తెలుగుదనాన్ని ఆస్వాదిస్తున్నా
close

ప్రధానాంశాలు

తెలుగుదనాన్ని ఆస్వాదిస్తున్నా

వారం రోజులుగా ఆనందంగా గడుపుతున్నా
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ
శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న సీజేఐ

ఈనాడు డిజిటల్‌-కర్నూలు, శ్రీశైలం- న్యూస్‌టుడే: తెలుగు నేల.. తెలుగు గాలి, సువాసనలను వారం రోజులుగా ఆనందంగా అనుభవిస్తున్నానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ పేర్కొన్నారు. మహిమాన్వితమైన శ్రీశైల క్షేత్రానికి భక్తుడిగా తనకు ఊహ తెలిసినప్పటినుంచి ఏటా 2,3 సార్లు స్వామివారిని దర్శించుకుంటున్నానని వివరించారు. ఇక్కడ కొలువైన ఆదిదంపతుల అనుగ్రహం పొందుతున్నానని తెలిపారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునస్వామివార్లను సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ సతీసమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు శ్రీశైలంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఘన స్వాగతం పలికారు. అనంతరం సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ విలేకరులతో మాట్లాడారు. కర్నూలు జిల్లాతో తనకు అవినాభావ సంబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. తాను న్యాయవాద వృత్తిలో చేరినప్పుడు న్యాయకోవిదుడు, జిల్లాకు చెందిన ఏరాసు అయ్యపురెడ్డి వద్ద పదేళ్లు జూనియర్‌గా పనిచేశానని అన్నారు. అత్యున్నతమైన పదవికి చేరేలా తనను ప్రోత్సహించినందుకు అయ్యపురెడ్డికి, ఆయన కుటుంబీకులకు కృతజ్ఞతలు తెలిపారు. తాను శ్రీశైలం వస్తున్నట్లు గురువారం సాయంత్రం తెలిపినప్పటికీ స్వల్ప వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏర్పాట్లు చేసినందుకు, స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో సీజేఐ గంటసేపు గడిపారు.
ఘనస్వాగతం..
సీజేఐగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి శ్రీశైలం వచ్చిన జస్టిస్‌ ఎన్‌వీ రమణకు రాష్ట్ర మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుతో పాటు కర్నూలు జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి, ఆలయ ఈవో కె.ఎస్‌.రామారావు ఘనస్వాగతం పలికారు. రాజగోపురం వద్ద ఆలయ సంప్రదాయం ప్రకారం వేదపండితుల ఆశీర్వాదంతో ఆలయంలోకి ఆహ్వానించారు. మల్లన్న దర్శనం అనంతరం అమ్మవారి ఆలయం వద్ద ఆశీర్వచన మండపంలో స్వామివారి శేషవస్త్రాలు, జ్ఞాపికలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఇటీవల దేవస్థానం రూపొందించిన ‘శ్రీశైల ఖండం’ పుస్తకాన్ని మంత్రి, ఈవోలు సీజేఐకి బహుకరించారు. స్కాంధపురాణంలోని శ్రీశైల ఖండం మూలప్రతిని పరిష్కరించి సంస్కృతంలోని మూలగ్రంథాన్ని తెలుగులో శ్లోకభావార్థాలను రూపొందించడంలో ముఖ్య పాత్ర పోషించిన సంస్కృతాంధ్ర పండితుడు త్రిష్టి లక్ష్మి సీతారామాంజనేయశర్మను సీజేఐ సన్మానించారు. జస్టిస్‌ రమణను కలిసిన వారిలో డీఐజీ వెంకటరామిరెడ్డి, ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్‌ డి.వెంకటరమణ, తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్లు వెంకటేశ్వర్‌రెడ్డి, డి.నాగార్జున, కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాధాకృష్ణ కృపాసాగర్‌, జిల్లా ఫ్యామిలీ కోర్టు జడ్జి శ్రీనివాస్‌ ఉన్నారు.

శాసనాల విశేషాలను తెలుసుకున్న సీజేఐ

శ్రీశైలంలోని పంచమఠాల్లో ఒకటైన ఘంటామఠం జీర్ణోద్ధరణ సందర్భంగా వెలుగుచూసిన తామ్ర శాసనాలను జస్టిస్‌ ఎన్‌వీ రమణ పరిశీలించారు. ఈ శాసనాల విశేషాలను మైసూరు ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా డైరెక్టరు డాక్టర్‌ మునిరత్నంరెడ్డి వివరించారు. ఆ తర్వాత నందినికేతన్‌ అతిథిగృహం వద్ద ‘శ్రీశైల వైభవం’ పుస్తకాలను సీజేఐ తన చేతుల మీదుగా అధికారులు, ప్రజాప్రతినిధులకు అందజేశారు. అనంతరం ఆయన హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని