విద్యార్థి వీసా స్లాట్ల పెంపు
close

ప్రధానాంశాలు

విద్యార్థి వీసా స్లాట్ల పెంపు

అమెరికా రాయబార కార్యాలయం నిర్ణయం
జులై నెల స్లాట్లు త్వరలో విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు కొంత ఊరట లభించనుంది. విద్యార్థుల నుంచి పెరుగుతున్న డిమాండు మేరకు వీసా స్లాట్లు పెంచాలని భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం నిర్ణయించింది. జులై, ఆగస్టు నెలల్లో అమెరికాలో విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టటంతో ఇటీవల వీసా కార్యకలాపాలు మొదలయ్యాయి. ప్రస్తుతం విద్యార్థి వీసాల ప్రక్రియ మాత్రమే నడుస్తోంది. దిల్లీలోని రాయబార కార్యాలయం, ముంబయి, చెన్నై, హైదరాబాద్‌, కోల్‌కతాల్లోని కాన్సులేట్‌ కార్యాలయాలు విద్యార్థి (ఎఫ్‌-1) వీసా ఇంటర్వ్యూలకు శ్రీకారం చుట్టటంతో విద్యార్థుల్లో ఆశలు చిగురించాయి. అపాయింట్‌మెంట్‌ కోసం వారు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తుండడంతో నిమిషాల వ్యవధిలో స్లాట్స్‌ పూర్తవుతున్నాయి. పదేపదే ప్రయత్నించిన వారి ఖాతాలు స్తంభిస్తున్నాయి. వెంటవెంటనే ప్రయత్నాలు చేయవద్దని అమెరికా రాయబార కార్యాలయం ట్విటర్‌ ద్వారా స్పష్టం చేసింది.
త్వరలో జులై కోటా
విద్యార్థుల నుంచి అభ్యర్థనలు వెల్లువెత్తుతుండటంతో వీసా స్లాట్లు పెంచేందుకు అమెరికా అధికారులు చర్యలు చేపట్టారు. జులై నెల కోటాను త్వరలో విడుదల చేయనున్నారు. దేశంలోని అయిదు ప్రాంతాల్లో సగటున రోజుకు 800 నుంచి 1,500 వరకు వీసా స్లాట్లు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్‌లోని కాన్సులేట్‌ కార్యాలయంలో రోజుకు సగటున 600 నుంచి 800 స్లాట్లు విడుదల చేసేవారు.
బి1/బి2 వీసాలతో ప్రవేశం లేదు
కేవలం విద్యార్థి వీసా ఉన్న వారికే ప్రస్తుతం అవకాశం కల్పిస్తున్నట్లు రాయబార కార్యాలయం స్పష్టం చేస్తోంది. వీసా పొందినప్పటికీ, తరగతుల ప్రారంభానికి 30 రోజుల ముందు మాత్రమే అమెరికాలో ప్రవేశానికి అనుమతి లభిస్తుంది. పర్యాటక వీసా (బి1/బి2)లపై విద్యార్థుల తల్లిదండ్రులను అనుమతించేది లేదని అమెరికా ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. అమెరికా వెళ్లే విద్యార్థులు టీకా వేయించుకొనే విషయంలో ఆయా విశ్వవిద్యాలయాలదే తుది నిర్ణయంగా ఉంది. హైదరాబాద్‌ మాత్రమే కాకుండా దిల్లీ, చెన్నై, కోల్‌కతాలలో ఎక్కడ స్లాట్‌ లభించినా ఇంటర్వ్యూకు హాజరైనా ఎలాంటి ఇబ్బంది ఉండదు అని కాన్సులేట్‌ అధికారులు స్పష్టం చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని