మైక్రోసాఫ్ట్‌ ఛైర్మన్‌గా సత్య నాదెళ్ల
close

ప్రధానాంశాలు

మైక్రోసాఫ్ట్‌ ఛైర్మన్‌గా సత్య నాదెళ్ల

ఈ స్థాయికి చేరిన తొలి భారతీయుడు
తెలుగు తేజానికి సమున్నత స్థానం

తెలుగు తేజానికి ఐటీ రంగంలో సమున్నత స్థానం దక్కింది. సాఫ్ట్‌వేర్‌ రంగంలో అంతర్జాతీయ దిగ్గజమైన మైక్రోసాఫ్ట్‌ ఛైర్మన్‌గా సత్య నాదెళ్ల (53)ను నియమిస్తూ మైక్రోసాఫ్ట్‌ కార్పొరేషన్‌ బోర్డు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ముఖ్య  కార్యనిర్వహణాధికారిగా (సీఈఓ) ఉన్న సత్య నాదెళ్ల కంపెనీ ఛైర్మన్‌గా కూడా వ్యవహరించనున్నారు. అంతటి ఉన్నత స్థానానికి ఎదిగిన తొలి భారతీయుడిగా ఆయన ఘనత సాధించారు.

న్యూయార్క్‌: ఏడేళ్లుగా మైక్రోసాఫ్ట్‌ సీఈఓగా సత్య నాదెళ్ల సాధించిన అద్భుత విజయాలు, తీసుకొచ్చిన సమూల మార్పుల ఫలితంగా ఆయనకు మైక్రోసాఫ్ట్‌ ఛైర్మన్‌ పదవి దక్కింది. ఆ సంస్థ మార్కెట్‌ విలువ 2 లక్షల కోట్ల డాలర్లకు చేర్చడంలో సత్య నాదెళ్ల పాత్రను గుర్తించే, బోర్డు ఈ సమున్నత స్థానాన్ని అప్పగించింది. దీంతో బోర్డు ఎజెండాను నిర్ణయించే అధికారం ఆయనకు దక్కనుంది. ప్రస్తుత ఛైర్మన్‌ జాన్‌ థామ్సన్‌ స్థానంలో సత్య నాదెళ్ల త్వరలో బాధ్యతలు చేపడతారు. తద్వారా ఆయన శక్తియుక్తులపై మైక్రోసాఫ్ట్‌ యాజమాన్యం ఎంతో విశ్వాసాన్ని ప్రకటించినట్లయ్యింది. 2014లో స్టీవ్‌ బామర్‌ నుంచి మైక్రోసాఫ్ట్‌ సీఈఓగా సత్య నాదెళ్ల బాధ్యతలు స్వీకరించారు.  తాజాగా బోర్డులోని స్వతంత్ర డైరెక్టర్లందరూ ఏకగ్రీవంగా ఆయనను ఛైర్మన్‌గా ఎంపిక చేసుకున్నట్లు మైక్రోసాఫ్ట్‌ బుధవారం వెల్లడించింది. ‘వ్యూహాత్మక అవకాశాలను కంపెనీ చేజిక్కించుకునేందుకు, వ్యాపారంలో ఉన్న కీలక ఇబ్బందులను గుర్తించి, వాటికి తగిన పరిష్కారాలను బోర్డుకు సూచించేందుకు సత్య నాదెళ్లకు ఉన్న అవగాహన బాగా ఉపయోగపడుతుంద’ని కంపెనీ తెలిపింది.
రెండు బాధ్యతలతో మరింత కీలకం
మైక్రోసాఫ్ట్‌ ఛైర్మన్‌గా కంపెనీకి లక్ష్యాలను నిర్దేశించే బోర్డుకు సత్య నాదెళ్ల ఆధ్వర్యం వహిస్తారు. ఏయే విభాగాల్లో ముందుకు వెళ్లాలి? సరికొత్త రంగాలను ఎంచుకోవడం వంటివీ చూస్తారు. బోర్డు మార్గనిర్దేశకత్వానికి అనుగుణంగా కంపెనీ రోజువారీ వ్యవహారాలను సీఈఓగా సత్య నాదెళ్లే ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. రెండు బాధ్యతలు ఒకరికే ఉండటంతో, మరింత కీలకంగా వ్యవహరించాల్సి వస్తుంది.
బిల్‌గేట్స్‌, థామ్సన్‌, సత్య నాదెళ్ల
మైక్రోసాఫ్ట్‌కు ఛైర్మన్‌ అయ్యే అవకాశం ఇప్పటి వరకూ ముగ్గురికే దక్కింది. తొలుత బిల్‌గేట్స్‌, ఆ తర్వాత జాన్‌ థామ్సన్‌ ఛైర్మన్లు అయ్యారు. ఇప్పుడు సత్య నాదెళ్ల కూడా బిల్‌గేట్స్‌ తరహాలోనే సీఈఓ బాధ్యతల్లో కొనసాగుతూనే ఛైర్మన్‌ అవుతున్నారు. ఆయన కంటే ముందు మైక్రోసాఫ్ట్‌ సీఈఓగా పనిచేసిన స్టీవ్‌ బామర్‌కు ఛైర్మన్‌ అయ్యే అవకాశం లభించలేదు.
ప్రధాన స్వతంత్ర డైరెక్టర్‌గా జాన్‌ థామ్సన్‌
ప్రస్తుతం మైక్రోసాఫ్ట్‌ ఛైర్మన్‌గా ఉన్న జాన్‌ థామ్సన్‌ను ప్రధాన(లీడ్‌) స్వతంత్ర డైరెక్టర్‌గా సంస్థ నియమించింది. ఈయన 2012-14 సమయంలో ఈ పాత్రనే పోషించారు. బోర్డు సమావేశాలకు స్వతంత్ర డైరెక్టర్ల తరఫున ప్రతిపాదనలు అందించడం, వారిని సమావేశాలకు పిలవడం, ఎగ్జిక్యూటివ్‌ సెషన్ల కోసం ఎజెండా నిర్ణయించడం, సీఈఓ పని తీరు మదింపు వంటి ముఖ్యమైన అధికారాల్ని థామ్సన్‌ కలిగి ఉంటారని కంపెనీ వెల్లడించింది. ఈ మార్పులతో పాటు ఒక్కో మైక్రోసాఫ్ట్‌ షేరుకు త్రైమాసిక డివిడెండ్‌ 0.56 డాలర్లను బోర్డు ప్రతిపాదించింది. సెప్టెంబరు 9న డివిడెండ్‌ చెల్లించనున్నట్లు తెలిపింది. ఆగస్టు 19ని రికార్డు తేదీగా నిర్ణయించింది.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని