TS News: లాక్‌డౌన్‌ తొలగింపు?
close

ప్రధానాంశాలు

TS News: లాక్‌డౌన్‌ తొలగింపు?

రాకపోకలు యథాతథం
జనసమ్మర్దంపై ఆంక్షలు
నేడు మంత్రిమండలి అత్యవసర సమావేశంలో నిర్ణయించే అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో లాక్‌డౌన్‌కు ముగింపు పలకాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. జన సమ్మర్థం, రద్దీపై ఆంక్షలు కొనసాగించేందుకు యోచిస్తోంది. థియేటర్లు, పబ్బులు, క్లబ్బులు, బార్లు వంటి వాటి మూసివేత కొనసాగనుంది. వివాహాలు, అంత్యక్రియల లాంటి వాటిపై పాత నిబంధనలు అమలు చేయనుంది. శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో లాక్‌డౌన్‌తో పాటు ఇతర కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ గడువు శనివారంతో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో దానిపై నిర్ణయం తీసుకునే ప్రధాన ఎజెండాపై మంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకునేందుకు వీలుగా మంత్రిమండలి సమావేశం జరపాలని సీఎం నిర్ణయించారు. మంత్రులందరికీ ఆయన స్వయంగా ఫోన్‌ చేసి సమావేశానికి హాజరు కావాలని ఆహ్వానించారు. అందుబాటులో ఉన్న మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌ గౌడ్‌, కొప్పుల ఈశ్వర్‌ తదితరులతో సీఎం శుక్రవారం ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. సీఎం ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులకు అత్యవసర సమాచారం ఇచ్చారు. ప్రాథమికంగా కొన్ని అంశాలతో ఎజెండాను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ తగ్గుతుండడంపై వైద్య ఆరోగ్యశాఖ నివేదిక రూపొందించినట్లు తెలిసింది. మూడో దశ గురించి ఉన్న భయాందోళనలపైనా సీఎం వైద్య ఆరోగ్యశాఖ నుంచి స్పష్టత కోరారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో లాక్‌డౌన్‌ మినహాయింపునకే ప్రభుత్వం మొగ్గుచూపే అవకాశం ఉంది. ఈ సందర్భంగా మాస్క్‌ల ధారణ వంటి కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్సీ ఎంపికపై...
రాష్ట్రంలో ఈ నెల 16న గవర్నర్‌ నామినేటెడ్‌ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి పదవీ విరమణతో ఆ స్థానం ఖాళీ అయింది. అప్పటికే ఖాళీ అయిన ఎమ్మెల్యేల కోటా ఆరు స్థానాలతో కలిపి దీనిని భర్తీ చేయాలని మొదట ప్రభుత్వం భావించింది. ఏపీలో నామినేటెడ్‌ ఎమ్మెల్సీల నియామకం జరగడంతో.. ఇక్కడా వెంటనే భర్తీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీనిని టేబుల్‌ ఎజెండాలో చేరుస్తున్నట్లు సమాచారం.

కల్తీ విత్తనాలపై  ఉక్కుపాదం
రాష్ట్రంలో వ్యవసాయ సీజన్‌లో ఇబ్బందులు లేకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎం ఇప్పటికే ఆదేశించారు. పోలీసు, వ్యవసాయ శాఖలను అప్రమత్తం చేయడంతో అవి విస్తృతంగా దాడులు నిర్వహిస్తూ నకిలీ విత్తనాలను పెద్దఎత్తున స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నకిలీ విత్తనాలపై మరింత కట్టడికి మంత్రిమండలిలో నిర్ణయం తీసుకోనున్నారు.

ఏపీ ప్రాజెక్టులపై...
ఏపీ ప్రభుత్వం కృష్ణానదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, మంత్రులు సీఎంకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సీఎం మంత్రులు, నీటిపారుదల శాఖ అధికారుల నుంచి తీసుకున్నారు. అక్రమ ప్రాజెక్టులపై కఠిన వైఖరిని అవలంబించాలనే అభిప్రాయం ఈ సందర్భంగా వ్యక్తమైంది. మంత్రిమండలిలో దీనిపై సమగ్ర చర్చ జరగనుంది.

హుజూరాబాద్‌పై...
మంత్రిమండలి అధికారిక ఎజెండా అనంతరం మంత్రులతో సీఎం రాజకీయపరమైన అంశంపై చర్చించనున్నట్లు తెలిసింది. ప్రధానంగా హుజూరాబాద్‌ ఉప ఎన్నికల సమగ్ర ప్రణాళిక రూపకల్పనపై అందరి అభిప్రాయాలు సీఎం తీసుకోనున్నారని తెలుస్తోంది. నియోజకవర్గంలోని ఏడు మండలాలు, రెండు పురపాలికలకు ఇన్‌ఛార్జీల నియామకం, పర్యటనలు, ఇతరత్రా వ్యూహాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని