43 ఏళ్ల వివాదం.. 24 ఏళ్లకు న్యాయం
close

ప్రధానాంశాలు

43 ఏళ్ల వివాదం.. 24 ఏళ్లకు న్యాయం

కల్యాణ్‌నగర్‌ సొసైటీ భూములకు పరిహారం చెల్లించండి
ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు
ఖజానాపై రూ.2 వేల కోట్లకు పైగా భారం పడే అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ యూసుఫ్‌గూడలోని కల్యాణ్‌నగర్‌ కోఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ భూములకు పరిహారం చెల్లించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నాటి అధికారుల అలసత్వాన్ని ఎండగట్టింది. అప్పటి ఎమ్మెల్యే పి.జనార్దన్‌రెడ్డి ఆక్రమణలను ప్రోత్సహించారని ఈ సందర్భంగా ప్రస్తావించింది. రాజకీయ ఒత్తిళ్లతో నాడు ఆక్రమణలు తొలగించకపోవడంతో ప్రస్తుతం ఖజానాపై సుమారు రూ.2 వేల కోట్లకు పైగానే భారం పడే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
అల్పాదాయ, మధ్యతరగతి కుటుంబాలు కల్యాణ్‌నగర్‌ సొసైటీగా ఏర్పడి ఇళ్ల కోసం కొనుగోలు చేసిన భూములు ఆక్రమణలకు గురయ్యాయి. ఈ వివాదం వివిధ స్థాయుల్లో 43 ఏళ్లుగా నడుస్తోంది. 1997లో కల్యాణ్‌నగర్‌ సొసైటీ హైకోర్టును ఆశ్రయించింది. దీర్ఘకాలంగా సాగుతున్న వివాదానికి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం 24 ఏళ్లకు ముగింపు పలికింది.

112 పేజీల తీర్పు...
‘‘హైదరాబాద్‌ కల్యాణ్‌నగర్‌ కోఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీకి యూసుఫ్‌గూడలో ఉన్న 38 ఎకరాల్లో ఆక్రమణలను రాజకీయ ఒత్తిళ్లతో అధికారులు తొలగించలేదు. అధికార దుర్వినియోగంతో సహజ న్యాయసూత్రాలకు తిలోదకాలు ఇచ్చి మురికివాడల అభివృద్ధి చట్టం కింద భూమిని తీసుకున్నారు. ఆ భూసేకరణ నోటిఫికేషన్‌లు చెల్లవు. ప్రస్తుతం అక్కడ పక్కా నిర్మాణాలతో నివాసాలున్నాయి. ఖాళీ చేయించడం అసాధ్యమైనందున, 2013 భూసేకరణ చట్టం కింద పరిహారం చెల్లించాలి’’ అని హైకోర్టు ఆదేశించింది. ఖర్చుల కింద మరో రూ.2 లక్షలు సొసైటీకి చెల్లించాలని పేర్కొంది. కల్యాణ్‌నగర్‌ సొసైటీ సహా పలువురు దాఖలు చేసిన మొత్తం 9 పిటిషన్‌లపై విచారించిన జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల 112 పేజీల తీర్పు వెలువరించింది.
ఎమ్మెల్యే ఒత్తిళ్లతో ప్రజల హక్కులను అధికారులు కాపాడటంలో విఫలం
‘‘ప్రత్యామ్నాయ భూములను ఇవ్వాలని న్యాయస్థానం పదేపదే చెబుతున్నా, ఇస్తామని చెబుతూ ప్రభుత్వం రెండు దశాబ్దాలు కాలయాపన చేసింది. అటు పరిహారం ఇవ్వలేదు.. ఇటు ప్రత్యామ్నాయం చూపలేదు. ఎమ్మెల్యే ఒత్తిళ్లతో అధికారులు ప్రజల హక్కులను కాపాడటంలో విఫలమయ్యారు. అసాంఘిక శక్తులను అడ్డుకోవడానికి తీసుకువచ్చిన భూఆక్రమణల నిరోధక చట్టం లక్ష్యం నెరవేరలేదు. 1989లో అయితే పోలీసుల సాయంతో ఖాళీ చేయించి ఉండవచ్చు. ఇప్పుడైతే సైన్యమే కావాలి. ప్రత్యేక కోర్టు తీర్పును తొక్కిపెట్టడానికి భూసేకరణ అధికారమనే రంగు పులిమారు. ప్రభుత్వం, అధికారులు చట్టాన్ని దుర్వినియోగం చేశారు. సొసైటీతో చర్చించి 2013 భూసేకరణ చట్టం కింద పరిహారం చెల్లించాలి’’ అని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆ ప్రకారం పరిహారం చెల్లించే పక్షంలో ఖజానాపై సుమారు రూ.2 వేల కోట్ల భారం పడుతుందని అంచనా.


ఇదీ నేపథ్యం...

ల్యాణ్‌నగర్‌ కోఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ 1963-64లో సి.రాజ్యలక్ష్మి, ఎ.రామస్వామిల నుంచి వేర్వేరుగా 38 ఎకరాలు కొని 1978లో లేఔట్‌కు అనుమతులు పొందింది. పట్టణ భూగరిష్ఠ నియంత్రణ చట్టం కింద మినహాయింపులు అవసరం కావడంతో సభ్యులకు రిజిస్ట్రేషన్‌లు కాలేదు. ఎమ్మెల్యే పి.జనార్దన్‌రెడ్డి ప్రోత్సాహంతో ఆక్రమణలు మొదలుకాగా, అప్పట్నుంచి వివాదం మొదలైంది. 1988 నాటికి 503 మంది ఆక్రమించుకున్నారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కార్మికనగర్‌ ఏర్పడింది. ఈ క్రమంలో సొసైటీ సివిల్‌ కోర్టులో ఇంజంక్షన్‌ ఆర్డర్‌ తెచ్చుకోవడంతోపాటు భూఆక్రమణల నిరోధక ప్రత్యేక కోర్టును ఆశ్రయించింది. ఆక్రమణదారులను ఖాళీ చేయించి సొసైటీకి అప్పగించాలని 1989లో ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. అయినా చర్యల్లేవు. మురికివాడల అభివృద్ధి కింద భూసేకరణకు 1991, 1992ల్లో మూడు నోటిఫికేషన్‌లు జారీ అయ్యాయి. కార్మికనగర్‌ వాసులకు పట్టాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు 1997లో ‘ఈనాడు’లో వార్త ప్రచురితం కావడంతో సొసైటీ హైకోర్టును ఆశ్రయించింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని