోజనాలను ఆయా ఎంఎస్‌ఎంఈలతో పంచుకునేలా మార్గదర్శకాలను మార్చాలి.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని