2 వేల దిగువకు మరణాలు
close

ప్రధానాంశాలు

2 వేల దిగువకు మరణాలు

24 గంటల్లో 62,480 కేసులు

ఈనాడు, దిల్లీ: దేశంలో ఆందోళనకర రీతిలో కొవిడ్‌ మరణాలు నమోదైన రెండో ఉద్ధృతిలో శుక్రవారం ఒకింత ఊరటనిచ్చేలా వాటి సంఖ్య తగ్గింది. ఏప్రిల్‌ 18 తర్వాత తొలిసారిగా మరణాలు 2 వేల లోపునకు తగ్గాయి. గత 24 గంటల్లో 62,480 కొత్త కేసులు బయటపడగా 1,587 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2,97,62,793కి చేరగా.. ఇంతవరకు 3,83,490 మంది ప్రాణాలు కోల్పోయారు.
* క్రియాశీలక కేసుల సంఖ్య 73 రోజుల తర్వాత 8 లక్షల దిగువకు (7,98,656) చేరింది. ఒక్క రోజులో 88,977 మంది కోలుకోగా రికవరీ రేటు 96.03%కి పెరిగింది. ఇంతవరకు మొత్తం 2,85,80,647 మంది కొవిడ్‌ను జయంచారు.
* దేశవ్యాప్తంగా గురువారం 19,29,476 కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు జరిపారు. రోజువారీ పాజిటివిటీ రేటు 3.24%గా నమోదైంది. వారపు పాజిటివిటీ రేటు 3.80%కి తగ్గింది.
* రోజువారీ కేసుల్లో కేరళలో మాత్రమే పది వేలకు పైగా (12,469) నమోదయ్యాయి. క్రితం రోజు వరకు ఇలాంటి రాష్ట్రాల సంఖ్య 4 వరకు ఉంది. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకలో కేసులు 10 వేల లోపునకు తగ్గాయి.


ఆరోగ్య సిబ్బంది భద్రతకు చర్యలు తీసుకోండి

దిల్లీ: కొవిడ్‌పై పోరులో అత్యంత కీలకంగా.. పూర్తి నిబద్ధతతో పనిచేస్తున్న ఆరోగ్య సంరక్షణ సిబ్బంది భద్రతకు గాను అంటువ్యాధుల చట్టాన్ని (ఎపిడమిక్‌ డిసీజెస్‌ యాక్ట్‌) కట్టుదిట్టంగా అమలు చేయాలని  రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల (యూటీలు)ను కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ రాష్ట్రాలు, యూటీల అదనపు ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ఆరోగ్య కార్యదర్శులకు లేఖ రాశారు. కొవిడ్‌ కట్టడిలో అన్ని విధాలుగా ఆరోగ్య సంరక్షణ సిబ్బంది కీలక సేవలందిస్తున్నట్లు పేర్కొన్నారు. వారి నివాస, పనిచేసే ప్రాంతాల్లో భద్రత కల్పించాల్సిన అవసరాన్ని అనేక సందర్భాల్లో కేంద్రం స్పష్టం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఇటీవల వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బందిపై పలుచోట్ల.. ప్రత్యేకించి అస్సాం, పశ్చిమబెంగాల్‌, కర్ణాటకల్లో భౌతిక దాడులు జరిగిన విషయాన్ని ఆయన లేఖలో ప్రస్తావించారు. ఇలాంటి ఘటనలు వారి నైతికస్థైర్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ విషయానికి ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా అన్ని రాష్ట్రాలు సమగ్రంగా సమీక్షించి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు.


కొవిడ్‌కు 40 లక్షల మంది బలి!

న్యూయార్క్‌: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ మహమ్మారి బారినపడి 40 లక్షల మంది బలైపోయారు. ఇందులో సగం మరణాలు గత ఐదారు నెలల్లోనే నమోదయ్యాయి. తొలి 20 లక్షల మరణాలు సంభవించడానికి ఏడాదికి పైగా పట్టగా.. కేవలం 166 రోజుల్లోనే మరో 20 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంతవరకు 17.75 కోట్ల మందికి పైగా కరోనా బారిన పడ్డారు. ఈమేరకు ‘రాయ్‌టర్‌’ వార్తాసంస్థ గణాంకాలను వెల్లడించింది.
* ప్రపంచంలో అత్యధిక మరణాలు సంభవించిన తొలి 6 దేశాల్లో అమెరికా, బ్రెజిల్‌, భారత్‌, మెక్సికో, పెరూ, రష్యాలు ఉన్నాయి.
* అమెరికా, బ్రిటన్‌లలో కొత్త కేసులు, మరణాల సంఖ్య తగ్గుముఖం పడుతున్నప్పటికీ భారత్‌, బ్రెజిల్‌లో రోజువారీ మరణాలు ఎక్కువగానే ఉన్నాయి.
Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని